ఇటుక బట్టీల్లో మణుగూరు కలప

ABN , First Publish Date - 2021-06-27T18:27:26+05:30 IST

మణుగూరు డివిజన్‌లో అటవీశాఖలో అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం, ఉదాసీనత వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

ఇటుక బట్టీల్లో మణుగూరు కలప

- యథేచ్ఛగా వంటచెరుకు రవాణా

- టింబర్‌ డిపో రికార్డుల నిర్వహణలోనూ మాయాజాలం

- రూ. 40 లక్షల విలువైన కలపకు లెక్కాపత్రం లేదు 

- అటవీ శాఖలో అడ్డూఅదుపులేని అక్రమాలు


మణుగూరుటౌన్‌(భద్రాద్రి కొత్తగూడెం): మణుగూరు డివిజన్‌లో అటవీశాఖలో అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం, ఉదాసీనత వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అశ్వాపురం, గొందిగూడెం అటవీ సమీప ప్రాంతాల్లో ఇటుక వ్యాపారులు అటవీశాఖలోని కొంతమంది సిబ్బందిని మచ్చిక చేసుకుని అడవుల్లో చెట్లను నరికి వంట చెరకుగా వినియోగించు కుంటున్నారనే ఆరోపణలున్నాయి.


యథేచ్ఛగా వంట చెరకు రవాణా

సింగరేణి విస్తరణలో భాగంగా అటవీప్రాంతంలో నరికివేతను చేపట్టిన అధికారులు నేరుగా ఆ చెట్లను అశ్వాపురం మండలంలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మణుగూరులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టింబర్‌ డిపోకు చేరాల్సి ఉండగా.. నేరుగా ట్రాక్టర్ల ద్వారా ఇటుక బట్టీలకు చేరవేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిపోనకు సంబంధించిన రెండే ళ్ల రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడమే ఇం దుకు నిదర్శనంగా కనిపిస్తోంది. దీంతో పాటు వే- బిల్లుల దిద్దుబాట్లు, డిపోనకు చేరిన రశీదులు కూడా సక్రమంగా లేవు. నిబంధనల ప్రకారం వ్యాపారులకు విక్రయించి జారీ చేసిన వే బిల్లులను వినియోగించి ఒక్కో వే-బిల్లుపై సు మారు ఐదు నుంచి పది ట్రాక్టర్‌ల వంట చెరుకును బట్టీలకు తరలించారన్న విమర్శలున్నాయి. 


అధికారుల పాత్రపై ఆరోపణలు..

ఇటుకబట్టీలకు రెండేళ్లుగా వంటచెరుకు రవాణా అవుతున్నట్టు ఆరోపణలున్నా ఇప్పటివరకు అధి కారులు పట్టించుకోకపోవడం గమనార్హం. తాత్కాలిక టింబర్‌ డిపో ను సుమారు రెండేళ్ల క్రితం ప్రారంభించగా.. నాటి నుంచి నేటి వరకు డిపో సంబంధించిన రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం విశేషం. అటవీశాఖ విజిలెన్స్‌ విభాగానికి అందిన సమాచారం మేరకు స్క్వాడ్‌ విభాగం అధికారులు ఈ అంతర్గత వ్యవహారంపై తనిఖీలు, విచారణ చేపట్టారు. తనిఖీల్లో ప్రాథమికంగా దాదాపు రూ.40 లక్షలకు పైగా విలువ చేసే సుమారు మూడువేల క్యూబిక్‌ మీటర్ల కలపకు సంబంధించిన రికా ర్డులు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ క్రమంలో డిపోనకు సంబంధించిన రికార్డులను స్క్వాడ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులను బాధ్యులను చేస్తూ సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.  


విచారణ పూర్తయిన తర్వాతే: ఎఫ్‌ఆర్‌వో ద్వాలియా

తాత్కాలిక డిపో రికార్డులు సక్రమంగా లేవన్న అభియోగంతోనే స్క్వాడ్‌ సిబ్బంది రికార్డులు సీజ్‌ చేశారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతనే జరిగిన నష్టం.. ఎవరి పాత్ర ఏ మేరకు ఉంటుందో చెప్పగలం. 

Updated Date - 2021-06-27T18:27:26+05:30 IST