శేషవాహనంపై ఊరేగుతున్న లక్ష్మీనరసింహస్వామి
వర్గల్, మార్చి 27 : వర్గల్ మండలం నాచారం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో స్వామివారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీనృసింహస్వామి వారికి శేషవాహనోత్సవ సేవ నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారిని ఆలయ ఉత్తర ద్వారం నుంచి కల్యాణ మండపం వరకు సర్వంగా సుందరంగా అలంకరించిన శేషవాహనంపై అధిష్ఠింపజేసి భాజా భజంత్రిలు, మేళతాళాల మధ్యన నాచగిరి పుర వీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ హన్మంతరావు నేతృత్వంలో ఉత్సవాలు జరుగుతుండగా.. సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు నిర్వహించారు. నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి పెద్ద గరుడోత్సవ సేవ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.