భారత్‌ను సంప్రదిస్తున్నాం.... దిగొచ్చిన బ్రిటన్

ABN , First Publish Date - 2021-10-02T21:44:59+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్లకు గుర్తింపు విషయంలో

భారత్‌ను సంప్రదిస్తున్నాం.... దిగొచ్చిన బ్రిటన్

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్లకు గుర్తింపు విషయంలో బ్రిటన్ దిగొచ్చింది. బ్రిటన్ నుంచి భారత దేశానికి వెళ్లేవారు 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలనే ఆంక్షలపై భారత దేశంతో సంప్రదిస్తున్నామని ప్రకటించింది. భారత దేశం నుంచి వెళ్ళేవారిపై బ్రిటన్ ఆంక్షలు విధించడంతో భారత్ ప్రతిస్పందిస్తూ ఈ ఆంక్షలు విధించింది. 


దశలవారీగా ప్రపంచ దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేషన్ విధానాన్ని విస్తరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని బ్రిటిష్ హై కమిషన్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. భారత దేశంలో సంబంధిత ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి బ్రిటన్ వ్యాక్సిన్ సర్టిఫికేషన్ గుర్తింపు ఇచ్చేందుకు సాంకేతిక సహకారంపై భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 


2021 జూన్ చివరినాటికి 62,500కు పైగా స్టూడెంట్ వీసాలను జారీ చేసినట్లు తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే 30 శాతం అధికంగా ఈ వీసాలను ఇచ్చినట్లు చెప్పారు. ప్రయాణాల ప్రక్రియను సాధ్యమైనంత సులభతరం చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 


భారత దేశం ఇస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు బ్రిటన్ గుర్తింపు కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే బ్రిటన్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు గుర్తింపు ఇచ్చింది కానీ కొవిషీల్డ్‌కు గుర్తింపు ఇవ్వలేదు. ఇది వివక్షాపూరిత నిర్ణయమని, తాము కూడా దీనికి దీటైన చర్య చేపడతామని భారత్ హెచ్చరించింది. 


బ్రిటన్ నుంచి భారత దేశానికి వచ్చేవారికి అక్టోబరు 4 నుంచి క్వారంటైన్ నిబంధనలు వర్తిస్తాయని భారత ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెప్పాయి. భారతీయ ప్రయాణికులపై ఆంక్షలను బ్రిటన్ సడలిస్తే, భారత ప్రభుత్వం కూడా ఈ ఆంక్షలను సడలించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.


Updated Date - 2021-10-02T21:44:59+05:30 IST