థామస్ చనిపోయాడు..!

ABN , First Publish Date - 2020-09-28T20:37:03+05:30 IST

ఊరి చుట్టూ వరద నీరు చేరింది. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు..

థామస్ చనిపోయాడు..!

ఊరి చుట్టూ వరద నీరు

వైద్యం కోసం మంచంపై మోశారు

వాగులు వంకలు దాటి 108 వద్దకు..

అయినా దక్కని ప్రాణాలు

బ్రాహ్మణపల్లెకి వరద వస్తే ఇంతే..!


చాగలమర్రి(కర్నూలు): ఊరి చుట్టూ వరద నీరు చేరింది. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. గడప దాటే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో థామస్‌కు గుండె పోటు వచ్చింది. అతన్ని మంచంపై మోసుకుంటూ వాగులు వంకలు దాటుతూ రెండు కి.మీ. వెళ్లారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 108 వాహనం వద్దకు చేర్చారు. కానీ ఫలితం లేకపోయింది. థామస్‌ గుండె అంతసేపు కొట్టుకోలేకపోయింది. 


చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లె జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ కారణంగా వైద్యం అందక గ్రామానికి చెందిన గాలిపోతు థామస్‌ (65) ఆదివారం ఉదయం మృతి చెందాడు. మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎటు చూసినా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రానికి వెళ్లేందుకు గ్రామీణ ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రాహ్మణపల్లె సమీపంలో వక్కిలేరు ఉప్పొంగుతోంది. గ్రామంలో నీరు చేరింది. ఈ సమయంలో ఎస్సీ కాలనీకి చెందిన థామస్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ట్రాక్టర్‌లో రెండు కి.మీ. తీసుకెళ్లారు.


ఆ తరువాత దారి లేక మంచంపై మోస్తూ  పొలాలు, వరద నీటిలో మరో 2 కి.మీ. దూరం వెళ్లారు. అప్పటికే సమచారం అందుకున్న చాగలమర్రి 108 వాహనం గొట్లూరు మీదుగా పొలాల రహదారి వరకూ వచ్చి ఆగింది. అతి కష్టం మీద కుటుంబ సభ్యులు థామస్‌ను అంబులెన్స్‌ వద్దకు చేర్చారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే థామస్‌ మృతి చెందాడని 108 సిబ్బంది ధ్రువీకరించారు. సమయానికి వైద్యం అందక ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. 


ఈ సంఘటన పలువురిని కంట తడి పెట్టించింది. గాలిపోతు థామస్‌ ఆళ్లగడ్డ సహకార సంఘం బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. 


అంత్యక్రియలకూ ఇబ్బందే..

గ్రామం చుట్టూ నీరు ఉండటంతో అంత్యక్రియలు చేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. శ్మశానం నీట మునిగింది. మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచారు. నీరు తగ్గేదాకా ఖననం చేయడం సాధ్యం కాదని, ఏం చేయాలో తెలియడం లేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


పాతికేళ్లుగా ఇంతే..

బ్రాహ్మణపల్లెకు 25 ఏళ్ల నుంచి వరద కష్టాలు తప్పడం లేదు. గ్రామంలో సుమారు 200 కుటుంబాలు ఉన్నాయి. జనాభా వెయ్యి దాకా ఉంటుంది. చిన్న పాటి వర్షం వస్తే వంతెనపై నీరు ప్రవహిస్తుంది. రాకపోకలు నిలిచి పోతాయి. లోతట్టు వంతెన కావడంతో ఏడాదిలో కనీసం నాలుగు సార్లు ఈ పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 15 రోజుల క్రితం ఆవులపల్లెకు చెందిన లక్కిరెడ్డి నాగమ్మ ఇలాగే మృతి చెందింది. నాలుగేళ్లలో 10 మంది ఇలా మృత్యువాత పడ్డారు. 


ఎవరూ పట్టించుకోరు..

ఎన్నికల సమయంలో మాత్రమే గ్రామానికి నాయకులు వస్తారు. వరద కష్టాలను, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తారు. ఆ తరువాత గ్రామం వైపు కన్నెత్తి చూడరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణపల్లె నుంచి గొట్లూరు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, నేల వంతెనను తొలగించి శాశ్వత వంతెన ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.  వైద్యం అందక ఓ వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలిసినా ఏ ఒక్క ప్రజాప్రతినిధి, అధికారి ఆ ఊరి వైపు కన్నెత్తి చూడలేదు. 


నీట మునిగిన పొలాలు 

బ్రాహ్మణపల్లె చుట్టూ పంట పొలాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పొలాలు కోతకు గురయ్యాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన 500 ఎకరాల్లో పంట నీటిపాలైంది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.


గర్భిణులు, బాలింతలు వైద్యం కోసం గొట్లూరుకి చేరుకొని అక్కడి నుంచి వాహనాల్లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళతారు. వరద సమయంలో ఇంట్లో ఉండే సరుకులతోనే రోజులు గడపాల్సి వస్తోందని, చాలా మంది పేదలు కావడంతో పస్తులు ఉంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వక్కిలేరు ఉప్పొంగితే బ్రాహ్మణపల్లెకు నరకం కనిపిస్తుంది. వరద నీరు వస్తే కనీసం 10 రోజులు రాకపోకలు ఆగిపోతాయి. ఆ సమయంలో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. చాలా ఇళ్లల్లోకి నీరు చేరుతుంది. తినడానికి, నిద్రించడానికి కూడా ఉండదు. 


వరద వస్తే కష్టాలు

వరద వస్తే కష్టాలు పడుతున్నాం. వక్కిలేరు పొంగితే రాకపోకలు ఉండవు. అత్యవసరమైతే పక్క గ్రామాల నుంచి వెళ్లాల్సి వస్తోంది.  నిత్యావసర సరుకులు కూడా ఉండవు. బ్రిడ్జి, రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నాం.

 - శ్రీనివాసరెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌, బ్రాహ్మణపల్లె


వాగు పొంగితే ఇంతే..

వక్కిలేరు పొంగితే మాకు వైద్య సేవలు అందవు. రోగాలు సోకితే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అధికారులు, నాయకులు పట్టించుకోరు. ఎన్నికల రోజు వారికి గుర్తుకు వస్తాం.

- గ్రేసమ్మ, బ్రాహ్మణపల్లె 


ప్రాణాలు పోతున్నాయి

వక్కిలేరు పొంగినప్పుడు అనారోగ్యానికి గురైతే మరణం తప్పదు. ఊరు దాటే వీలు ఉండదు. వైద్య సేవలు అందవు. వరద వస్తే కనీసం వారం రోజులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇతర గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి. అధికారులు స్పందించి వంతెన ఏర్పాటు చేయాలి. - రామలింగారెడ్డి,

 - రైతు, బ్రాహ్మణపల్లె 



Updated Date - 2020-09-28T20:37:03+05:30 IST