పాక్ సరిహద్దుల్లో డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్ఎఫ్

ABN , First Publish Date - 2021-12-18T23:20:39+05:30 IST

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఓ డ్రోన్‌ను కూల్చేసినట్లు

పాక్ సరిహద్దుల్లో డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్ఎఫ్

న్యూఢిల్లీ : భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఓ డ్రోన్‌ను కూల్చేసినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శనివారం ప్రకటించింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టర్, వాన్ సరిహద్దుల వద్ద శుక్రవారం రాత్రి 11.10 గంటలకు దీనిని కూల్చేసినట్లు తెలిపింది. ఇది చైనాలో తయారైనట్లు పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దుల నుంచి సుమారు 300 మీటర్లు, సరిహద్దు కంచె నుంచి 150 మీటర్ల దూరంలో దీనిని కూల్చినట్లు వివరించింది. 


23 కేజీల బరువుగల ఈ డ్రోన్‌కు నాలుగు పవర్ బ్యాటరీలు ఉన్నాయని, 10 కేజీల బరువును మోయగలదని తెలిపింది. అయితే దీనిలో ఆయుధాలు, మందుగుండు లేదా మాదక ద్రవ్యాలు వంటివేవీ లేవని పేర్కొంది. ఈ ప్రదేశంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. గతంలో పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, మందుగుండు తీసుకొస్తున్న రెండు డ్రోన్లను కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంఘటనలు కూడా పంజాబ్ సరిహద్దుల్లోనే జరిగాయి. 

Updated Date - 2021-12-18T23:20:39+05:30 IST