భారతీయ రెస్టారెంట్‌పై బ్రిటన్ పౌరుడి ఆగ్రహం.. సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు..!

ABN , First Publish Date - 2021-12-28T01:22:50+05:30 IST

బ్రిటన్‌లో ఓ భారతీయ రెస్టారెంట్‌పై స్థానికుడు ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పిల్లల క్రిస్మస్ వేడుకులు నాశనమైపోయాయంటూ ఆ రెస్టారెంట్‌పై నెగెటివ్ రివ్యూ రాసుకొచ్చాడు. అయితే..

భారతీయ రెస్టారెంట్‌పై  బ్రిటన్ పౌరుడి ఆగ్రహం.. సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు..!

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లో ఓ భారతీయ రెస్టారెంట్‌పై స్థానికుడు ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పిల్లల క్రిస్మస్ వేడుకులు నాశనమైపోయాయంటూ ఆ రెస్టారెంట్‌పై నెగెటివ్ రివ్యూ రాసుకొచ్చారు. అయితే.. అన్ని విషయాలు ముందుగానే చెప్పామని, వాటికి అంగీకరించాక ఇప్పుడిలా అనడం సబబు కాదని రెస్టారెంట్ యజమాని వాపోయారు. గ్రేటర్ మాంచెస్టర్‌లోని రుపోషీ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..


బ్రిటన్ పౌరుడు రిక్ ఆర్పీనో కథనం ప్రకారం.. అతడు క్రిస్మస్ రోజు సాయంత్రం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆ రెస్టారెంట్‌కు వెళ్లాడు. పిల్లల కోసం ఓ క్రిస్మస్ డిన్నర్ ఆర్డరివ్వడంతో పాటూ తనకు, తన భార్యకు భారతీయ వంటకాలు ఇవ్వాలని చెప్పాడు. అయితే.. రెస్టారెంట్ వారు తన పిల్లలకు క్రిస్మస్ డిన్నర్ బదులు.. ఆలుగడ్డ చిప్స్, ఫ్రైడ్ టమాటో, చికెన్ ఇచ్చారని అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. తన పిల్లల వేడుకలను రెస్టారెంట్ నాశనం చేసిందంటూ ఫేస్‌బుక్‌, ట్రిప్‌అడ్వైసర్ వెబ్‌సైట్‌లో నెగెటివ్ రివ్యూలు రాసుకొచ్చాడు. 


అయితే.. రెస్టారెంట్ మేనేజర్ షా మునిమ్ మాత్రం అతడి వ్యాఖ్యలను ఖండించారు. కస్టమర్లు ఈ మధ్య క్రిస్మస్ డిన్నర్ పట్ల అంతగా ఆసక్తి కనబరచకపోవడంతో తాము వీటిని వండటం నిలిపివేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. గతంలో తాము ఓరోజు ముందే కస్టమర్లకు ఫోన్ చేసి ఆర్డర్లు తీసుకునేవారమని తెలిపారు. తమ మెనూ గురించి రిక్‌కు వివరించామని, వారే చికెన్, చిప్స్‌ను ఎంచుకున్నారని స్పష్టం చేశాడు. ఇటీవల కాలంలో ఇలా అకారణంగా నెగెటివ్ రివ్వూలు రాసేవారి సంఖ్య పెరుగుతోందని, ఈ విషయంలో ట్రిప్ అడ్వైసర్ వారికి తాము పలు మార్లు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ‘‘రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయాక వారు సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూలు పెడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు’’ అని వాపోయారు. 


కాగా.. క్రిస్మస్ రోజును రుపోషి రెస్టారెంట్‌కు దాదాపు 80 మంది కస్టమర్లు రాగా వారిలో ఒకరు అక్కడి ఆతిథ్యం బాగుందంటూ ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు. ‘‘క్రిస్మస్ రోజును పురస్కరించుకుని మేము ఆరుగురం ఇక్కడకు వచ్చాము. రెస్టారెంట్ వారి సర్వీసు, వంటకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు థ్యాంక్యూ’’ అంటూ వారిలో ఒకరు రివ్యూ రాసారు. కాగా.. షా మునిమ్ గత 11 ఏళ్ల బ్రిటన్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. కరోనా సంక్షోభం తరువాత తమ రెస్టారెంట్‌కు కస్టమర్ల తాకిడి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-28T01:22:50+05:30 IST