మంత్రి రోజా ప్రారంభించిన షిప్‌కు బ్రేకులు

ABN , First Publish Date - 2022-06-10T18:23:42+05:30 IST

పుదుచ్చేరిలో కార్డెలియా క్రూయిజ్ షిప్‌కు బ్రేక్ పడింది. క్రూయిజ్‌షిప్ హాల్టింగ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం నిరాకరించింది.

మంత్రి రోజా ప్రారంభించిన షిప్‌కు బ్రేకులు

విశాఖపట్నం: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించిన క్రూయిజ్‌ షిప్‌(Cordelia cruise ship) కు  ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లే ఎంప్రెస్ క్రూయిజ్‌ షిప్‌ను మంత్రి రోజా విశాఖలో ప్రారంభించారు. అయితే క్యాసినో, గ్యాంబ్లింగ్ ఆడే క్రూయిజ్‌కు అనుమతిచ్చేది లేదంటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై బ్రేక్ వేశారు. దీంతో తెల్లవారు జామున 4 గంటల నుంచి షిప్ నడి సంద్రంలోనే ఆగిపోయింది. క్యాసినో, గ్యాంబ్లింగ్ ఉండే క్రూయిజ్‌ను పుదుచ్చేరిలోకి అనుమతించొద్దు అంటూ అక్కడి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన గవర్నర్‌ క్రూయిజ్‌ను అనుమతించాలంటే అందులో క్యాసినో, గ్యాంబ్లింగ్ లేదని నిర్ధారణ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. పుదుచ్చేరి సమీపంలో లగ్జరీ క్రూయిజ్ షిప్‌కు లంగరు వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. టూరిజంను డెవలప్‌ చేయాలనే ఆసక్తి ఉన్నా.. భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమన్నారు. కేవలం ఆదాయం కోసం యువత జీవితాలను పాడు చేయమని లెఫ్టినెంట్ గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజలకు లగ్జరీ క్రూయిజ్‌లో కొత్త సముద్ర ప్రయాణ అనుభూతిని అందించాలని తమిళనాడు ప్రభుత్వం కోర్డెలియా క్రూయిజ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.   తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన ఈ క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో భారీ క్రూయిజ్‌ సముద్రం మధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. 


షిప్ ప్లానింగ్స్ ఇలా ఉన్నాయి..

విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లేలా.. ఈ క్రూయిజ్‌ ట్రిప్‌ను ప్లాన్‌ చేశారు. జూన్‌ 8 సాయంత్రం విశాఖ నుంచి బయల్దేరిన ఈ షిప్‌ పదో తేదీ ఉదయం పుదుచ్చేరి చేరుకోవాలి. అయితే క్రూయిజ్‌లో గ్యాంబ్లింగ్ ఉందని.. పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతించడం లేదు. వాస్తవానికి ఈ క్రూయిజ్‌లో రెండు రోజులు, మూడు రోజులు, 5 రోజులు ఇలా మూడు ప్లాన్‌ల పేరిట టికెట్లు విక్రయించారు.  విశాఖ నుంచి పుదుచ్చేరికి, విశాఖ నుంచి చెన్నైకి నిర్వాహకులు టికెట్లు విక్రయించారు. ప్రస్తుతం పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతించకపోవడంతో క్రూయిజ్‌ నేరుగా చెన్నై వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పుదుచ్చేరి నుంచి చెన్నై టికెట్‌ తీసుకున్న ప్రయాణికులకు రీఫండ్ ఇచ్చే ఉద్దేశంలో ఉంది క్రూయిజ్ యాజమాన్యం. ఈ భారీ క్రూయిజ్‌లో ఎకానమీ, బిజినెస్ సూట్‌ రూమ్స్‌తో పాటు బార్, స్పా వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి.



Updated Date - 2022-06-10T18:23:42+05:30 IST