
ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారతీయ పరిణామాలలో జాతీయోద్యమంతో పాటు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా పేర్కొంటారు. భౌగోళిక విస్తృతి రీత్యా, ఉద్యమ వ్యాప్తి రీత్యా రెంటికీ చాలా అంతరం ఉన్నది కానీ, తీవ్రతలోను, ప్రభావ శీలతలోనూ రెండవది దేనికీ తీసిపోనిది. నేరుగా వలసపాలనలో లేకుండా, బ్రిటిష్ పరమాధికారం కిందనే స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్న హైదరాబాద్ రాజ్యంలో, క్రూరమైన భూస్వామ్య ఆధిపత్యానికి, సామాజికార్థిక దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై, అనంతరం కమ్యూనిస్టుల నాయకత్వంలో మిలిటెంట్ పోరాటాన్ని చేపట్టారు.
ఆ పోరాట కాలంలోనే భారతదేశం స్వతంత్రం కావడం, హైదరాబాద్ రాజ్యాన్ని విలీనం చేసుకోవడానికి సైనికచర్య జరగడం, రైతాంగ ఉద్యమాన్ని అణచివేసే ప్రక్రియ కొనసాగడం.. ఇదంతా చరిత్ర క్రమం. రైతాంగ ఉద్యమం లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి, ఫలితాలు ఏమి సమకూరాయి అన్న చర్చను పక్కన పెడితే, అది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. స్ఫూర్తినిచ్చే జనగాథ అయింది. భూస్వామ్యం కోరలు పీకి, నిజామును గడగడలాడించి, నెహ్రూ ప్రభుత్వానికి చెమటలు తెప్పించిన చైతన్యంగా అది జనస్మృతి అయింది. అనంతర పోరాటాలకు ప్రేరణ అయింది.

చరిత్రగా మిగిలిపోకుండా వర్తమానంగా కూడా కొనసాగిన ఒక వీరగాథ గతవారం కన్నుమూసింది. ఆ గాథ పేరు మల్లు స్వరాజ్యం. సమరశీలతకు పర్యాయపదంగా, తరతరాల పోరాటానికి వారధిగా, ఉద్యమ మహిళగా ఇప్పటిదాకా మన ముందు నిలిచిన స్వరాజ్యం ఒక జ్ఞాపకంగా మారిపోయారు. పురుషాధిక్య, పితృస్వామిక విలువలు ఆధిక్యంలో ఉన్న సమాజంలో సహజంగా ఏం జరుగుతుందో, తొలినాటి ప్రజాహిత సమూహాలలోను, సంఘాలలోనూ అదే జరిగింది. జాతీయోద్యమం అయినా కమ్యూనిస్టు ఉద్యమం అయినా అధిక సంఖ్యలో మగవారే ఉండేవారు, ఎంతగా ప్రగతిశీలురు అయినా స్త్రీల ప్రతిపత్తి విషయంలో సంప్రదాయ భావాలే చెలామణీ అయ్యేవి.
తమకు అవసరమైన స్థలాన్ని, గుర్తింపును స్త్రీలు కొద్దికొద్దిగా సాధించుకుంటూ ముందుకు వెళ్లారు. సాయుధ దళసభ్యురాలిగా పోరాట కర్తవ్యాన్ని, గ్రామాలలో జనసమీకరణ, రక్షణ బాధ్యతలను నిర్వహించిన మల్లు స్వరాజ్యం రాజకీయ ప్రస్థానం రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ప్రజాప్రతినిధి కావడం దాకా సాగింది. కార్యకర్తే కాదు, ఆమె సృజనశీలి కూడా. జనం బాణీలో పాటలు కట్టి, పాడిన వాగ్గేయకారిణి. శాసనసభ్యురాలు అయిన తరువాత కూడా ఆమెను ప్రజలు బతకమ్మ పాట పాడడానికి తమ గ్రామాలకు ఆహ్వానించేవారు. ఆమె దృష్టిలో చట్టసభల సభ్యత్వం కంటె పార్టీ కార్యకర్తృత్వమే గొప్పది. ఆమె క్రియాశీలతే ఆమెను మార్క్సిస్టు పార్టీ అత్యున్నత మండలిలో సభ్యురాలిని చేసింది.
సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ పోరాటంలో పెద్ద నాయకుడు, భర్త మల్లు నరసింహారెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ, స్వరాజ్యం అభిప్రాయాలలో అవగాహనలో స్వతంత్రతనే పాటించారు. సొంత వ్యక్తిత్వాన్నే ప్రకటించుకున్నారు. తానున్న పార్టీకి గట్టిగా కట్టుబడి ఉన్నప్పటికీ, ప్రజాపోరాటాల తీరు విషయంలో తన అసంతృప్తిని దాచుకోలేదు, ఆశనూ చంపుకోలేదు. ప్రత్యేక తెలంగాణ పోరాటవాదులు ఆమెను మద్దతు కోరినప్పుడు, తనది వేరు తెలంగాణ కాదని, వీర తెలంగాణ అని చెప్పిన సంఘటనలున్నాయి. కానీ, అదే సమయంలో ఆమె, పార్టీ అంతర్గత వేదికలలో ఒక ప్రజా ఉద్యమాన్ని నిరాకరించరాదని, వైఖరిని పునరాలోచించుకోవాలని సూచనలు చేసేవారని తెలిసినవారు చెబుతారు.
కీర్తి, ప్రఖ్యాతి విషయంలో కూడా స్త్రీలకు చిన్నపీటే లభిస్తుంది. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమల, స్వరాజ్యం వంటి కొన్ని పేర్లు తప్ప వినిపించవు. స్వరాజ్యం తన జ్ఞాపకాలలో, నాటి తెలంగాణ పోరాటంలో మహిళల భాగస్వామ్యాన్ని సామాజిక, కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో స్త్రీల చొరవను వివరించి చెప్పారు. రెండున్నర సంవత్సరాల కిందట, స్వరాజ్యం జ్ఞాపకాల పుస్తకం ‘నా గొంతే తుపాకి తూటా’ ఆవిష్కరణ అనేక మహిళాసంఘాల, బృందాల ప్రతినిధులు, రచయితలు, పాత్రికేయులతో పెద్ద వేడుకగా జరిగింది. ‘‘వామపక్ష పార్టీలు నేటి పరిస్థితులకు అనుగుణంగా తమ పనివిధానాన్ని మార్చుకోవాలి, దోపిడిదారులకు ముకుతాడు వేసేవిధంగా పోరాటాలు చేస్తేనే ప్రజలు విశ్వసిస్తారు.
సమసమాజాన్ని నిర్మించేందుకు, ప్రజారాజ్యాన్ని సాధించాలనే ఒక ప్రతిజ్ఞను జనంలోకి తీసుకెళ్లి వామపక్షాలను బతికించాలి. హాలు మీటింగులకే పరిమితం కాకుండా ఉద్యమకారులు జనంలోకి వెళ్లాలి’’ అంటూ ఆ సందర్భంగా స్వరాజ్యం చేసిన ప్రసంగం ఉత్తేజకరంగా ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో మేధావుల పాత్ర గురించి కూడా ఆమె నొక్కి చెప్పారు. పదేళ్ల వయసు నుంచి రాజకీయస్పృహను అలవరచుకుంటూ వచ్చిన స్వరాజ్యం, చివరి క్షణం దాకా బిగియించిన పిడికిలినే తన సందేశంగా ఇస్తూ వచ్చారు. ఐదారు తరగతులకు మించి పాఠశాల విద్య లేని స్వరాజ్యం, సాహిత్యం నుంచి, ఆచరణ నుంచి, ఉద్యమాల నుంచి అపారమైన పరిజ్ఞానాన్ని, అవగాహనను అలవరచుకున్నారు.
ప్రజాపోరాటవాదిగా ఆమె నుంచి నేర్చుకోవాలి. ఆమె సాహసాన్ని, త్యాగాన్ని ప్రేరణగా తీసుకోవాలి. ఒక మహిళగా తన ప్రయాణాన్ని, విజయాన్ని గుర్తించాలి. తెలుగు సమాజాల నుంచి ప్రభవించిన, ప్రజా పోరాటాలు సృజియించిన అత్యంత అరుదైన స్త్రీమూర్తులలో మల్లు స్వరాజ్యం ఒకరు.