బొమ్మతో పోలీసులనే ఆటపట్టించిన యువకుడు.. చివరికి!

ABN , First Publish Date - 2021-04-12T16:07:22+05:30 IST

కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ.. ఓ యువకుడు ప్రాంక్ వీడియో కోసం పోలీసులనే ఆటపట్టించాడు. చివరికి సదరు యువకుడు పోలీసుల ఆగ్రహానికి లోనైన ఘటన బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో చోటు చేసుకుంది.

బొమ్మతో పోలీసులనే ఆటపట్టించిన యువకుడు.. చివరికి!

బ్రెజిల్: కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ.. ఓ యువకుడు ప్రాంక్ వీడియో కోసం పోలీసులనే ఆటపట్టించాడు. చివరికి సదరు యువకుడు పోలీసుల ఆగ్రహానికి లోనైన ఘటన బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లో మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఈ క్రమంలో.. కొవిడ్-19ని కట్టడి చేయడం కోసం అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సావో పాలో నగరంలో కూడా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అక్కడ స్థానికంగా ఉన్న బీచ్‌లోకి పర్యటకులకు అనుమతిలేదు. అయితే ఓ 29ఏళ్ల యువకుడు నిబంధనలను అతిక్రమించి ఆ బీచ్‌లోకి ప్రవేశించాడు. అంతేకాకుండా మాస్క్ లేకుండా ఉన్న యువతి బొమ్మను అక్కడ ప్రతిష్టించాడు. కాగా.. అటువైపుగా వచ్చిన పోలీసులు.. బీచ్‌లోని బొమ్మను చూసి, యువతిగా భావించారు. హల్‌చల్ చేశారు. తర్వాత బీచ్‌లో మాస్క్ లేకుండా ఉన్నది యువతి కాదు.. బొమ్మ అని గ్రహించి కంగుతిన్నారు. ఇదిలా ఉంటే.. యువతి బొమ్మను బీచ్‌లో పెట్టిన యువకుడు.. దూరంగా ఉండి, పోలీసులు చేసిన హడావిడికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీశాడు. అంతేకాకుండా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్త వైరల్ అవ్వడంతో.. ఆగ్రహించిన పోలీసులు, నిబంధనలు అతిక్రమించి బీచ్‌లోకి ప్రవేశించినందుకుగాను సదరు యువకుడికి జరిమానా విధించారు. 


Updated Date - 2021-04-12T16:07:22+05:30 IST