యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ముస్లింలకు మాయావతి పెద్దపీట

ABN , First Publish Date - 2022-01-23T21:35:00+05:30 IST

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనలో తలమునకలుగా ఉన్నాయి.

యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ముస్లింలకు మాయావతి పెద్దపీట

లక్నో: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనలో తలమునకలుగా ఉన్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఒక్కొక్కటిగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పెద్దగా ఆర్భాటం లేకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్న బీఎస్పీ చీఫ్ మాయావతి రెండో దశ ఎన్నికల కోసం 51 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తాజాగా ప్రకటించిన 51 మంది అభ్యర్థుల్లో 23 మంది ముస్లింలే కావడం గమనార్హం. 


బీఎస్పీ ఇప్పటి వరకు రెండు దశల ఎన్నికల కోసం 109 మంది అభ్యర్థులను ప్రకటించగా, వారిలో 39 మంది ముస్లింలు ఉన్నారు. ఫలితంగా మైనారిటీ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. అలాగే, ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో 13 మంది ఓబీసీలు ఉండగా, వారిలో అత్యధికులు జాట్‌ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. అలాగే 10 మంది దళితులు, ఉన్నత వర్గాలకు చెందిన ఐదుగురు ఉన్నారు.


తొలి దశ ఎన్నికల కోసం ప్రకటించిన జాబితాలో 16 మంది ముస్లింలకు చోటివ్వగా, రెండో దశలో ఏకంగా 23 మందిని మాయావతి బరిలోకి దించారు. 2017 ఎన్నికల్లో తొలి దశలో 18 మందిని, రెండో దశలో 25 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించారు. ఈ లెక్కన చూసుకుంటే అప్పుడు, ఇప్పుడు ముస్లింలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినట్టు అయింది.

Updated Date - 2022-01-23T21:35:00+05:30 IST