బ్రహ్మసత్యం.. జగన్మిథ్య

ABN , First Publish Date - 2020-07-10T08:59:35+05:30 IST

సృష్టికి పూర్వం సజాతీయ విజాతీయ స్వగతభేద శూన్యమైన ఒకే ఒక పదార్థం ఉండేదని ఛాందోగ్యోపనిషత్‌ చెబుతోంది.

బ్రహ్మసత్యం.. జగన్మిథ్య

సృష్టికి పూర్వం సజాతీయ విజాతీయ స్వగతభేద శూన్యమైన ఒకే ఒక పదార్థం ఉండేదని ఛాందోగ్యోపనిషత్‌ చెబుతోంది. ఆ పదార్థం నుండేసమస్త భూతకోటి జనించిందని శ్రుతులు, స్మృతులు పేర్కొంటున్నాయి.


యతోవా ఇమాని భూతాని జాయంతే యేనజాతాని జీవంతి 

యత్‌ ప్రయంత్యభి సంవశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి

దేనివల్ల సమస్త చరాచర భూతాలూ పుడుతున్నాయో, అలా జనించినవన్నీ ఎవరివల్ల జీవిస్తున్నాయో, ప్రళయాంతమందు దేని యందు లయిస్తున్నాయో అది బ్రహ్మమని పై శ్లోకం వల్ల తెలుస్తుంది. ఈ జగత్తుకంతటికి కారణకర్త బ్రహ్మమని స్పష్టమౌతుంది. కానీ బ్రహ్మం నుండి జగత్తు పుట్టడం.. తాడుయందు గాడాంధకారంలో సర్పం (పాము) గోచరించినట్లు. మాయ (అవిద్య) వల్ల.. ఆ బ్రహ్మమే చరాచర జగత్తురూపంగా కనపడుతూ ఉన్నాడు. ఆందువల్ల సర్పానికి తాడు ఎలా కారణమో కనిపించే జగత్తుకు బ్రహ్మము కూడా అలాగే కారణమై ఉన్నాడు. జగత్తు మాయామాత్రమై మిథ్యయైు ఉంది. బ్రహ్మము తప్ప అన్యవస్తువు లేనే లేదు. కొందరు వ్యక్తులు ద్వైతవాదుల మైత్రి చేయడంవల్ల, ద్వైత సంబంధమైన గ్రంథాలు చదవడంచేత.. ‘‘బ్రహ్మసత్యం జగన్మిథ్య’’ అనే సిద్ధాంతంపై సంశయం జనించి తమను బ్రహ్మ రూపులుగా గుర్తించట్లేదు. అలాచేస్తే అద్వితీయ ఆత్మరూపాన్నిగుర్తించలేరు. అజ్ఞానులకు తమ స్వస్వరూపమైన ఆత్మ జడచేతనమైన జగత్తుగా కనపడుతుంది.


ఏషేవ జగద్రూపం జగద్రూపంతునేశ్వరే

హేమైవ కటకాదిత్వం కటకత్వం నహేమని

ఈశ్వరుడే జగద్రూపాన స్ఫురిస్తున్నాడుగానీ.. జగత్తు ఈశ్వరునియందు లేదు. అదెలాగంటే సువర్ణమే(బంగారు) అనేక ఆభరణరూపాలుగా కనబడుతుంది. ఆ రూపాలు సువర్ణంలో లేవని యోగవాశిష్ఠం చెబుతోంది. అలాగే అజ్ఞానంలో ఉన్నవారికి ఆత్మ ఈ ప్రపంచంగా కనపడుతుందేతప్ప ప్రపంచంగా మారలేదు. ఈ తత్వాంశానికి ఆదిశంకరాచార్యులు ‘వివర్తం’ అని పేరుపెట్టారు. వివర్తమనగా.. తన స్వరూపంలో మార్పులేనిదని అర్థం. కల్పిత సర్పానికి తాడు కారణమైనట్లు మిథ్యయైున జగత్తుకు ఆత్మ వివర్తోపాదానకారణమై ఉంది. ఉదాహరణకు మట్టికుండల్లో చిన్నకుండ, పెద్దకుండ అనే తేడాలున్నా, ఆ రెండూ మట్టి నుండి పుట్టినవే. అవి పగిలిన తర్వాతలేవు. తయారు చేయకముందు కూడా లేవు. మధ్య కాలంలో ఉన్నట్లుగా తోచాయంతే. అందుకేవాటిని మిథ్య అంటారు. ఆ విధంగానే బ్రహ్మమందు గోచరించే జగత్తు యొక్క నామరూపాలు సైతం మిథ్యయైు ఉన్నాయి.


నామరూప మైన జగత్తుకు అధిష్టానంగా ఉన్న బ్రహ్మమే సత్యంగా గ్రహించాలి. మట్టి, బంగారు నిత్యాలు. తత్కార్యాలైన ఘటం, ఆభరణం అనిత్యాలు. అదేవిధంగా బ్రహ్మకార్యమైన జగత్తు సర్వం అనిత్యం. దానికి కారణమైన పరబ్రహ్మం నిత్యం. కావున బ్రహ్మమే సత్య మనే విషయా న్ని గురువు ద్వారా, శాస్త్రపఠనం వల్ల తెలుసుకొని.. ‘నేను’ అంటే దేహేంద్రియాదులే అనే భావనను వదిలిపెట్టి, తన స్వస్వరూపం బ్రహ్మగా నిశ్చయించుకోవాలి. ఆ నిర్ణయమే ఆత్మజ్ఞానం. ఆత్మ జ్ఞాన సంపన్నుడు మళ్లీ పుట్టడు. ఎందుకంటే ఆత్మ జన్మరహితం. ‘బ్రహ్మమే నేను’ అనే జ్ఞానం తప్ప మోక్షానికి వేరొక మార్గం లేదు.


విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య, 99483 48918

Updated Date - 2020-07-10T08:59:35+05:30 IST