పింఛన్లలో కోత!

ABN , First Publish Date - 2021-10-06T04:56:19+05:30 IST

ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోతల్లో భాగంగా బ్రాహ్మణ కార్పొరేషన ఫించన్లకు ప్రభుత్వం ఝులక్‌ ఇచ్చింది.

పింఛన్లలో కోత!

బ్రాహ్మణ కార్పొరేషన పింఛన్లు కట్‌!

వృద్ధాప్య జాబితాలో చేర్చిన ప్రభుత్వం

ఇంటికో పింఛను విధానం వర్తింపు 

ఫించన కోల్పోయిన వేలాది మంది పేద బ్రాహ్మణులు


గుంటూరులో నివసించే సర్వేశ్వరశర్మకు 70ఏళ్లు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన ద్వారా 2017 నుంచి పింఛను పొందుతున్నారు. ఆయన భార్య శేషమ్మ ప్రభుత్వం నుంచి వృద్ధాప్య కోటాలో పెన్షన తీసుకుంటోంది.  వైసీపీ ప్రభుత్వం వారి నోటి దగ్గర కూడు లాగేసింది. బ్రాహ్మణ కార్పొరేషన ద్వారా సర్వేశ్వరశర్మ తీసుకుంటున్న పెన్షనను మాత్రమే అక్టోబరులో కొనసాగించింది. శేషమ్మ పెన్షన నిలిపివేసింది. దీంతో ఆ దంపతులు లబోదిబోమంటున్నారు. 
 
(ఆంధ్రజ్యోతి, గుంటూరు)
ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోతల్లో భాగంగా బ్రాహ్మణ కార్పొరేషన ఫించన్లకు ప్రభుత్వం ఝులక్‌ ఇచ్చింది. కార్పొరేషన ద్వారా మంజూరయ్యే పింఛన్లను వృద్ధాప్య పింఛను జాబితాలో చేర్చింది. దీంతో ఒక ఇంట్లో ఒకే పింఛను విధానం ఆమల్లో ఉండటంతో వృద్ధాప్య పింఛనుకు కోత పడుతోంది. ఇలా వేలమంది లబ్ధిదారులకు పింఛనుకు దూరమయ్యారు. తాజాగా ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషననుబీసీ కార్పొరేషనలో విలీనం చేయడంపైనా ఆందోళన వ్యక్తం అవుతోంది. 
గతంలో ఇలా.. 
మత్యకారులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు పింఛను ఇస్తున్నారు. అదే ఇంట్లో వృద్ధులు, వితంతువులు ఉన్నా సరే రెండో పింఛను మంజూరు చేస్తున్నారు. బ్రాహ్మణులు చేసేది గత ప్రభుత్వం ఒక వృత్తిగానే భావించింది. వయసు పైబడిన వారికి, అనాథ పిల్లలకు నెలకు రూ.2వేలు పింఛన అందించేది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత పూజాధిక కర్మలు చేయలేరన్న ఉద్ధేశంతో కార్పొరేషన ద్వారా వృద్ధులకు పింఛను జారీ చేసేది. బ్రాహ్మణ కార్పొరేషన ద్వారా ఇచ్చే పింఛనును ఇప్పుడు వృద్ధాప్య పింఛను జాబితాలో చేర్చేశారు. దీంతో ఒక ఇంట్లో రెండు పెన్షన్లు ఉంటే ఒకటిపోయింది. ఇతర వృత్తిదారుల విషయంలో లేని ఇబ్బందులు  పురోహితుల విషయంలో ఎందుకు వచ్చాయన్న విమర్శలు, వెల్లువెత్తుతున్నాయి. ఒక్క బ్రాహ్మణ సామాజిక వర్గంలోనే జిల్లాలో దాదాపు మూడువేల మందికి పింఛన్లు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాల నుంచి తప్పించుకోవడానికి పింఛన్లలో కోత విధిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి..
కేంద్ర ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన ద్వారా పేద బ్రాహ్మణులకు కశ్యప పథకం ద్వారా 60సంవత్సరాల వయస్సు వారికి ఫించన అందిస్తుంది. గత ప్రభుత్వంలో ఆ నియమం ప్రకారం ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉన్నా వారికి కార్పొరేషన ద్వారా ఫించన్లు అందించేవారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో కార్పొరేషన ద్వారా వచ్చే ఫించన్లు వెలుగు కిందకు తీసుకొచ్చారు. రాష్ట్రప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటికో ఫించన మాత్రమే అంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30వేల పెచిలుకు, జిల్లావ్యాప్తంగా సుమారు 3వేల మందిపేద బ్రాహ్మణులు ఫించన్లు కోల్పోయారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. 
- శ్రీధర్‌, బ్రాహ్మణ కార్పొరేషన మాజీ కో- ఆర్డినేటర్‌ 

Updated Date - 2021-10-06T04:56:19+05:30 IST