బీపీ.. హై

ABN , First Publish Date - 2021-10-30T05:07:43+05:30 IST

గుంటూరుకు చెందిన సుబ్బారావు సన్నగా ఉంటారు. ఆయనకు యాబై ఏళ్లు ఉన్నాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు

బీపీ.. హై

గుంటూరులో 40 శాతం మందికి బీపీ

10 శాతం మందికి మరీ హై బీపీ

రక్తపోటు చూసి వైద్యులే హైరానా


గుంటూరు(మెడికల్‌), అక్టోబరు 29: గుంటూరుకు చెందిన సుబ్బారావు సన్నగా ఉంటారు. ఆయనకు యాబై ఏళ్లు ఉన్నాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అయినా ఆయనకు శుక్రవారం ఓ వైద్యుడు బీపీ చెక్‌ చేస్తే సాధారణ స్థాయి దాటి హైబీపీ ఉన్నట్లు గుర్తించాడు. అప్పటి వరకు తనకు బీపీ ఉన్నట్లు తెలియదని సుబ్బారావు చెప్పడంతో ఆశ్చర్యపోవడం డాక్టర్‌ వంతైంది. ముప్పై ఐదేళ్ల సుజాతకు బీపీ చెక్‌ చేస్తే గ్రేడ్‌3 హైపర్‌ టెన్షన్‌ ఉన్నట్లు తేలింది. ఆమె బీపీ మందులు వాడుతున్నా ఇంత ఎక్కువ స్థాయిలో రక్తపోటు ఎందుకు ఉందో వైద్యులకు ఒక పట్టానా అర్థం కాలేదు. గుంటూరు నగరంలో శుక్రవారం పలు ఆసుపత్రుల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఇవి. ప్రపంచ పక్షవాత అవగాహన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఐఎంఏ, రెడ్‌క్రాస్‌,  ఇండియన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ఉచిత బీపీ వైద్యపరీక్ష శిబిరాలు నిర్వహించారు. 160 మంది డాక్టర్లతో పాటు 800 మంది వలంటీర్లు ఈ శిబిరాల్లో రోగులకు బీపీ పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో మొత్తం 10 వేల మందికి పరీక్షలు నిర్వహించగా, 4 వేల మందికి (40 శాతం) బీపీ ఉన్నట్లు తేలింది. వీరిలో 1100 మందికి హైబీపీ ఉన్నట్లు మొదటిసారిగా బీపీ ఉన్నట్లు ఈ శిబిరాల్లోనే తెలుసుకోవడం విశేషం. ఇక పది శాతం మంది బాధితుల్లో బీపీ మరీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే రక్తపోటు నియంత్రించే మందులను సూచించారు. ‘పక్షవాతానికి దారి తీసే కారణాల్లో హైబీపీ ముఖ్యమైనది. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తరచూ బీపీ పరీక్షలు చేయించుకోవాలని’ ఇండియన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యురాలు, సీనియర్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ పీ విజయ తెలిపారు. 



Updated Date - 2021-10-30T05:07:43+05:30 IST