నా తండ్రిని జైలులో పెట్టాలి : బ్రిట్నీ స్పియర్స్

ABN , First Publish Date - 2021-06-24T19:56:38+05:30 IST

పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ తన తండ్రి అరాచకాలపై మౌనం

నా తండ్రిని జైలులో పెట్టాలి : బ్రిట్నీ స్పియర్స్

న్యూఢిల్లీ : పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ తన తండ్రి అరాచకాలపై మౌనం వీడారు. తన తండ్రి నేతృత్వంలోని సంరక్షకత్వం (కన్జర్వేటర్‌షిప్) తనను బానిసగా మార్చిందని, తన ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదమూడేళ్ళపాటు తాను అనేక బాధలు అనుభవించానని, ఇక తనకు తన జీవితం తిరిగి కావాలని చెప్పారు. ఆమె బుధవారం లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టు జడ్జి బ్రెండా పెన్నీకి ఈ వివరాలు తెలిపారు. ఈ కన్జర్వేటర్‌షిప్ ఇక అంతం కావాలని జడ్జిని కోరారు. తన తండ్రిని జైలులో పెట్టాలన్నారు.


ఓపెన్ కోర్టుకు తొలిసారి ఈ కేసులో తన భావాలను బ్రిట్నీ స్పియర్స్ (39) బుధవారం తెలిపారు. కన్జర్వేటర్‌షిప్‌ను కంట్రోల్ చేస్తున్న తన తండ్రి, తదితరులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పిల్లలు పుట్టకుండా గర్భ నిరోధక సాధనాలను వాడే విధంగా తనను కన్జర్వేటర్లు నిర్బంధించారని తెలిపారు. తనకు ఇష్టం లేకపోయినా ఇతర మందులను వాడేలా చేశారన్నారు. ఈ కన్జర్వేటర్‌షిప్ తనకు మంచి కన్నా చెడు ఎక్కువగా చేస్తోందన్నారు. ఓ జీవితాన్ని పొందే హక్కు తనకు ఉందని చెప్పారు. బ్రిట్నీని జడ్జి బ్రెండా పెన్నీ అభినందించారు. ఇప్పటికైనా ధైర్యంగా ముందుకొచ్చి, తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినందుకు మెచ్చుకున్నారు. 


బాయ్‌ఫ్రెండ్ కారులో తిరగాలి...

తాను తన బాయ్‌ఫ్రెండ్ శామ్ అస్ఘరిని పెళ్లి చేసుకుందామనుకున్నానని, ఆయన ద్వారా ఓ బిడ్డకు తల్లిని కావాలనుకున్నానని చెప్పారు. అయితే కన్జర్వేటర్లు తనను అస్ఘరితో కలిసి బైక్‌పై వెళ్ళడానికి సైతం అనుమతించలేదని తెలిపారు. తన సొమ్ముకు తానే యజమానురాలిగా ఉండాలని, ఈ కన్జర్వేటర్‌షిప్ అంతం కావాలని, అస్ఘరి తన కారులో తనను తిప్పగలగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కన్జర్వేటర్‌షిప్ అత్యంత దారుణమైనదని తాను నిజాయితీగా నమ్ముతున్నట్లు తెలిపారు. తన జీవితం తనకు తిరిగి రావాలన్నారు. 


నా ఆవేదన అందరికీ తెలియాలి...

ఆమె కో-కన్జర్వేటర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఈ స్టేట్‌మెంట్‌ను రహస్యంగా ఉంచాలని కోరారు. దీనిపై బ్రిట్నీ స్పియర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితాన్ని దోచుకోవడానికి వాళ్ళు చాలా చేస్తున్నారని, తన మాటలను బహిరంగంగా విచారించాలని, తన మనోభావాలు అందరికీ తెలియాలని అన్నారు. 2019లో  తనకు లిథియంను బలవంతంగా ఇచ్చారని, ఫలితంగా తాను తాగిన మైకంలో ఉన్నట్లు ఉండేదాన్నని చెప్పారు. తాను కొన్ని మానసిక పరీక్షల్లో విఫలమవడంతో తన తండ్రి తనను మానసిక చికిత్సాలయానికి బలవంతంగా పంపించారన్నారు. తాను ఫోన్‌లో గంటపాటు ఏడిచానని, తను ఏడుపును తన తండ్రి ప్రతి క్షణం ఆనందించారని చెప్పారు. ఆయన తన సొంత కూతురిని బాధించేందుకు తనకుగల నియంత్రణాధికారాన్ని ఒక లక్ష శాతం ప్రేమించారని చెప్పారు. 


బట్టలు మార్చుకోనివ్వనంత నిఘా

2019లో లాస్ వేగాస్ రెసిడెన్సీ షో చేయడానికి నిర్బంధించారని, అది రద్దయినట్ల తెలియడంతో తన తలపై నుంచి పెద్ద బరువు దించినట్లయిందని చెప్పారు. అప్పటి నుంచి తాను ప్రదర్శనలు ఇవ్వలేదని, తన కార్యక్రమాలను రికార్డ్ చేయలేదని అన్నారు. చాలా మంది నర్సులు తనపై నిరంతరం నిఘా పెట్టేవారన్నారు. తన ప్రతి కదలికను గమనించేవారని, కనీసం గోప్యంగా బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదన్నారు. 


సంతోషంగా ఉన్నట్లు చెప్పడం అబద్ధం

తాను సుదీర్ఘ కాలం (సుమారు 13 సంవత్సరాలపాటు) బహిరంగంగా మౌనం పాటించడం వల్ల తాను పరిస్థితులను అంగీకరిస్తున్నట్లుగా అందరూ భావిస్తున్నారన్నారు. తాను సంతోషంగా ఉన్నట్లు ప్రపంచానికి అబద్ధం చెప్పానన్నారు. తాను దిగ్భ్రాంతిలో ఉన్నానని, అత్యంత బాధలో ఉన్నానని చెప్పారు. 


బ్రిట్నీ తండ్రి ఆవేదనలో ఉన్నారు

బ్రిట్నీ స్పియర్స్ తండ్రి జేమ్స్ స్పియర్స్ తరపు న్యాయవాది వివియన్ థొరీన్ మాట్లాడుతూ, బ్రిట్నీ తండ్రి జేమ్స్ తన కుమార్తె బాధపడుతున్నందుకు తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. జేమ్స్ తన కుమార్తెను చాలా ప్రేమిస్తున్నారన్నారు. ఆమెను మిస్ అవుతున్నారన్నారు. 


జేమ్స్ స్పియర్స్ ప్రస్తుతం బ్రిట్నీ స్పియర్స్ సంపదకు కో-కన్జర్వేటర్‌గా ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితం, ఆర్థిక వ్యవహారాలపై కూడా ఈ కన్జర్వేటర్లకు నియంత్రణ ఉంటుంది. 


కోర్టు బయట ఫ్యాన్స్ ప్రదర్శన

విచారణ జరుగుతున్న సమయంలో బ్రిట్నీ స్పియర్స్ ఫ్యాన్స్ దాదాపు 100 మంది కోర్టు బయట ప్రదర్శన చేశారు. బ్రిట్నీని స్వేచ్ఛగా వదిలిపెట్టాలని, ఆమె జీవితం నుంచి ఇతరులు బయటికెళ్ళాలనే నినాదాలతో వారంతా ప్లకార్డులు ధరించారు. 


సమర్థతను బ్రిట్నీయే రుజువు చేసుకోవాలి

తన సంపదకు సంబంధించిన వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాలను నిర్వహించుకోగల శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయో, లేదో మదింపు చేయవలసిన అవసరం లేకుండానే కన్జర్వేటర్‌షిప్‌ను రద్దు చేయవచ్చునని తనకు తెలిసిందని బ్రిట్నీ స్పియర్స్ చెప్పారు. అయితే కాలిఫోర్నియా చట్టం ప్రకారం, ఆమె శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోవలసిన బాధ్యత పూర్తిగా ఆమెపైనే ఉంటుంది. కాబట్టి ఆమె కోరుకున్నట్లుగా తన తండ్రి, తదితరుల కన్జర్వేటర్‌షిప్ నుంచి ఆమె బయటపడాలంటే, అంతకన్నా ముందు ఆమె నిశిత దర్యాప్తు, మదింపు పరీక్షలకు గురికాక తప్పదు. 


2008లో బ్రిట్నీ స్పియర్స్ మానసికంగా దెబ్బతినడంతో ఆమె ఆస్తులు, వ్యక్తిగత వ్యవహారాలను చూసేందుకు కన్జర్వేటర్‌షిప్‌ను ఏర్పాటు చేశారు. కోర్టు రికార్డు ప్రకారం ఆమెకు సుమారు 50 మిలియన్ డాలర్ల సంపద ఉంది. 


మాజీ బాయ్‌ఫ్రెండ్ ఆవేదన

ఇదిలావుండగా, బ్రిట్నీ స్పియర్స్ మాజీ బాయ్‌ఫ్రెండ్ జస్టిన్ టింబర్లేక్ స్పందిస్తూ, ఆమెకు జరుగుతున్నది సరైనది కాదన్నారు. తనకు సంబంధించిన నిర్ణయాలను తాను తీసుకోకుండా ఏ మహిళనూ నిరోధించకూడదన్నారు. 


Updated Date - 2021-06-24T19:56:38+05:30 IST