నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-23T06:36:46+05:30 IST

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, జగన్మాత కనకదుర్గమ్మ బ్రహ్మోత్సవాలు ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు

కరోనా కారణంగా వాహన సేవలు రద్దు 

ఆంధ్రజ్యోతి-విజయవాడ : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, జగన్మాత కనకదుర్గమ్మ బ్రహ్మోత్సవాలు ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను ప్రతిఏటా చైతన్యశుద్ధ ఏకా దశి నుంచి చైతన్య బహుళ తదియ వరకు పంచాహ్నిక దీక్షతో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది 23 నుంచి 30వరకు ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఆదిదంపతులకు వాహన సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తొలిరోజు వెండిపల్లకి, రెండోరోజు రావణ వాహనం, మూడోరోజు నంది వాహనం, నాలుగో రోజు సింహవాహనం, ఐదో రోజు వెండిరథంపై శ్రీ దుర్గామల్లేశ్వరులను వైభవంగా ఊరేగిస్తారు. ఈ ఏడాది కరోనా కారణంగా వాహన సేవలను రద్దు చేశారు. బదులుగా ప్రతిరోజూ ఉత్సవమూర్తులను వెండి పల్లకిలో ఆలయం చుట్టూనే ఊరేగించేందుకుు నిర్ణయించారు. 

నేడు అంకురార్పణ 

శుక్రవారం ఉదయం 9.10 గంటలకు అమ్మవారికి వేదపండితులు శాస్త్రోక్తంగా తిరుమంజనం (మంగళస్నానాలు) నిర్వహించి దుర్గామల్లేశ్వరు లను వధూవరులుగా అలంకరిస్తారు. సాయంత్రం ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మంటపారాధనలు, నిత్య బలిహరణలు, నిత్యఔపోషణాధితో ఉత్సవాలు నిర్వహించనున్నారు. రెండోరోజు 24న కూడా ఇవే కార్యక్రమాలు. 25న రాత్రి 8 నుంచి 10.30 గంటల వరకు ఎదురుకోలు (రాయబారం) ఉత్సవం, కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 26న వేదపండితుల సదస్సు, 27న పూర్ణాహుతి, కృష్ణానదిలో ఆది దంపతులకు అవభృత స్నానం, సాయంత్రం ధ్వజారోహణ నిర్వహిస్తారు. 28న సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు, ద్వాదశ ప్రదక్షణలు, వేదోక్త కార్యక్రమాలు, రాత్రి 8.30 గంటలకు పవళింపు సేవను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. 29న రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించనున్నారు.  

పూర్ణాహుతితో వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపు 

తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పుష్పార్చనలు, మూలమంత్ర హవనాలు, త్రికాల మండపారాధనలతో నిర్వహించిన వసంత నవరాత్రి ఉత్సవాలకు గురువారం స్థానాచార్యులు శివప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించి ముగింపు పలికారు. 

Updated Date - 2021-04-23T06:36:46+05:30 IST