బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-09-19T05:22:07+05:30 IST

బ్రాహ్మణుల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. దాని ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. సామాజిక పింఛన్‌లతో సంబంధం లేకుండా ఒక కుటుంబంలో ఎంత మంది వృద్ధులు ఉన్నా కార్పొరేషన్‌ ద్వారా పింఛన్‌లు ఇచ్చారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిర్వీర్యం
బ్రాహ్మణ క్రెడిట్‌ సొసైటీ కార్యాలయం

నిధులు కేటాయించని ప్రభుత్వం

గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు 

అనేక పథకాలు అమలు 

ప్రస్తుతం ఒక్కొక్కటిగా రద్దు 

మరికొన్ని నిలిపివేత 

నేడు ప్రధాన కార్యాలయం

ముట్టడికి టీడీపీ పిలుపు

జిల్లా నుంచి భారీగా వెళ్తున్న వైనం


ఒంగోలు (కల్చరల్‌), సెప్టెంబర్‌ 18 :


 ‘అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను రూ.1000 కోట్లు కేటాయిస్తాం. మరిన్ని పథకాలు అమలు చేస్తాం. బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తాం’. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ఇచ్చిన హామీ ఇది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే కరువైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్‌కు వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసింది. గతంలో అమలు చేసిన అనేక పథకాలను అటకెక్కించింది. మరికొన్నింటిని నిలిపివేసింది. దీంతో బ్రాహ్మణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు టీడీపీ ముందుకు వచ్చింది. ఆందోళనకు సిద్ధమైంది. సోమవారం విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివెళ్లేందుకు బ్రాహ్మణులు సిద్ధమయ్యారు. 


 బ్రాహ్మణుల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. దాని ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. సామాజిక పింఛన్‌లతో సంబంధం లేకుండా ఒక కుటుంబంలో ఎంత మంది వృద్ధులు ఉన్నా కార్పొరేషన్‌ ద్వారా పింఛన్‌లు ఇచ్చారు. వింతంతువులు, ఒంటరి మహిళలకూ అందజేశారు. బ్రాహ్మణ యువతకు స్వయం ఉపాధి కోసం విరివిగా రుణాలు ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిలో కొన్నింటిని ఒక్కొక్కటిగా రద్దు చేసింది. మరికొన్నింటి అమలును నిలిపివేసింది.  ఒక కుటుంబానికి ఒక పెన్షన్‌ మాత్రమే పరిమితం చేసింది.  


నాడు మాట నిలబెట్టుకున్న చంద్రబాబు 

2014 ఎన్నికలకు ముందు తన పాదయాత్ర సందర్భంగా బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత తన మాటను నిలబెట్టుకుంటూ ఆయన దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. 


గతంలో ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నా పింఛన్‌.. నేడు ఒక్కరికే పరిమితం 

టీడీపీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కుటుంబాల్లోని వృద్ధులకు కార్పొరేషన్‌ ద్వారా వృద్ధాప్య పింఛన్‌ లభించేది. ఒక కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు వృద్ధులు ఉన్నా అందరికీ పింఛన్‌ ఇచ్చారు. అదేకుటుంబంలో దివ్యాంగులు, వితంతువు, ఒంటరి మహిళ ఉన్నా వారికీ పింఛన్‌ సొమ్ము చెల్లించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వాటికి కోత పెట్టింది. ఒక కుటుంబంలో ఒకరికే పింఛన్‌ను పరిమితం చేసింది. కార్పొరేషన్‌ ద్వారా కాకుండా సామాజిక పింఛన్‌లలో పథకాన్ని నిలిపివేసింది. దీంతో గతంలో పింఛన్‌ పొందుతున్న అనేక మంది బ్రాహ్మణ వృద్ధులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో వయసుతో నిమిత్తం లేకుండా భర్తను కోల్పోయిన లేదా భర్త వదిలేసిన ఒంటరి బ్రాహ్మణ మహిళలకు సైతం నెలవారీ పింఛన్‌ కార్పొరేషన్‌ ద్వారా అందేది. ప్రస్తుతం దాన్ని కూడా నిలిపివేశారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే బ్రాహ్మణ విద్యార్థులకు కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సహాయం గతంలో అందేది. అయితే వైసీపీ ప్రభుత్వం దాన్ని కూడా ఆపివేసింది.


‘గరుడ’ పథకం ఊసే కరువు

బ్రాహ్మణులు చనిపోయినప్పుడు దహనక్రియల ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు గత ప్రభుత్వం ’గరుడ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న పది నుంచి పదిహేను రోజుల్లో రూ.10 వేలు నేరుగా చనిపోయిన వ్యక్తి వారసులకు అందేవి. అయితే ప్రస్తుతం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అనేకమంది నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. కారు వంటి నాలుగు చక్రాల వాహనాలు కొనుగోలు చేసుకుని దాని అద్దె ద్వారా స్వయం ఉపాధి పొందేవిధంగా గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్‌ ద్వారా బ్రాహ్మణ యువతకు రుణాలు ఇచ్చారు. ప్రస్తుతం దాని ఊసే కరువైంది. ఇలా గతంలో అమలైన అనేక పథకాలను వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది. అన్నింటికీ మించి తాను అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చిన జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకూ అందులో పదో వంతు కూడా కార్పొరేషన్‌కు కేటాయించాలని బ్రాహ్మణులు వాపోతున్నారు. 


ఒంగోలులో కార్యాలయం కూడా లేని దుస్థితి 

గత టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి 2019 వరకూ పథకాలకు సంబంధించి సమాచారం, సహాయం అందజేసేందుకు ప్రతి జిల్లాకు కోఆర్డినేటర్‌ను నియమించింది. వారు కార్పొరేషన్‌ ద్వారా అమలు చేసే పథకాలను బ్రాహ్మణులకు తెలియజేయడంతోపాటు, తక్షణ సహాయం అందేవిధంగా తోడ్పాటునందించేవారు. కానీ ప్రస్తుతం కోఆర్డినేటర్‌ ఇవ్వరూ లేరు. దీంతో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు సంబంధించి జిల్లాలో ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కార్పొరేషన్‌కు ఒంగోలులో ప్రత్యేకమైన కార్యాలయం కూడా లేని దుస్థితి నెలకొంది. 


తెరపైకి క్రెడిట్‌ సొసైటీ

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించని ప్రభుత్వం కొత్తగా క్రెడిట్‌ సొసైటీని తెరపైకి తెచ్చింది. జిల్లాలో ఒంగోలు కేంద్రంగా సొసైటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఒక మేనేజర్‌, ఒక గుమస్తాను మాత్రమే నియమించింది.  గతంలో కార్పొరేషన్‌ ద్వారా అమలు చేస్తున్న పథకాలను నిలిపివేసి సొసైటీ నుంచి అరకొరగా రుణాలు ఇస్తున్నారు. దాని మేనేజర్‌ ఇటు సొసైటీ సభ్యత్వాలు చేయించటం, రుణాల లబ్ధిదారులను గుర్తించటం, రుణాల బకాయిల వసూలు వంటి అనేక బాధ్యతలు ఒక్కడే నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సొసైటీ, కార్పొరేషన్‌ కార్యకలాపాలను తమ నియంత్రణలో పెట్టుకునేందుకు జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని  కొద్ది నెలల క్రితం స్థానిక వైసీపీ నాయకులు ప్రయత్నించినప్పటికీ దానికి సభ్యుల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. ఆ వ్యవహారం కోర్టుకు ఎక్కడంతో ఆగిపోయింది. అయితే బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సీతంరాజు సుధాకర్‌ను ప్రభుత్వం నియమించినప్పటికీ ఆయన ఇప్పటి వరకు కార్పొరేషన్‌ గురించి పట్టించుకున్నది కానీ, జిల్లాలలో పర్యటించింది కానీ లేదని బ్రాహ్మణులు అంటున్నారు. ఈ పరిస్థితులలో టీడీపీ పిలుపు మేరకు కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడికి జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివెళ్లేందుకు బ్రాహ్మణులు సిద్ధమవుతున్నారు. 


కార్పొరేషన్‌ రద్దుకు కుట్ర

కామరాజుగడ్డ కుసుమకుమారి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ జిల్లా మాజీ కోఆర్డినేటర్‌ 

బ్రాహ్మణ కార్పొరేషన్‌ రద్దుకు కుట్ర జరుగుతోంది. గత టీడీపీ హయాంలో అమలు చేసిన అనేక పథకాలను అటకెక్కించిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. దీన్ని కొనసాగిస్తే ఆ ఖ్యాతి చంద్రబాబుకు దక్కుతుందని భావిస్తున్నారు. అందుకే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. నిధులు కేటాయించకపోవడంతోపాటు అనేక పథకాలను రద్దు చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా మేము వెనుకాడం. 

Updated Date - 2022-09-19T05:22:07+05:30 IST