సచివాలయాల నిర్మాణానికి బ్రేక్‌

ABN , First Publish Date - 2022-01-24T05:48:12+05:30 IST

ప్రతీ పంచాయతీ కార్యాలయం వద్ద సచివాలయ నిర్మాణం చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేశారు.

సచివాలయాల నిర్మాణానికి బ్రేక్‌
పులిగడ్డలో నిలిచిపోయిన సచివాలయ భవన నిర్మాణం

బిల్లుల పెండింగ్‌పై కాంట్రాక్టర్ల ఆవేదన

అవనిగడ్డ రూరల్‌ : ప్రతీ పంచాయతీ కార్యాలయం వద్ద సచివాలయ నిర్మాణం చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేశారు. అధికార పార్టీని నమ్ముకుని ఉన్న పలువురు నాయకులు ఈ పనులు చేజిక్కించుకోవటానికి ముమ్మర ప్రయత్నాలు చేసి ఎట్టకేటలకు దక్కించుకున్నారు. సచివాలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టి ఏడాదిన్నర కాలం గడిచినా ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా రాకపోవటంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణానికి సైతం ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఏ ఒక్కరూ కూడా టెండర్లు దాఖలు చేయటానికి ముందుకు రాలేదు. పులిగడ్డతోపాటు అవనిగడ్డలో రెండు, వేకనూరులో ఒకటి, తుంగలవారిపాలెంలో ఒక ప్రాంతంలో సచివాలయ నిర్మాణాలు ముందుకు జరగకపోవటంతో అటు కాంట్రాక్టర్లతోపాటు ఇటు అధికారులు కూడా లబోదిబోమంటున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తే త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని, అటు ప్రభుత్వం నగదు ఇవ్వకపోవటంతో ఎక్కడపనులు అక్కడే నిలిచిపోయాయని, దీంతో ఉన్నతాధికారుల నుంచి తమకు ఆక్షింతలు తప్పటం లేదని పలువురు అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నిలిచిపోయిన నిర్మాణాలను తక్షణమే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.  


Updated Date - 2022-01-24T05:48:12+05:30 IST