బాబోయ్‌.. బ్రీత్‌ ఎనలైజర్లు

ABN , First Publish Date - 2020-07-06T09:41:46+05:30 IST

ఆర్టీసీలో మళ్లీ బ్రీత్‌ ఎనలైజర్ల వివాదం రాజుకుంది. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఉద్యోగులకు నిలిపివేసిన బ్రీత్‌ ఎనలైజర్.

బాబోయ్‌.. బ్రీత్‌ ఎనలైజర్లు

బెంబేలెత్తిపోతున్న ఆర్టీసీ ఉద్యోగులు


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఆర్టీసీలో మళ్లీ బ్రీత్‌ ఎనలైజర్ల వివాదం రాజుకుంది. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఉద్యోగులకు నిలిపివేసిన బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలను పునరుద్ధరించడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనివల్ల కరోనా వ్యాపిస్తుందని, కేసులు అధికంగా ఉన్న తరుణంలో సురక్షిత పరిస్థితి వచ్చే వరకు బ్రీత్‌ ఎనలైజర్లను ఉపయోగించొద్దని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే, బ్రీత్‌ ఎనలైజర్ల పరీక్షలు చేయకపోవటం వల్ల సిబ్బందిలో నిర్లక్ష్యం పెరిగిందని, మద్యం సేవించి విధులకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అనుమానం వచ్చి పరీక్షలు చేస్తే వందమందికి పైగా డ్రైవర్లు మద్యం సేవించారని చెబుతున్నారు.


బ్రీత్‌ ఎనలైజర్‌ పరికరం ద్వారా కరోనా వ్యాప్తిచెందే అవకాశం  లేదని శాస్ర్తీయంగా నిరూపిస్తే తమకు అభ్యంతరం లేదని, ప్రాణాలను పణంగా పెట్టి కరోనాను కొని తెచ్చుకోలేమని డ్రైవర్లు వాపోతున్నారు. అయితే, బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా పరీక్షలు చేస్తే కరోనా రాదని ఆర్టీసీ అధికారులు నిరూపించలేకపోయారు. దీనిపై వైద్య నిపుణులు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. బ్రీత్‌ ఎనలైజర్లు ఉపయోగించకుండా డ్రైవర్లను నిశితంగా పరిశీలించాలని, అనుమానం వస్తే అలాంటి వారిని పక్కన పెట్టాలని ఉద్యోగులు  కోరుతున్నారు. కరోనాపై ఉద్యోగులు ఎంతో భయపడుతున్నా ఆర్టీసీ యాజమాన్యం నుంచి కనీస జాగ్రత్త చర్యలు కూడా ఉండటం లేదంటున్నారు. సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదని వాపోతున్నారు.

Updated Date - 2020-07-06T09:41:46+05:30 IST