Helicopter: అమ్మ చెప్పిందని.. ఈ పెళ్లి కొడుకు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-07-23T20:48:04+05:30 IST

ఓ యువతికి నిజ జీవితంలో మాత్రం కాస్త అటు ఇటుగా ఇలాంటి ఘటనే ఎదురైంది. ఆమెను చేసుకున్నోడు హెలికాఫ్టర్‌లో మెట్టినింటికి తీసుకెళ్లాడు. హర్యానాలోని పానిపట్‌లో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

Helicopter: అమ్మ చెప్పిందని.. ఈ పెళ్లి కొడుకు ఏం చేశాడంటే..

హర్యానా: ‘‘చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని.. నమ్మడానికి ఎంత బాగుందో .. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని.. నమ్మడానికి ఎంత బాగుందో ... నాకోసం రెక్కల గుర్రం ఎక్కివస్తావని.. పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని’’ అంటూ ఓ హీరోయిన్ తన కలల రాకుమారుడి గురించి పాట పాడుతుంది. ఈ పాట సంగతి ఎలా ఉన్నా.. ఓ యువతికి నిజ జీవితంలో మాత్రం కాస్త అటు ఇటుగా ఇలాంటి ఘటనే ఎదురైంది. ఆమెను చేసుకున్నోడు హెలికాఫ్టర్‌లో తమ ఇంటికి తీసుకెళ్లాడు. హర్యానాలోని పానిపట్‌లో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. 



స్థానికంగా నివాసం ఉండే మాజీ కౌన్సిలర్ రామ్ కుమార్ సైనీకి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కట్నం తీసుకోకుండా పెళ్లిళ్లు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కుమారులకు పెళ్లి చేసిన ఆయన.. తాజాగా తన మూడో కుమారుడు మునీశ్ కుమార్‌ వివాహాన్ని కూడా అలాగే జరిపించారు. నర్వానాకు చెందిన మోనికా సైనీతో మునీశ్‌కు వివాహం జరిగింది. ఇదంతా ఒకెత్తైతే... ఆమెను తమ ఇంటికి తీసుకు రావడం మరో ఎత్తు. రెక్కల గుర్రంపై వచ్చినట్టు.. హెలికాఫ్టర్‌లో పెళ్లి కూతురింటికి వెళ్లి.. ఆమెను తమ ఇంటికి మునీశ్ తీసుకొచ్చుకున్నాడు. అయితే దీని వెనక మునీశ్ తల్లి ఉన్నారు. ఆమె కోరిక మేరకే హెలికాఫ్టర్ ఏర్పాటు చేశాడు మునీశ్. ఆడపిల్లల విలువను చాటి చెప్పేందుకు మునీశ్ తల్లి ఈ విధంగా చేయించారు. మునీశ్ తన తల్లి పట్ల కనబర్చిన గౌరవానికి ఊరు ఊరంతా అభినందిస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తోంది. 

Updated Date - 2021-07-23T20:48:04+05:30 IST