అమెరికన్ల నోట అన్నమయ్య పాట!

ABN , First Publish Date - 2021-12-08T05:30:00+05:30 IST

తెలుగు, సంస్కృతం, సాహిత్యం, సంగీతం, వేదాలు ఆమె పంచప్రాణాలైతే... పరిశోధన ఆరో ప్రాణం.అందుకే.....

అమెరికన్ల నోట అన్నమయ్య పాట!

తెలుగు, సంస్కృతం, సాహిత్యం, సంగీతం, వేదాలు ఆమె పంచప్రాణాలైతే... పరిశోధన ఆరో ప్రాణం.అందుకే... డెబ్భై నాలుగేళ్ళ వయసులో... నాలుగో పిహెచ్‌డికి ఆమె సిద్ధమవుతున్నారు.అన్నమయ్య సంకీర్తనల్లోని పదసౌందర్యాన్ని, సమసమాజ భావనలను అమెరికన్లకు పరిచయం చేస్తున్న డాక్టర్‌ శొంఠి శారదాపూర్ణ ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.


‘‘1975లో మొదటిసారి 

అమెరికాలో అడుగుపెట్టాక ‘స్వేచ్ఛ’ అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఆంగ్ల భాష ప్రపంచాన్ని ఎలా ఏలుతోందో అక్కడ కళ్లారా చూశాను. ఈ నలభై ఐదేళ్లలో నా వేషభాషలు, ఆచార వ్యవహారాల్లో ఎలాంటి మార్పు రాలేదు కానీ, నా ఆలోచనలు మాత్రం కొద్దిగా మారాయి. తొలినాళ్లలోనే చికాగోలోని ‘డీపౌల్‌ యూనివర్సిటీ’లో ఛైల్డ్‌ సైకాలజీ కోర్సు పూర్తిచేశాను. మాంటిస్సోరీ పద్ధతిలో ఏడేళ్లు ఒక స్కూలు కూడా నడిపాను. నాకు తెలుగు, సంస్కృత భాషలపట్ల అమితమైన అభిమానం. ఆ ఇష్టంతోనే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి తెలుగులో ‘అన్నమాచార్య నృత్య, సంగీత కళాభిజ్ఞత’, సంస్కృతంలో ‘సంగీతం జన్మస్థానం, పరిణామక్రమం- కొన్ని భారతీయ సంప్రదాయ సంగీత పద్ధతులు, ఉద్దేశాలు’ అనే అంశాల్లో పీహెచ్‌డీలు చేశాను. నా రెండు పీహెచ్‌డీలకు ఉత్తమ పరిశోధనా గ్రంథాలుగా గుర్తింపు లభించింది. స్వర్ణపతకం కూడా అందుకున్నాను. ఉత్కళ్‌ యూనివర్సిటీ నుంచి సంగీత శాస్త్రంపై డి-లిట్‌ చేశాను. ‘అక్షరపదీయం’ అనే అంశం మీద నా నాలుగో పీహెచ్‌డీ పరిశోధన మరికొద్ది రోజుల్లో మొదలవుతుంది. 


అన్నమయ్య సేవలో....

భవిష్యత్‌ స్వరూపాన్ని ముందే ఊహించి రాసిన మహనీయుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. ఆయన కీర్తనల్లో సామాజిక సమానత్వం, మహిళాభ్యుయం... ఒక్కటేమిటి... నేటి సమాజానికి అవసరమైన భావాలన్నీ వాటిల్లో తొణికిసలాడుతాయి. పాతికేళ్ల కిందట చికాగోలో ‘శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ఇన్‌ నార్త్‌ అమెరికా’ (సప్నా) సంస్థను నెలకొల్పాం. పదకవితా పితామహుడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించాం. సుమారు 5,000 మంది విదేశీయులకు అన్నమయ్య సంకీర్తనలమీద శిక్షణ ఇప్పించాం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి లాంటి సంగీత విద్వాంసుల ద్వారా అమెరికాలోని నలభై రాష్ట్రాల్లో... ఒక్కో ఏడాదిలో నాలుగేసి నెలలపాటు శిక్షణ తరగతులు నిర్వహించాం. శ్రీపాద పినాకపాణితో 228, మల్లాది సోదరులతో 80 కీర్తనలకు స్వర రచన చేయించాం. ప్రముఖ కూచిపూడి నాట్యాచారులు ఉమారామారావు అరవై కీర్తనలకు నృత్యరీతులు రూపొందించారు. ఇలా ఒకటా, రెండా కొన్ని వందల సాహిత్య సదస్సులు, సమావేశాలు, శిక్షణ శిబిరాలు నిర్వహించాం. ‘‘అన్నమయ్యకు అమెరికా వీసా ఇప్పించారు శొంఠి దంపతులు’’ అని నేదునూరి గారు సభాముఖంగా మమ్మల్ని అభినందించడం మాకు దక్కిన అదృష్టం. ఇవాళ కొందరు తెల్లజాతీయులు కూడా అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తున్నారు. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకొని ప్రదర్శనలిస్తున్నారు. అదంతా మా ‘సపా’్న సంస్థ కృషి, శ్రమ ఫలితమేనని చెప్పగలను.


విదేశాల్లో వేద విద్య...

మహాపండితుడు విశ్వనాథ అచ్యుత దేవరాయలు దగ్గర పదమూడేళ్లు వేదం నేర్చుకున్నాను. అనంతరం 1996లో ‘వేద విద్యాపీఠం’ స్థాపించాను. ‘ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ వేదాంత అండ్‌ వేదిక్‌ స్టడీస్‌’ తరపున ఎనిమిది దేశాల్లో... పన్నెండు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని, పరిశోధనా పత్రాలు సమర్పించాను. నా వద్ద చాలామంది వేదం, సంస్కృతం నేర్చుకుంటున్నారు. యూరోపియన్‌ దేశాల్లోని చాలా యూనివర్సిటీల్లో సంస్కృతం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. తెలుగు, సంస్కృతం, సాహిత్యం, సంగీతం, వేదాలకు సంబంధించిన నా పరిశోధనలను, అధ్యయనాలను పదిమందికి పరిచయం చేసేందుకు మూడు భాషల్లో ‘బ్రహ్మి’ త్రైమాస పత్రికను నడుపుతున్నాను. దాదాపు పాతిక పుస్తకాలు రాశాను.


తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ...

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆరేళ్లు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గానూ పనిచేశాను. దానికి అనుబంధంగా అమెరికాలో ‘సెంటర్‌ ఫర్‌ తెలుగు స్టడీస్‌’ నెలకొల్పాం. నా వద్ద చాలామంది ప్రవాసాంధ్రులు తెలుగు నేర్చుకున్నారు. వాళ్లకు భాషతో పాటు మన చరిత్ర, సంస్కృతికి సంబంధించిన విషయాలూ బోధిస్తుంటాను. ‘ఆటా’, ‘తానా’ సంస్థల ద్వారా తెలుగు సారస్వత, సాహిత్య సభలు నిర్వహించాను. అవధానాలు చేశాను. అమెరికాలో చాలా వేగంగా వృద్ధి చెందుతున్న భాష తెలుగే. ఇంగ్లీష్‌, స్పానిష్‌ తర్వాత అమెరికాలో తెలుగు మాట్లాడేవారే అధికం. కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలల్లో తెలుగును సెకండ్‌ లాంగ్వేజ్‌గా కూడా పెట్టారు. అమెరికాలోని పదమూడు విశ్వవిద్యాలయాల్లో తెలుగు విభాగాలున్నాయి. ఇప్పుడు 66 ఎకరాల్లో సిలికాన్‌ ఆంధ్రా యూనివర్సిటీ రాబోతుంది. అమెరికా స్కూళ్లలో... క్రాస్‌ కల్చర్‌ కోర్సులో భాగంగా చాలామంది ప్రవాసులు భారతీయ కళలు, సంగీతాన్ని అభ్యసిస్తున్నారు. ఇదొక మంచి పరిణామం. 


  కె. వెంకటేశ్‌

ఫొటోలు: ఆర్‌. రాజ్‌కుమార్‌


మా ఇంటికి ఒబామా...

స్వామి వివేకానందుడు తన వాణి వినిపించినచికాగోలోని ‘వరల్డ్‌ పార్లమెంట్‌ ఆఫ్‌ రెలిజియన్స్‌’ సభా మందిరంలో... మూడు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రసంగించడం నాకు దక్కిన అరుదైన అవకాశం. అదే వేదికపై హరికథ కార్యక్రమాన్ని నిర్వహించాను కూడా. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ‘అహింసా వాదం’పై ప్రత్యేకంగా ప్రసంగించాను. మెక్సికోలో నోబెల్‌ బహుమతి గ్రహీతల సదస్సులో పాల్గొని మన వేదాల ఔన్నత్యం గురించి చర్చించాను ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలు. అలాగే... ఒకసారి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా మా ఇంటికి రావడం మరిచిపోలేని సందర్భం. ‘టాప్‌ 15 ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సీ’,  ‘లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ ఫర్‌ కల్చరల్‌, లిటరరీ సర్వీస్‌’,  ‘టాప్‌ టెన్‌ లివింగ్‌ తెలుగు లెజెండ్స్‌ ఆఫ్‌ యూఎ్‌సఏ’, ‘ఫస్ట్‌ హిందూ ఉమెన్‌ సర్వీస్‌ ఇన్‌ మినిస్ట్రీ కమిషనర్‌ ఆఫ్‌ టోని ప్రిట్వింకిల్‌’... ఇలా పలు పురస్కారాలను అమెరికాలోని వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి అందుకున్నాను.



నా కుటుంబం...

మా నాన్న సుసర్ల గోపాలశాస్త్రి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. నేతాజీ స్థాపించిన ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’లో ఆయన కొంతకాలం సభ్యుడు కూడా. మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి పెద్దలతో ప్రత్యక్ష సంబంధాలుండేవి. ఆడపిల్లలు బాగా చదువుకోవాలనేది ఆయన అభిమతం. మా నాన్న స్ఫూర్తితోనే నా 70వ ఏట కూడా చదువు కొనసాగిస్తున్నాను. నా భర్త ప్రఖ్యాత నేత్ర వైద్యుడు శ్రీరాం శొంఠి. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. ఒక గృహిణిగా అమెరికాలో అడుగుపెట్టిన నేను, నా భర్త సహకారంతోనే ఇదంతా చేయగలుగుతున్నాను. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి సిరి న్యూరాలజిస్టు. చిన్నమ్మాయి సీత రాయబార కార్యాలయంలో ఉన్నతోద్యోగి. ఇద్దరూ కలిసి శొంఠి సిస్టర్స్‌గా కొన్ని వందల కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఇచ్చారు.’’

?

Updated Date - 2021-12-08T05:30:00+05:30 IST