నిరంతర ఆనందం కోసం...

ABN , First Publish Date - 2021-05-14T03:58:01+05:30 IST

గత జన్మలో, ఈ జన్మలో చేసిన కర్మలే మన జీవితాలను నడిపిస్తాయి. పాప కర్మలు మనకు భారంగా మారుతాయి. పెద్దలు, సజ్జనులతో కటువుగా మాట్లాడడం, వ్యవహరించడం....

నిరంతర ఆనందం కోసం...

గత జన్మలో, ఈ జన్మలో చేసిన కర్మలే మన జీవితాలను నడిపిస్తాయి. పాప కర్మలు మనకు భారంగా మారుతాయి. పెద్దలు, సజ్జనులతో కటువుగా మాట్లాడడం, వ్యవహరించడం లాంటివి మన ఆంతరంగిక సంతోషాన్నీ, అభివృద్ధినీ అడ్డుకుంటాయి. పరమాత్మకు సమీపంలో ఉండే యోగులకు బాధ కలిగిస్తే... అది మన సుఖ సంతోషాలను హరిస్తుంది. ఆనందానికి మనల్ని దూరం చేస్తుంది. మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ కోరుకోవడం, ఇతరులు చేసిన తప్పులను క్షమించడంలోనే ఔన్నత్యం ఉంటుంది. నిరంతరం మనం ఆనందంగా ఉండాలంటే కొన్ని విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వాటిని ఆచరించాలి. 


ఆనందంగా ఉండేందుకు పొగడ్తలను ఆధారంగా చేసుకోకూడదు. 


జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మనో చింతనతో మనల్ని మనం శక్తిమంతులుగా మార్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే యోగ్యులుగా మారాలి. 


జరిగినదీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ... ఇవన్నీ ‘సృష్టి’ అనే నాటక రంగం మీద జరుగుతున్న దృశ్యాలు. రాబోయే ప్రతి క్షణం మంచిగానే ఉంటుందనీ, ప్రతి విషయంలోనూ మంచి ఉందనీ ఆశాభావంతో ఉండాలి. 


మనల్ని ఇష్టపడనివారిని కూడా ఇష్టపడాలి. ఎవరినీ నొప్పించకూడదు.


ఎవరి నుంచీ ఏదీ ఆశించకూడదు. 


నిర్మలమైన, నిశ్చలమైన భావంతో అందరికీ సంతోషం కలిగించాలి.


సేవ ద్వారానే అందరి ఆశీస్సులనూ పొందగలం. విఘ్నాలను దాటగలం. సేవకు లభించే ప్రతిఫలం ఆనందమే! 


అశాంతి అనే అంధకారంలో మగ్గిపోతున్న నేటి ప్రపంచంలో మీ ఆనందమే వెలుగులను నింపుతుంది. పరమాత్ముడి వరద హస్తం మన తలపైన ఉందనీ, ఆశీస్సులను అందిస్తోందనీ మరచిపోకండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ‘ఆనందం’ అనే నిధిని అందరికీ పంచుతూ ముందుకు సాగండి.


బ్రహ్మకుమారీస్‌

9010161616

Updated Date - 2021-05-14T03:58:01+05:30 IST