బ్రిటన్ ఎంపీ David Amess దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపిన దుండగుడు!
ABN , First Publish Date - 2021-10-16T17:24:50+05:30 IST
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమెస్‌పై శుక్రవారం కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
లండన్: బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమెస్‌పై శుక్రవారం కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తూర్పు ఇంగ్లాండ్‌లోని ఓ చర్చ్‌లో నియోజకవర్గం ప్రజలతో అమెస్ భేటీ అయిన సమయంలోనే ఆయనపై ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగులు అమెస్‌ను పలుమార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి ఎయిర్ అంబులెన్స్‌ను పంపించారు. హూటాహూటిన అమెస్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన శరీరంపై అనేక కత్తిపోట్లు ఉండటం, అప్పటికే చాలా రక్తం పోవడంతో చనిపోయారు. ఈ ఘటనలో పాతికేళ్ల ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, అమీస్ హత్యను బ్రిటన్ పోలీసులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. 69 ఏళ్ల అమెస్ 1983 నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఎసెక్స్‌లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి అమీస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత అయిన డేవిడ్ అమీస్ ఇలా దారుణ హత్యకు గురికావడం బ్రిటన్ నేతలను షాక్‌కు గురి చేసింది. ఆయన మృతిపై బ్రిటన్ రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక 2016 జూన్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. లేబర్ పార్టీకి చెందిన జో కాక్స్ అనే నేతను ఉత్తర ఇంగ్లాండ్‌లోని ఆయన సొంత నియోజకవర్గంలో జరిగిన కత్తిదాడిలోనే చనిపోయారు. బ్రిటన్ చట్టసభ్యులకు పార్లమెంట్లో పూర్తిస్థాయి రక్షణ ఉంటుంది. కానీ నియోజకవర్గాల్లో మాత్రం వారికి ఎటువంటి భద్రత ఉండదని సమాచారం. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అక్కడి రాజకీయ నేతలు వాపోతున్నారు.