బుల్డోజర్ కూల్చివేతలతో శాంతి భద్రతల విచ్ఛిన్నం: చిదంబరం

ABN , First Publish Date - 2022-04-24T22:25:45+05:30 IST

జహంగీర్‌పూర్‌లో ఆక్రమణల కూల్చివేత, దీనికి ముందు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ఘటనలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం..

బుల్డోజర్ కూల్చివేతలతో శాంతి భద్రతల విచ్ఛిన్నం: చిదంబరం

న్యూఢిల్లీ: జహంగీర్‌పూర్‌లో ఆక్రమణల కూల్చివేత, దీనికి ముందు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ఘటనలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీినియర్ నేత పి.చిదంబరం తీవ్ర ఆక్షేపణ తెలిపారు. బుల్డోజర్లతో కూల్చివేతలను బీజేపీ నేతలు సమర్ధించడం చట్టాన్ని కాలరాయడమేనని అన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయనడానికి ఈ ఘటనలు నిదర్శనమని చిదంబరం పీటీఐ వార్తా సంస్థకు ఆదివారంనాడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


జహంగీర్‌పురి కూల్చివేతల ప్రదేశాన్ని విపక్ష నేతలైన బ్రిందా కారత్, అసదుద్దీన్ ఒవైసీ సందర్శించిన ఒక రోజు తర్వాతే కాంగ్రెస్ ప్రతినిధి బృందం అక్కడకు వెళ్లిందన్న విమర్శలపై చిదంబరం మాట్లాడుతూ, ఎవరు ఎప్పడు వెళ్లారనేది తనకు తెలియదని అన్నారు. కూల్చివేతలు జరిగిన స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రతినిధి బృందం అక్కడకు వెళ్లిందని, అనూహ్యరీతిలో జాప్యం జరిగి ఉంటే దానికి తాను విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.


''నా ఆందోళన అంతా చట్టబద్ధ విధానాలను నిర్ద్వంద్వంగా ఉల్లంఘిస్తున్నారన్న విషయంపైనే. మతాన్ని ఇందులోకి ఎందుకు తీసుకువస్తారు?  రాజ్యాంగ నిర్మాణానికి సెక్యులరిజం పునాది. సెక్యూలరిజం విలువలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేవలం లౌకికవాదానికి కట్టుబడి ఉన్నంత మాత్రాన సరిపోదు. సెక్యులరిజం భాషలోనే స్పందించాలి. లౌకికవాద ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన గళం వినిపించాలి. సెక్యులరిజానికి దూరంగా జరిగేందుకు నేను ఎంతమాత్రం ఇష్టపడను. సూటిమార్గం నుంచి పక్కకు మళ్లడం వల్ల సాధించేది ఏమీ ఉండదు'' అని చిందబరం అన్నారు.


ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన బుల్డోడర్ రాజకీయాలపై చిదంబరం మాట్లాడుతూ, వీటిని సమర్ధిస్తూ బీజేపీ నేతల వ్యాఖ్యలు చట్టాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయన్నారు. ''ప్రతి మున్సిపాలిటీ లేదా పంచాయతీ చట్టం తీసుకోండి. ఆక్రమణల, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆక్రమణలు జరిగినట్టు గుర్తిస్తే వాటిని తొలగించాలని నోటీసులు ఇస్తారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు అవకాశం ఉంటుంది. సహేతుకమైన ఉత్తర్వు జారీ చేసినప్పుడు, అప్పీల్ చేసుకునే వీలుంటుంది. దానిని కూడా తోసిపుచ్చినప్పుడు, కూల్చివేతలకు ముందే మరో నోటీసు ఇస్తారు. ఇటీవల చోటుచేసుకుంటున్న కూల్చివేత ఘటనల్లో ఇలాంటి నిబంధనలను ఏమైనా పాటించారా? అందువల్లే ఇందులో చట్టం లోపించదని చెప్పాల్సి వస్తుంది. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలినట్టు చెప్పాల్సి ఉంటుంది. ఎవరి ఇళ్లు లేదా ఎవరి దుకాణాలు కూల్చేశారనేది ఇక్కడ అప్రస్తుతం'' అని చిదబంరం అన్నారు.


ధనవంతులు నివసించే కాలనీల్లోనూ చాలా అక్రమ నిర్మాణాలు ఉంటుంటాయని ఆయన తెలిపారు. ఇక్కడ తాను సెక్యులరిజం ప్రశ్న లేవనెత్తడం లేదని, ఇలాంటి కూల్చివేతలను చట్టం అనుమతిస్తుందా అనేదే తన ప్రశ్న అని అన్నారు. అనుమతించదన్నదే జవాబయితే, కూల్చివేతలను ఖండించాల్సి ఉంటుందని, చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే అది ప్రమాదమని అన్నారు. జహంగీర్‌పురి కూల్చివేతల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ బంగ్లాదేశీలు, రోహింగ్యాల ప్రస్తావన చేస్తోందన్న ప్రశ్నపై చిదంబరం సమాధానమిస్తూ, బీజేపీలానే ఆప్ సైతం అడ్లెంచర్లు చేస్తోందన్నారు. బర్నింగ్ ఇష్యూలను ఒక ఆయుధంగా తీసుకుని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు జరుగుతుండటం ఆందోళనకరమని, నిజానికి ఎలాటి ప్రాధాన్యత లేని అంశాల నుంచి ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారని విమర్శించారు. బంగ్లాదేశీలు, రోహింగ్యాలకూ, కూల్చివేతలకు సంబంధం ఏమిటని చిదంబరం ప్రశ్నించారు.

Updated Date - 2022-04-24T22:25:45+05:30 IST