‘ఉపాధి’కి బ్రేక్‌!

ABN , First Publish Date - 2021-05-12T05:06:20+05:30 IST

కరోనా అన్నివర్గాలపై ప్రభావం చూపుతోంది. ఉపాధి వేతనదారులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. దీంతో గ్రామాల్లో పనులు నిలిపివేస్తున్నారు. జిల్లాలోని వివిధ పంచాయతీల్లో ఇప్పటికే గ్రామ సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఉపాధి పనులు స్వచ్ఛందంగా నిలిపేయాలని, వెళ్లరాదని తీర్మానాలు చేస్తున్నారు.

‘ఉపాధి’కి బ్రేక్‌!
రేగిడి మండలం సంకిలిలో నిలిచిన ఉపాధి పనులు

కరోనా కారణంగా గ్రామాల్లో నిలిచిపోతున్న పనులు

కేసుల పెరుగుదలతో ముందుకురాని వేతనదారులు 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా అన్నివర్గాలపై ప్రభావం చూపుతోంది. ఉపాధి వేతనదారులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. దీంతో గ్రామాల్లో పనులు నిలిపివేస్తున్నారు. జిల్లాలోని వివిధ పంచాయతీల్లో ఇప్పటికే గ్రామ సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఉపాధి పనులు స్వచ్ఛందంగా నిలిపేయాలని, వెళ్లరాదని తీర్మానాలు చేస్తున్నారు. ఉపాధి వేతనదారుల గ్రూపుల్లో, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడుతుండంతో ఎక్కువ మంది పనులకు హాజరయ్యేందుకు ఆసక్తి కనబరచడం లేదు. జిల్లాలో మార్చి నెలాఖరు వరకూ ప్రతిరోజూ 3.20 లక్షల పనిదినాలు కల్పించినట్టు డ్వామా గణాంకాలు చెబుతున్నాయి. ఆ సంఖ్య ఏప్రిల్‌లో తగ్గుముఖం పట్టింది. మొదటి వారం నుంచి ప్రతిరోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. గ్రామాల్లో ఉపాధి వేతనదారులు సైతం కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఈ తరుణంలో ఉపాధి పనులు నిలిపేస్తే, కూలీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో డ్వామా అధికారులు ఎటువంటి ఆంక్షలు పెట్టడం లేదు. 


స్వచ్ఛందంగా నిలిపివేత..

జిల్లాలో 985 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పనులు చేపట్టాల్సి ఉంది. చెరువులు, పంట కాలువల్లో పూడిక తొలగింపు వంటి పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. పరిపాలనాపరమైన అనుమతి   ఉందని అధికారులు పేర్కొంటున్నా, ఆ మేరకు గ్రామస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. పాలకొండ, టెక్కలి రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో సుమారు 325 గ్రామ పంచాయతీలలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రామస్థులే స్వచ్ఛందంగా పనులు నిలిపేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల్లో కూడా కూలీలు కరోనా నిబంధనలు పాటించి చేసుకోవచ్చనే వెసులుబాటు ఇచ్చింది. కానీ పెరుగుతున్న కేసులకు భయపడి గ్రామ సర్పంచ్‌లు ఉపాధి కూలీలతో చర్చించి అనేక గ్రామాల్లో స్వచ్ఛందంగా పనులు నిలిపేస్తున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం, గార, ఎచ్చెర్ల , రణస్థలం, లావేరు, పొందూరు, ఆమదాలవలస, బూర్జ, కొత్తూరు, నరసన్నపేట, జలుమూరు, పోలాకి మండలాల్లో చెరువుల్లో పూడిక తొలగింపు పనుల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొనేవారు. పెరుగుతున్న ఎండలు, కరోనా కేసులతో క్రమేపీ తుగ్గముఖం పట్టారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1.08 లక్షల మంది పనులకు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. 

నిబంధనలకు లోబడి...

ఉపాధి పనులు నిలిపేయాలని ఎటువంటి ఉత్తర్వులు లేవు. జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరిగిన నేపథ్యంలో పంచాయతీల్లో స్వచ్ఛందంగా పనులు నిలిపేస్తున్న మాట వాస్తవమే. కొవిడ్‌-19  నిబంధనలకు లోబడి పనులు చేపడతాం. కూలీలు ముందుకు వస్తే, పనులు కల్పించేందుకు సిద్ధంగానే ఉన్నాం.  మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా ఉపాధి పనుల్లో పాల్గొనవచ్చు. 

-హెచ్‌.కూర్మారావు, పీడీ, డ్వామా, శ్రీకాకుళం


ఫొటో : 8ఎస్‌కేఎల్‌1 : 

Updated Date - 2021-05-12T05:06:20+05:30 IST