Bengaluru: 9 మందికి ప్రాణం పోసింది..

ABN , First Publish Date - 2022-09-23T17:22:00+05:30 IST

ఆ అమ్మాయి తొమ్మిది మందికి ప్రాణం పోసింది. తన ప్రాణం పోయినా ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాటి వారిని ఆదుకుని తన పేరుకు సార్థకత

Bengaluru: 9 మందికి ప్రాణం పోసింది..

- బ్రెయిన్‌డెడ్‌ విద్యార్థిని అవయవాలు పలువురికి అమరిక

- చిక్కమగళూరు నుంచి బెంగళూరుకు హెలికాప్టర్‌లో గుండె తరలింపు


బెంగళూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆ అమ్మాయి తొమ్మిది మందికి ప్రాణం పోసింది. తన ప్రాణం పోయినా ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాటి వారిని ఆదుకుని తన పేరుకు సార్థకత సాధించింది. ఈ నెల 18న చిక్కమగళూరులో బస్సు దిగుతుండగా ప్రమాదానికి గురై బుధవారం బ్రెయిన్‌డెడ్‌(Brain dead)గా మారిన ఇంటర్‌ విద్యార్థిని రక్షితాభాయి (17)కి చెందిన అవయవాలను 9మందికి అమర్చారు. గురువారం రక్షితా తల్లిదండ్రులతో వైద్యులు చర్చించి అవయవదానానికి ఒప్పించారు. ఈమేరకు జీవన సార్థక సంస్థకు సమాచారం అందించి అవయవాలు ఏఏ ప్రాంతాలలోని బాధితులకు అవసరమో వాటికి అనుగుణంగా పంపారు. చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రికి హెలికాప్టర్లో గుండెను తరలించారు. మంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రికి కాలేయాన్ని, మంగళూరు(Mangaluru) కేఎంసీ ఆసుపత్రికి కిడ్నీలను పంపారు. మణిపాల్‌కు జీరో ట్రాఫిక్‌ ద్వారా అవయవాలను తరలించారు. కళ్ళతో పాటు కవాటాలు కలిపి తొమ్మిది మందికి సమకూర్చినట్లు జిల్లా ఆసుపత్రి ప్రముఖ వైద్యులు మోహన్‌కుమార్‌ తెలిపారు. గుండెను తొమ్మిదేళ్ళ బాలుడికి అమర్చనున్నట్లు తెలిపారు. అవయవదానం ప్రక్రియ పూర్తీ అయిన తర్వాత రక్షితా చదివే కళాశాలకు పార్థివదేహాన్ని తరలించారు. విద్యార్థులు చివరి చూపు చూశాక కడూరు తాలూకా సోమనహళ్ళి తండాకు తీసుకెళ్ళి అంత్యక్రియలు జరిపారు. తల్లిదండ్రులు శేఖర్‌నాయక్‌, లక్ష్మీ భాయి దంపతులను వైద్యులు, అధ్యాపకులు ఓదార్చారు.  

Updated Date - 2022-09-23T17:22:00+05:30 IST