త్రిమూర్తుల కొలువు

ABN , First Publish Date - 2021-10-29T08:57:16+05:30 IST

బ్రహ్మ, ఈశ్వరులతో కలిసి మహావిష్ణువు కొలువు తీరిన అపురూపమైన క్షేత్రం తిరుక్కంబనూర్‌. బ్రహ్మకు ఆలయాలు అత్యంత అరుదు కాగా, త్రిమూర్తులు ఒకే చోట దర్శనమివ్వడం మరెక్కడా కనిపించదు.

త్రిమూర్తుల కొలువు

బ్రహ్మ, ఈశ్వరులతో కలిసి మహావిష్ణువు కొలువు తీరిన అపురూపమైన క్షేత్రం తిరుక్కంబనూర్‌. బ్రహ్మకు ఆలయాలు అత్యంత అరుదు కాగా, త్రిమూర్తులు ఒకే చోట దర్శనమివ్వడం మరెక్కడా కనిపించదు. అలాగే, వారి దేవేరులైన సరస్వతి, లక్ష్మి, పార్వతులకు కూడా ఇక్కడ ఆలయాలు ఉండడం మరో విశేషం. తమిళనాడులోని తిరుచురాపల్లి (తిరుచ్చి)కి సుమారు పది కిలోమీటర్లు, శ్రీరంగానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం... వైష్ణవులకు పరమ పవిత్రమైన 108 దివ్య దేశాలలో ఒకటి. ద్రవిడ శైలిలో కనిపించే ఈ ఆలయం వెయ్యేళ్ళ క్రితం చోళ రాజుల కాలంలో నిర్మితమయిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 


ప్రధాన ఆలయంలో పురుషోత్తమ పెరుమాళ్‌ (ఉత్తమర్‌)గా మహావిష్ణువు, పూర్ణవల్లీ తాయారుగా శ్రీ మహాలక్ష్మి పూజలందుకుంటున్నారు. పెరుమాళ్‌ సన్నిధి సమీపంలో ఉన్న గుడిలో కొలువు తీరిన శివుడిని ‘భిక్షాటనర్‌’ అంటారు. ఈ పేరు రావడం వెనుక... స్థలపురాణంలో ఒక కథ ఉంది. చతుర్ముఖుడిగా పేరుపొందిన బ్రహ్మకు పూర్వం అయిదు శిరస్సులు ఉండేవి. ఒక వివాదంలో ఆయనపై ఆగ్రహించిన శివుడు ఒక తలను పెరికివేశాడు. అయితే,. బ్రహ్మ శాపం కారణంగా... ఆ తల శివుడి చేతికి అతుక్కుపోయింది. అది క్రమంగా కపాలంగా మారిపోయింది. శివుడు శాపవిమోచన కోరగా... ఆ కపాలంతో భిక్షాటన చేయమనీ, ఎవరి భిక్ష ద్వారా అది నిండుతుందో... వారి ద్వారా శాపవిమోచనం అవుతుందనీ బ్రహ్మ చెప్పాడు. శివుడు తీర్థయాత్రలు చేస్తూ, ఈ ప్రాంతానికి వచ్చి, మహావిష్ణువును సేవించాడు. ఆ కపాలం నిండేలా మహా విష్ణువు భిక్ష వేసి, శివుణ్ణి శాపవిముక్తుణ్ణి చేశాడు. అనంతరం ఈ క్షేత్రంలో ‘భిక్షాటనర్‌’ లేదా ‘భిక్షాందర్‌’గా... స్వయంభు లింగ రూపంలో శివుడు ఆవిర్భవించాడు. శివుడి ఉత్సవమూర్తిని ‘భిక్షాటనర్‌’ రూపంలో పూజిస్తారు. శివాలయాన్ని ఆనుకొని... సౌందర్య పార్వతి తాయారు లేదా వడివుడై నాయకి మందిరం ఉంది.


ఆలయ ప్రధాన ద్వారానికి సమీపంలో... చతుర్ముఖ బ్రహ్మ ఆలయం ఉంది. పక్కనే వరద, అభయ హస్తాలతో... ఒక చేత్తో రుద్రాక్ష హారం, మరో చేత్తో పుస్తకంతో... ఆయన దేవేరి సరస్వతీ దేవి కొలువుతీరింది. అలాగే శివ, విష్ణు పరివారాలు, భక్తుల ఉపాలయాలు, సప్త గురుమూర్తుల సన్నిధులు కూడా అనేకం ఇక్కడ కనిపిస్తాయి. కదంబ మహర్షికి ఈ ప్రదేశంలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడని ఒక కథ ఉంది. అందుకే దీన్ని ‘కదంబ వనం’, ‘కదంబ క్షేత్రం’ అని కూడా పిలుస్తారు. ఈ త్రిమూర్తి క్షేత్రంలో కార్తిక మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా జరిపే శివ-కేశవుల ఊరేగింపు కన్నులపండువగా ఉంటుంది. 

Updated Date - 2021-10-29T08:57:16+05:30 IST