బీపీ బాధితులు పెరిగారు

ABN , First Publish Date - 2021-10-11T07:14:09+05:30 IST

ఆధునిక యుగంతో పోటీపడుతూ పట్టణాల్లో మారిన జీవనశైలి కారణంగా బీపీ(బ్లడ్‌ప్రషర్‌)తో బాధపడుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అంతేగాక ఆహార అలవాట్ల కారణంగా ఊబకాయం పెరుగుతోంది.

బీపీ బాధితులు పెరిగారు

మారిన జీవన శైలితో రక్తపోటు 

పట్టణాల్లోనే అత్యధికంగా

పల్లెల్లో షుగర్‌ వ్యాధిగ్రస్థులు 

ఉమ్మడి జిల్లాలో వీటితోనే అధిక మరణాలు

ఎన్‌సీడీ పరిశోధనలో వెల్లడి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

ఆధునిక యుగంతో పోటీపడుతూ పట్టణాల్లో మారిన జీవనశైలి కారణంగా బీపీ(బ్లడ్‌ప్రషర్‌)తో బాధపడుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అంతేగాక ఆహార అలవాట్ల కారణంగా ఊబకాయం పెరుగుతోంది. ఇక పట్టణాల్లో మధుమేహ వ్యాధిగ్రస్థులు పెరిగారు. ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన ఎన్‌సీడీ (నాన్‌ కమ్యునికేబుల్‌ డిసీసెస్‌) సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పట్టణాల్లో గుండె, రక్తపోటు సంబంధిత వ్యాధులతో అత్యధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయని అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ (ఎన్‌సీడీ) పరిశోధనలో వెల్లడైంది. కాగా, పల్లెల్లో మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఎక్కువ మంది చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. తాజాగా, కేంద్ర ప్రభుత్వ జనగణన విభాగం సైతం శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ సమస్యల వల్లే అత్యధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయని స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాలోని వైద్యశాఖ అధికారులు ఎన్‌సీడీ కార్యక్రమం కింద ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుండగా పట్టణాల్లో ఊబకాయం, గుండె సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. పట్టణాల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం ఎక్కువని, పల్లెల్లో ప్రజల జీవన విధానం, ఎండలో పనిచేయడం, ఎక్కువ సేపు నీళ్లు తాగకుండా ఉండటం లాంటి కారణాలతో కిడ్నీ సంబంధిత రోగాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు అత్యధిక మంది బీపీ (రక్తపోటు), మధుమేహంతో బాధపడుతున్నారు. దీంతో గుండె రక్తప్రసరణ వ్యవస్థలో మార్పులతో మరణాలు చోటు చేసుకుంటున్నాయి.


రక్తపోటు, కిడ్నీ సమస్యలు

ఎన్‌సీడీ కింద ఉమ్మడి జిల్లాలో దాదాపు 30వేల మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో సుమారు 9వేల మందికి బీపీ ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో వీరిలో చాలా మందికి గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయి. సుమారు 6వేల మంది కిడ్నీ, మూత్ర సంబంధిత రోగాలతో ఇబ్బందిపడుతున్నారు. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారు ఈ మధ్య కాలంలో భారీగా పెరిగారని తేలింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం గుండె సంబంధిత వ్యాధుల కంటే ఇతరత్రా రోగాలు ఎక్కువయ్యాయి. గతంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్‌కేఎ్‌స)లో ఉమ్మడి జిల్లాలో 1,19,999 మంది తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నట్టు తేలింది. అందులో సుమారు 20వేల మంది గుండె సంబంధిత బాధితులే ఉన్నారు. కాగా, ఈ సర్వే నిర్వహించి ఏడేళ్లు గడుస్తున్నా పరిస్థితుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ఇక అస్థమ, పక్షవాతం, పైలేరియా, క్యాన్సర్‌ బాధితులు కూడా పల్లెల్లో ఉన్నారు. విభజనకు పూర్వ నల్లగొండ జిల్లాలో 16లక్షలకు పైగా జనాభా ఉండగా, అందులో ఎన్‌సీడీ కింద ఇప్పటికే ఆశా కార్యకర్తలు 70శాతం మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 1,10,782 మందికి వివిధ రోగాలు ఉన్నాయని తేలింది. వీరిలో ఎక్కువ 30శాతం మందికి బీపీ, 12శాతం మందికి షుగర్‌, సుమారు 2 శాతానికి తక్కువలో క్యాన్సర్‌ బాధితులు ఉన్నారని నిర్ధారణ అయింది.


బాధితుల సంఖ్య పెరుగుతోంది : ఎ.కొండల్‌రావు, డీఎంహెచ్‌వో, నల్లగొండ 

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా బీపీ బాధితుల సంఖ్య 30శాతానికి పైగా పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. బీపీ ఇతర రోగాలకు కారణమవుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్న వారు ఆహార నియమాలు పాటించి క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. నూనె సంబంధిత తినుబంఢారాలకు దూరంగా ఉండాలి. జంక్‌ ఫుడ్‌ తీసుకోవద్దు. రోజూ ఉదయం అరగంటకు పైగా వ్యాయామం తప్పనిసరి.


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోగులు ఇలా..

తీవ్ర రోగాలు ఉన్న వారు 2,24,360

బీపీ బాధితులు 34శాతం 

గుండె జబ్బు ఉన్న వారు 16శాతం

షుగర్‌ బాధితులు 12శాతం 

ఇతర వ్యాధులు 6శాతం 

పక్షవాతం 4శాతం

క్యాన్సర్‌ బాధితులు 2శాతం

Updated Date - 2021-10-11T07:14:09+05:30 IST