పెళ్లి మండపానికి వరుడు రాలేదని, ఇంటి ముందు Bride ధర్నా

ABN , First Publish Date - 2021-11-23T16:17:39+05:30 IST

పెళ్లి ముహూర్త సమయానికి వరుడు పెళ్లి మండపానికి రాకపోవడంతో వధువు పెళ్లి దుస్తుల్లోనే వరుడి ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసిన అరుదైన ఘటన...

పెళ్లి మండపానికి వరుడు రాలేదని, ఇంటి ముందు Bride ధర్నా

భువనేశ్వర్ (ఒడిశా): పెళ్లి ముహూర్త సమయానికి వరుడు పెళ్లి మండపానికి రాకపోవడంతో వధువు పెళ్లి దుస్తుల్లోనే వరుడి ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసిన అరుదైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ పట్టణంలో జరిగింది. బెర్హంపూర్ పట్టణానికి చెందిన వధువు డింపుల్ డాష్, అదే పట్టణానికి చెందిన వరుడు సుమీత్ సాహులు కొంతకాలం క్రితం వివాహ రిజిస్ట్రార్ కార్యాలయంలో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. సోమవారం పరిమిత అతిథుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వధువు డింపుల్ వివాహ దుస్తులు ధరించి వివాహ వేదిక వద్దకు వచ్చింది. కాని వరుడి జాడ లేదు. వధువుతోపాటు ఆమె కుటుంబసభ్యులు గంటల తరబడి వివాహ వేదిక వద్ద వేచి చూసినా వరుడు రాలేదు. 


దీంతో వరుడికి పోన్ చేసినా, మెసేజులు పంపినా స్పందించలేదు. దీంతో వధువు డింపుల్ మండపం వద్ద వేచి ఉండకుండా అత్తమామల ఇంటికి వెళ్లి ధర్నా చేశారు.‘‘ మేం 2020 సెప్టెంబరు 7వతేదీన రిజిస్టర్ పెళ్లి  చేసుకున్నాం. మొదటి రోజు నుంచి నా అత్తమామలు నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు, ఒక్కసారి కూడా నన్ను పై అంతస్తులోని గదిలో బంధించారు. అంతకుముందు నా భర్త నాకు మద్దతుగా నిలిచాడు. కానీ రోజులు గడిచేకొద్దీ, నా భర్త అతని కుటుంబం వైపు మొగ్గు చూపాడు, దాని తర్వాత మేం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. 


ఆ తర్వాత మా మామగారు మా ఇంటికి వచ్చి,జరిగిన ఘటనలను మర్చిపోయి హిందూ ఆచారాల ప్రకారం వివాహ వేడుక నిర్వహించమని అడిగారు.’’ అని వధువు డింపుల్ చెప్పారు.నవంబరు 22 వతేదీన పెళ్లికి ముహూర్తం నిర్ణయించి వరుడు రాలేదని వధువు ఆరోపించారు. తన కుమార్తె డింపుల్ ను లైంగికంగా వేధించిన వరుడు పెళ్లి సమయానికి రాలేదని వధువు తల్లి చెప్పారు. ధర్నా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఈ జంటపై మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని బెర్హంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పినాక్ తెలిపారు.

Updated Date - 2021-11-23T16:17:39+05:30 IST