వాకింగ్ కోసం బయటకు వెళ్తున్నానని చెప్పి విమానం ఎక్కేశాడు.. నేరుగా ఉక్రెయిన్ వెళ్లి..

ABN , First Publish Date - 2022-03-05T20:57:57+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వాకింగ్ కోసం బయటకు వెళ్తున్నానని చెప్పి విమానం ఎక్కేశాడు.. నేరుగా ఉక్రెయిన్ వెళ్లి..

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో విధ్వంసం తారస్థాయికి చేరిన తరుణంలో ప్రపంచ పౌరులు ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా ఉక్రెయిన్ పౌరులపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రష్యాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే బ్రిటన్‌కు చెందిన ఓ మాజీ సైనికుడు సోషల్ మీడియా పోస్ట్‌లతో సరిపెట్టదలచుకోలేదు. ఒకడుగు ముందుకేసి నేరుగా ఉక్రెయిన్‌కు వెళ్లి రష్యా సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధంలో దిగాడు. 


అతను బ్రిటీష్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన సైనికుడు. ప్రస్తుతం భార్యతో కలిసి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దాడి అతడి మనసును కలిచివేసింది. ఉక్రెయిన్ పౌరులకు, సైన్యానికి అండగా నిలవాలనుకున్నాడు. వాకింగ్‌కు వెళ్తున్నానని భార్యకు చెప్పి నేరుగా విమానాశ్రయానికి వెళ్లి పోలాండ్‌ విమానం ఎక్కేశాడు. ఆ దేశంలోని మెడికా గ్రామం గుండా సరిహద్దు దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాడు. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంటున్నాడు. 


తాజాగా అతను ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. `నేను బ్రిటీష్ మాజీ సైనికుడిని. చాలా కాలం పాటు సైన్యంలో పనిచేశా. ఈ కష్ట సమయంలో ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేయాలనుకున్నా. నా జీవితంలో నేను చేసిన అప్పులన్నీ తీర్చేశా. అన్ని విధులనూ నెరవేర్చా. అన్నింటినీ నాశనం చేయాలనుకుంటున్న కొత్త యుగం హిట్లర్‌ను ఎదుర్కొంటా. నేను ఇక్కడకు వచ్చిన విషయం తెలుసుకుని నా భార్య చాలా ఆగ్రహానికి గురై ఉంటుంది. ఒకవేళ ఇంటికి తిరిగి వెళ్లలేకపోతే బాధపడతాన`ని అతను చెప్పాడు. 


Updated Date - 2022-03-05T20:57:57+05:30 IST