British Airways లో ‘తెలుగు’

ABN , First Publish Date - 2022-05-22T13:29:07+05:30 IST

విదేశీ విమానయాన సంస్థలు స్థానిక భాషలకు పెద్దపీట వేస్తున్నాయి. ఇందులో భాగంగా బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ తొలిసారిగా హైదరాబాద్‌-లండన్‌ సర్వీస్‌ కోసం తెలుగు మాట్లాడే 20 మందిని క్యాబిన్‌ క్రూ సిబ్బందిగా నియమించింది.

British Airways లో ‘తెలుగు’

క్యాబిన్‌ క్రూగా తెలుగు మాట్లాడే వారి నియామకం

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మే 21 (ఆంధ్రజ్యోతి): విదేశీ విమానయాన సంస్థలు స్థానిక భాషలకు పెద్దపీట వేస్తున్నాయి. ఇందులో భాగంగా బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ తొలిసారిగా హైదరాబాద్‌-లండన్‌ సర్వీస్‌ కోసం తెలుగు మాట్లాడే 20 మందిని క్యాబిన్‌ క్రూ సిబ్బందిగా నియమించింది. వీరందరికీ పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి హైదరాబాద్‌ నుంచి లండన్‌కు శనివారం తొలి విమానం నడిపినట్లు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విమానయాన సంస్థ దేశంలోని 5 ప్రధాన నగరాల నుంచి లండన్‌ (హీత్రూ ఎయిర్‌పోర్టు)కు వారానికి 28 సర్వీసులు నడుపుతోంది. వీటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ఉన్నాయి. ఈ నగరాలకు నడిపే విమాన సర్వీసుల్లో స్థానిక భాష మాట్లాడే వారిని క్యాబిన్‌ క్రూగా నియమించాలని 2019లోనే నిర్ణయించింది. అయితే కొవిడ్‌ కారణంగా జాప్యం జరిగింది.


అంతర్జాతీయ సర్వీసులు పునఃప్రారంభంకావడంతో కొత్తగా ఎంపిక చేసిన సిబ్బందికి లండన్‌లో ఆరు వారాలు విమాన భద్రత, సేవలపై శిక్షణ ఇచ్చింది. ఇక హైదరాబాద్‌-లండన్‌ విమాన సర్వీసులన్నింటిలో తెలుగు మాట్లాడే వారు క్యాబిన్‌క్రూ సభ్యులుగా ఉంటారని బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌ కాలమ్‌ లామింగ్‌ తెలిపారు. తెలుగు క్యాబిన్‌ సిబ్బందిని నియమించుకోవడం అంటే తెలుగు భాష, సంస్కృతి, ఆచారాలను గౌరవించడమేనన్నారు. 

Updated Date - 2022-05-22T13:29:07+05:30 IST