‘పేట’లో బ్రాకెట్‌ దందా

ABN , First Publish Date - 2022-01-18T05:55:44+05:30 IST

పట్టణంలో కేరళ లాటరీ పేరుతో నాలుగు నంబర్ల బ్రాకెట్‌ ఆట జోరుగా సాగుతోంది. బ్రాకెట్‌ కూపన్‌ను రూ.100కు విక్రయిస్తున్నారు.

‘పేట’లో బ్రాకెట్‌ దందా
బ్రాకెట్‌ నంబర్లు రాస్తున్న వ్యక్తి

కేరళ లాటరీ పేరుతో నిర్వహణ 

నాలుగు నంబర్‌లలో చివరి నంబరు తగిలితే రూ.100, రెండు తగిలితే రూ.1000, మూడు తగిలితే రూ.10,000, నాలుగూ సరిపోతే రూ.5 లక్షలు ఇస్తామంటూ ప్రచారం

ఒక్కో కూపన్‌ రూ.100కు అమ్మకం 

అధిక సంఖ్యలో కొని మోసపోతున్న పేదలు, యువత, వ్యాపారులు


పాయకరావుపేట, జనవరి 17:


పట్టణంలో కేరళ లాటరీ పేరుతో నాలుగు నంబర్ల బ్రాకెట్‌ ఆట జోరుగా సాగుతోంది. బ్రాకెట్‌ కూపన్‌ను రూ.100కు విక్రయిస్తున్నారు. అందులో వున్న నాలుగు నంబర్లు తాము ప్రకటించే నంబర్లకు సరిపోతే మొదటి బహుమతి కింద ఏకంగా రూ.5 లక్షలు ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. అలాకాకుండా నాలుగు నంబర్లలో చివరి ఒకటి, రెండు, మూడు నంబర్లు కలిసినా రూ.100, రూ.1,000, రూ.10,000 ఇస్తామని ఆశ చూపుతుండడంతో కూలి పనులు చేసుకునేవారు, చిరు వ్యాపారులు, యువకులు ఎగబడి ఈ బ్రాకెట్‌ కూపన్‌లు కొంటున్నారు. నాలుగు నంబర్లలో ఏదో ఒక నంబరు తగలకపోతుందా...అన్న ఆశతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పోగొట్టుకుంటున్నారు. రోజువారీ నిర్వహించే ఈ బ్రాకెట్‌ను విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారని  సమాచారం. పాయకరావుపేట, తుని పట్టణాలతో పాటు చుట్టుపక్కల పెద్ద పంచాయతీల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ ఆట సాగుతోంది. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల లాటరీల పేరుతో ఆరు నంబర్ల బ్రాకెట్‌లు కూడా నిర్వహిస్తున్నారని సమాచారం. 


నాలుగు నంబర్ల బ్రాకెట్‌ ఆట ఇలా...

నాలుగు నంబర్ల బ్రాకెట్‌ నిర్వాహకులు నియమించుకున్న ఏజెంట్లు పాన్‌షాపులు, చిన్నచిన్న దుకాణాలు, టీకొట్ల వద్ద ఉంటారు. బ్రాకెట్‌ కూపన్‌ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి చెప్పిన నాలుగు అంకెలను ఒక చిన్న తెల్లకాగితంపై రాస్తారు. దీనిపై కూపన్‌ ధర, తేదీ, సంతకం పెట్టి ఇస్తారు. కొనుగోలు చేసిన వ్యక్తికి సెల్‌ ఫోన్‌ ఉంటే ఆ నంబరు ఏజెంట్లు తమ రికార్డులో రాసుకుంటారు. ఇలా మరుసటిరోజు మధ్యాహ్నం వరకు విక్రయించిన తరువాత కూపన్లు రాయడం నిలిపివేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు బ్రాకెట్‌ ప్రధాన నిర్వాహకుల నుంచి ఏజెంట్లకు మెయిల్‌ ద్వారా వచ్చే నాలుగు నంబర్లను సెల్‌ నంబర్లు ఇచ్చిన వారికి మెసేజ్‌ పెట్టడంతో పాటు కూపన్లు విక్రయిస్తున్న ప్రదేశాల వద్ద అందుబాటులో ఉంచుతారు. బ్రాకెట్‌ కూపన్‌ కోనుగోలు చేసిన వారి చీటీలో వున్న నాలుగు నంబర్లు, నిర్వాహకులు మెయిల్‌ ద్వారా పంపిన నాలుగు నంబర్లకు సరిపోతే రూ.5,00,000, నాలుగు నంబర్లలో చివరి నంబరు సరిపోతే రూ.100, చివరి రెండు నంబర్లు సరిపోతే రూ.1,000, ఒకటి తప్ప మిగిలిన మూడు నంబర్లు సరిపోతే రూ.10,000 పది శాతం కమీషన్‌ పోను మిగిలింది 24 గంటల్లో అందజేస్తామని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్కరికి కూడా రూ.5 లక్షలు లేదా మిగిలిన ప్రైజ్‌ మనీ ఇచ్చిన దాఖలాలు లేవని సమాచారం. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల లాటరీల పేరుతో ఆరు నంబర్ల ప్రింటెడ్‌ బ్రాకెట్‌ కూపన్ల నిర్వహణ కూడా జోరుగానే సాగుతోంది. బ్రాకెట్లు, లాటరీలను ప్రభుత్వం ఎప్పుడో నిషేధించినా కొందరు గుట్టుగా నిర్వహిస్తూ జనాన్ని దోచుకుంటున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వారిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2022-01-18T05:55:44+05:30 IST