బీపీ, షుగర్‌ గోలీలు ఫ్రీ

Nov 28 2021 @ 03:11AM

  • వచ్చేనెల నుంచే.. 27 లక్షల మందికి లబ్ధి
  • ఎన్‌సీడీ కిట్‌ల రూపంలో మందుల పంపిణీ
  • గ్రామాల్లోని హెల్త్‌ సబ్‌సెంటర్ల వద్దే అందజేత
  • మందుల కిట్‌ను పరిశీలించిన మంత్రి హరీశ్‌
  • మందుల కిట్లపై ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
  • రాష్ట్రంలో 7 లక్షల మందికి మధుమేహం
  • 20 లక్షల మందికి రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ
  • ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌లో గుర్తించిన వైద్యశాఖ 
  • కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశం 


హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రక్తపోటు, మధుమేహ బాధితులను వాటి బారినుంచి కాపాడేందుకు ప్రభుత్వమే వారికి మందు గోలీలు ఇవ్వనుంది. అసంక్రమిత వ్యాధుల (నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజ్‌) కార్యక్రమం కింద చేసిన పరీక్షల్లో నిర్ధారణ అయినవారికి ఎన్‌సీడీ కిట్ల రూపంలో వీటిని అందజేయనుంది. వచ్చే డిసెంబరు నుంచే ఈ కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీపీ, షుగర్‌ నియంత్రణ ఔషధాలతో కూడిన ఈ కిట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం పరిశీలించారు. డిసెంబరు నుంచి వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బీపీ, షుగర్‌ బాధితులకు మందుల కిట్లు ఇవ్వనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఈ ఏడాది ఆగస్టు 30న కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కిట్లను 30 ఏళ్ల వయసు దాటిన వారికే ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏళ్లు దాటిన వారు 1.37 కోట్ల మంది ఉన్నారు. వీరికి నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజ్‌ కార్యక్రమం కింద రాష్ట్రమంతా అన్ని చోట్లా బీపీ, షుగర్‌తోపాటు కేన్సర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు లక్షిత జనాభాలో 80 శాతం మందికి ఈ పరీక్షలు చేశారు. అందులో 20 లక్షల మందికి బీపీ, మరో 7 లక్షల మందికి షుగర్‌ ఉన్నట్లు గుర్తించారు. బీపీని నిర్ధారించేందుకు వివిధ సందర్భాల్లో మూడుసార్లు పరీక్ష చేస్తున్నారు. నిర్ధారణ అయినవారికి ఆ తర్వాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో మెడికల్‌ ఆఫీసర్‌ వద్ద మళ్లీ టెస్టు చేస్తారు. అక్కడ కూడా నిర్ధారణ అయితేనే వైద్యం అందిస్తున్నారు. షుగర్‌ పరీక్షలు మాత్రం ర్యాండమ్‌గానే చేస్తున్నారు. ఈ పరీక్షల్లో ఈ దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులకు పీహెచ్‌సీలోనే చికిత్స అందిస్తున్నారు. అక్కడి మెడికల్‌ ఆఫీసర్లే వారికి అవసరమైన మందులు ఇస్తున్నారు. 


దశలవారీగా అందరికీ కిట్లు..

ప్రస్తుతం జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. ఇందులో బీపీ, షుగర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి ఇదే కార్యక్రమం కింద ఎన్‌సీడీ మందుల కిట్లను దశలవారీగా అందజేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. తాజాగా విడుదలైన జాతీయ ఐదో ఆరోగ్య సర్వేలో రాష్ట్రంలో బీపీ, షుగర్‌ బాధితుల సంఖ్య పెరిగినట్లు వెల్లడైంది. బీపీ, షుగర్‌  బాధితులు దీర్ఘకాలంలో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. లేదంటే అది గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, చూపు కోల్పోవడం లాంటి సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి జబ్బులను నయం చేసేందుకు ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తోంది. అందుకే బీపీ, షుగర్‌కు ఆదిలోనే కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ఎన్‌సీడీ కిట్లను పంపిణీ చేయనుంది.


కిట్‌లో ఏముంటాయంటే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగోతో కూడిన ఎన్‌సీడీ మందుల కిట్‌లో బీపీ, షుగర్‌పై అవగాహన కల్పించే కరపత్రాలను ఉంచుతారు. బీపీ, షుగర్‌ బాధితులను వర్గీకరించి.. బీపీ బాధితులకు దానికి సంబంధించిన ఔషధాలను, షుగర్‌ ఉన్నవారికి దాని డ్రగ్స్‌ను కిట్‌లో ఉంచుతారు. నెలకు సరిపడా బీపీ, షుగర్‌ మందులు కిట్‌లో ఉంటాయి. గ్రామంలోని హెల్త్‌ సబ్‌ సెంటర్‌ వద్ద వీటిని  అందజేస్తారు. ఇక బీపీ ప్రాథమిక దశలో ఉంటే అమ్లోడిపిన్‌ ఇస్తారు. దాంతో కంట్రోల్‌లోకి రాకపోతే టెర్మిసాట్‌ను, దాంతో కూడా అదుపులోకి రాకుంటే చివరిగా హైడ్రోక్లోరోథైజెడ్‌ ఔషధాన్ని ఇస్తారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.