టైటాన్స్‌ జోరుకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-05-04T09:00:37+05:30 IST

ఐదు వరుస విజయాలతో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్న గుజరాత్‌ టైటాన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ షాకిచ్చింది. శిఖర్‌ ధవన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్‌) అర్ధశతకంతో పాటు రబాడ (4/33) నిప్పులు చెరగడంతో.. ఐపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్లతో..

టైటాన్స్‌ జోరుకు బ్రేక్‌

పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ షో 

చెలరేగిన రబాడ, ధవన్‌ 


ముంబై: ఐదు వరుస విజయాలతో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్న గుజరాత్‌ టైటాన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ షాకిచ్చింది. శిఖర్‌ ధవన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్‌) అర్ధశతకంతో పాటు రబాడ (4/33) నిప్పులు చెరగడంతో.. ఐపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్లతో టైటాన్స్‌ను ఓడించింది. గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. తొలుత గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. సుదర్శన్‌ (50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఛేదనలో పంజాబ్‌ 16 ఓవర్లలో 2 వికెట్లకు 145 పరుగులు చేసి నెగ్గింది. రాజపక్స (28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), లివింగ్‌స్టోన్‌ (10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30 నాటౌట్‌) ధాటిగా ఆడారు. రబాడ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. 


రాణించిన రాజపక్స..: లక్ష్యం చిన్నదే అయినా.. గుజరాత్‌ బౌలింగ్‌ లైన్‌పను చూస్తే.. పంజాబ్‌ గెలుపు అంత తేలిగ్గా అనిపించలేదు. అందుకు తగ్గట్టే మయాంక్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన బెయిర్‌స్టో (1) వేగంగా పెవిలియన్‌ చేరాడు. కానీ, మరో ఓపెనర్‌ ధవన్‌, రాజపక్స ధాటిగా ఆడుతూ అనుమానాలను పటాపంచలు చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో పంజాబ్‌ అలవోకగా నెగ్గింది. సంగ్వాన్‌ వేసిన రెండో ఓవర్‌లో రెండు బౌండ్రీలు బాదిన గబ్బర్‌.. జోసెఫ్‌ వేసిన 4వ ఓవర్‌లో 6,4తో బ్యాట్‌ ఝుళిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాజపక్స కూడా రెండు ఫోర్లతో బ్యాట్‌కు పని చెప్పడంతో.. పవర్‌ప్లే ముగిసే సమయానికి పంజాబ్‌ 43/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే, రషీద్‌ బౌలింగ్‌కు రావడంతో వీరిద్దరూ రిస్క్‌ తీసుకోకుండా స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించారు. కాగా, జోరుగా సాగుతున్న వీరి భాగస్వామ్యాన్ని 12వ ఓవర్‌లో ఫెర్గూసన్‌ విడదీశాడు. ఫోర్‌తో ధవన్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. సిక్స్‌ బాదిన రాజపక్సను ఫెర్గూసన్‌ ఎల్బీ చేశాడు. చివరి 30 బంతుల్లో 27 పరుగులు కావాల్సి సమయంలో లివింగ్‌స్టోన్‌ రెచ్చిపోయాడు. షమి వేసిన 16వ ఓవర్‌లో 6,6,6,4,2,4తో 28 పరుగులు పిండుకున్న లివింగ్‌స్టోన్‌.. మరో 24 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు. 


పెవిలియన్‌కు క్యూ..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ నిర్ణయం బెడిసికొట్టింది. రబాడ దెబ్బకు స్టార్‌ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినా.. సుదర్శన్‌ ఓపిగ్గా క్రీజులో నిలిచాడు. తెవాటియాతో కలసి 5వ వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యంతో టైటాన్స్‌కు ఓ మాదిరి స్కోరందించాడు. పవర్‌ప్లే లోపలే ఓపెనర్లు గిల్‌ (9), సాహా (21) వెనుదిరగ్గా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (1)ను రిషి క్యాచ్‌ అవుట్‌ చేశాడు. దీంతో గుజరాత్‌ 44/3తో ఇబ్బందుల్లో పడింది. 5 నుంచి 11 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్‌ కూడా ఇవ్వని పంజాబ్‌ బౌలర్లు.. సుదర్శన్‌, మిల్లర్‌ (11)ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన మిల్లర్‌ వికెట్‌ పారేసుకున్నాడు. అనంతరం తెవాటియా (11) క్రీజులోకి వచ్చిన ప్రభావమేమో కానీ.. 47 బంతుల తర్వాత సుదర్శన్‌ బౌండ్రీ బాదాడు. ఆ తర్వాత రెండు ఓవర్లలో సాయి మరో రెండు ఫోర్లు కొట్టడంతో.. 16 ఓవర్‌లో గుజరాత్‌ స్కోరు సెంచరీ దాటింది. కాగా, డెత్‌ ఓవర్లలో విరుచుకుపడే తెవాటియా, రషీద్‌ (0)తోపాటు ఫెర్గూసన్‌ (5)ను అవుట్‌ చేసిన రబాడ.. టైటాన్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. చివరి 5 ఓవర్లలో టైటాన్స్‌ 45 పరుగులు మాత్రమే స్కోరు చేయగలిగింది. 




స్కోరుబోర్డు

గుజరాత్‌ టైటాన్స్‌: వృద్ధిమాన్‌ సాహా (సి) మయాంక్‌ అగర్వాల్‌ (బి) రబాడ 21, శుబ్‌మన్‌ గిల్‌ (రనౌట్‌/ధవన్‌) 9, సాయి సుదర్శన్‌ (నాటౌట్‌) 65, హార్దిక్‌ పాండ్యా (సి) జితేశ్‌ (బి) రిషి ధవన్‌ 1, డేవిడ్‌ మిల్లర్‌ (సి) రబాడ (బి) లివింగ్‌స్టోన్‌ 11, రాహుల్‌ తెవాటియా (సి) సందీప్‌ శర్మ (బి) రబాడ 11, రషీద్‌ ఖాన్‌ (సి) జితేశ్‌ (బి) రబాడ 0, ప్రదీప్‌ సంగ్వాన్‌ (బి) అర్ష్‌దీప్‌ 2, ఫెర్గూసన్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) రబాడ 5, జోసెఫ్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం 20 ఓవర్లలో 143/8; వికెట్లపతనం: 1/17, 2/34, 3/44, 4/67, 5/112, 6/112, 7/122, 8/129; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-17-0, రబాడ 4-0-33-4, అర్ష్‌దీప్‌ 4-0-36-1, రిషి ధవన్‌ 4-0-26-1, లివింగ్‌ స్టోన్‌ 2.3-0-15-1, రాహుల్‌ చాహర్‌ 1.3-0-11-0.

పంజాబ్‌ కింగ్స్‌: బెయిర్‌స్టో (సి) సంగ్వాన్‌ (బి) షమి 1, శిఖర్‌ ధవన్‌ (నాటౌట్‌) 62, రాజపక్స (ఎల్బీ) ఫెర్గూసన్‌ 40, లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 30, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం 16 ఓవర్లలో 145/2; వికెట్లపతనం: 1/10, 2/97; బౌలింగ్‌: షమి 4-0-43-1, ప్రదీప్‌ సంగ్వాన్‌ 2-0-23-0, అల్జరీ జోసెఫ్‌ 3-0-25-0, ఫెర్గూసన్‌ 3-0-29-1, రషీద్‌ ఖాన్‌ 4-0-21-0.

Read more