TTD: తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ

ABN , First Publish Date - 2022-09-26T01:54:39+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ ఘనంగా నిర్వహించనున్నారు.

TTD: తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం ఆలయంలో సేనాధిపతిని సర్వాంగసుందరంగా అలంకరించి విశేష సమర్పణ కావిస్తారు. అనంతరం తిరుచ్చిలో ఆశీనులు చేస్తారు. ఏడు గంటలకు ఆలయం నుంచి బయల్దేరి నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు ప్రారంభిస్తారు. ప్రదక్షిణగా పడమరమాడ వీధిలోని నైరుతిమూలలో ఉన్న వసంత మండపం ముందుకు వేంచేస్తారు. మండపంలో శాస్త్రోక్త కార్యక్రమాల మధ్య పుట్టమన్నును సేకరిస్తారు. నవపాలికలలో భద్రపరుచుకుని మిగిలిన మాడవీధుల ఊరేగుతూ ఆలయ యాగశాలకు వేంచేపుచేస్తారు. అక్కడ అర్చకస్వాములు ఆగమోక్తంగా కైంకర్యాలు నిర్వహించి అంకురార్పణ(బీజవాపం) కార్యక్రమం నిర్వహిస్తారు. దాంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేషవాహనాలతో బ్రహ్మోత్సవాల వాహనసేవలు ప్రారంభం అవుతాయి. 


రేపు తిరుమలకు జగన్‌

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరికి చేరుకుని విద్యుత్‌ బస్సులను ప్రారంభిస్తారు. అక్కడినుంచి తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. ఈ మేరకు సీఎం పర్యటన నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయం నుంచి తిరుమల వరకు ముందుస్తు ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ వెంకటరమాణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Updated Date - 2022-09-26T01:54:39+05:30 IST