గైర్హాజరీ ఎంపీలకు క్లాస్ తీసుకున్న మోదీ

ABN , First Publish Date - 2021-12-07T17:13:09+05:30 IST

పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరవుతున్న బీజేపీ ఎంపీలను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మందలించారు. ఎంపీల బాధ్యతలను గుర్తు చేస్తూ..

గైర్హాజరీ ఎంపీలకు క్లాస్ తీసుకున్న మోదీ

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరవుతున్న బీజేపీ ఎంపీలను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మందలించారు. ఎంపీల  బాధ్యతలను గుర్తు చేస్తూ, సభాకార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. పార్లమెంటుకు సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో మంగళవారం ఉదయం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ''మారండి, లేదా మార్పు అనివార్యమవుతుంది'' అంటూ పరోక్షంగా గైర్హాజరీ ఎంపీలకు హెచ్చరిక చేశారు. అయితే, ఎంపీల పేర్లను మాత్రం ఆయన నేరుగా ప్రస్తావించలేదు.


ప్రజలకు చేరువ కావాలని, తమ తమ నియోజవర్గాల్లో ఈవెంట్లు నిర్వహించాలని, పద్మ అవార్డు గ్రహీతలను గౌరవించాలని ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీలకు ప్రధాని చేసిన సూచనలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలియజేస్తూ, పార్లమెంట్ స్పోర్ట్ కాంపటీషన్, హెల్తీ చిల్ట్రన్ కాంపటీషన్, సూర్యనమస్కార్ కాంపటీషన్ వంటివి నిర్వహించాలని ప్రధాని పిలుపునిచ్చారని, పద్మ అవార్డు గ్రహీతలతో లైవ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని సూచించారని చెప్పారు. నవంబర్ 15వ తేదీ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించినందుకు గాను ఈ సమావేశంలో ప్రధానికి ఎంపీలు అభినందనలు తెలియజేసినట్టు చెప్పారు.

Updated Date - 2021-12-07T17:13:09+05:30 IST