మిత్రుల చేతుల్లోనే తుదిశ్వాస!

ABN , First Publish Date - 2022-06-15T05:26:44+05:30 IST

మిత్రుల చేతుల్లోనే తుదిశ్వాస!

మిత్రుల చేతుల్లోనే తుదిశ్వాస!
ఖమ్మం రైల్వేస్టేషన్‌ నుంచి రిక్షాపై మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం,

పోస్టుమార్టం కోసం రిక్షాపై తరలింపు

ఖమ్మంలో ఉత్తరప్రదేశ్‌ వాసుల అవస్థలు

ఖమ్మం కలెక్టరేట్‌, జూన 14:పొట్టకూటికోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చిన ఆ ఐదుగురు స్నేహితులు కలిసే పనిచేసుకున్నారు. సీజన్‌ ముగియడంతో తిరిగి స్వగ్రామం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ లోపు వారిలో ఒకరు రోడ్డు ప్రమాదానికి గురవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. అతడిని బతికించుకునేందుకు మిగిలిన వారు ఎంతో ప్రయత్నించారు. కానీ విధి వక్రించింది.. తమతో వచ్చిన మిత్రుడు తుదిశ్వాసవివడంతో కనీసం అతడి మృతదేహాన్నైనా వారి కుటుంబీకులకు అప్పగించాలన్న ఆత్రుత  చూపరులను కంటతడిపెట్టించింది... 


ఘటన వివరాలివీ.. 

ఉత్తరప్రదేశ రాష్ట్రం కన్నోజ్‌ జిల్లా ధాన్యపూర్‌కు చెందిన గౌరవ్‌కుమార్‌, ములక్‌రాజ్‌ మరో ముగ్గురు వ్యక్తులు మొత్తం ఐదుగురు కలిసి బతుకుదెరువు కోసం సూర్యాపేట జిల్లా నకిరేకల్‌కు వచ్చారు. అక్కడ పనులేవీ దొరక కపోవడంతో ఐస్‌క్రీం అమ్ముకునే పని చేశారు. సీజన పూర్తవ్వడంతో తిరిగి తమ రాష్ట్రానికి వెళ్థామని నిర్ణయించుకున్నారు. ఈ లోగా నాలుగు రోజుల క్రితం నకిరేకల్‌లో ములకరాజ్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ములక్‌రాజ్‌ నడుముకు తీవ్ర గాయమవడంతో న కిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిర్వహించారు. పరిస్థితి సహకరించక పోవడం.. డబ్బులు లేకపోవడంతో అంతంతమాత్రంగా కోలుకున్న ములక్‌రాజ్‌ను తమ రాష్ట్రానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. నకిరేకల్‌ ఆస్పత్రి వైద్యులు కూడా తీసుకెళ్లమని చెప్పడంతో  అంతా కలిసి ఆటోలో  ఖమ్మం రైల్వేస్టేషనకు చేరుకున్నారు. ఆటోలో వచ్చిన మిత్రులు ములక్‌రాజ్‌ను కిందికి దించుతుండగానే అతడు తుదిశ్వాస విడిచాడు. దీంతో రైల్వేపోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించాలని సూచించారు. కానీ మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు ఆటో వాళ్లు ముందుకు రాకపోవడంతో గత్యంతరం లేనిపరిస్థితుల్లో మండుటెండలో రిక్షాపైనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఇతర వాహనాలకు చెల్లించేంత డబ్బు తమ వద్ద లేదని, అందుకే రిక్షాలో తీసుకురావాల్సి వచ్చిందని స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ములకరాజ్‌కు పోస్టు మార్టం నిర్వహించే విషయమై రైల్వే పోలీసుల నుంచి సంబంధిత పత్రాలు అందలేదని, అవి తమకు అందితే బుధవారం ములకరాజ్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని ఖమ్మంజిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లు తెలిపారు.



Updated Date - 2022-06-15T05:26:44+05:30 IST