నన్ను రాష్ట్రపతిని చేయాలని అఖిలేష్ ఆరాటపడుతున్నారు : మాయావతి

ABN , First Publish Date - 2022-04-28T21:27:49+05:30 IST

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి

నన్ను రాష్ట్రపతిని చేయాలని అఖిలేష్ ఆరాటపడుతున్నారు : మాయావతి

లక్నో : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి గురువారం సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్నట్లు వదంతులను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కానీ, తనను రాష్ట్రపతిని చేయాలని కానీ కలలు కనవద్దని ఆ పార్టీకి సలహా ఇచ్చారు. 


మాయావతి గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, తనను రాష్ట్రపతిని చేయాలని సమాజ్‌వాదీ పార్టీ కలలు కంటోందని, అందుకు కారణం ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అవడానికి మార్గం సుగమమవుతుందని భావించడమేనని చెప్పారు. ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి కానీ, తనను రాష్ట్రపతిని చేయడం గురించి కానీ కలలు కనడం మానేయాలని హితవు పలికారు. 


డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బీఎస్‌పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కలలు, ఆదర్శాలను అమలు చేయడానికి తాను చిత్తశుద్ధితో కృషి చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. బలహీన వర్గాలవారిని సాధికారులను చేయడానికి, అభివృద్ధి చేయడానికి తాను పోరాడుతున్నానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా కానీ, ప్రధాన మంత్రిగా కానీ అణగారిన వర్గాలవారి సంక్షేమం కోసం కృషి చేస్తానని, రాష్ట్రపతి కాబోనని చెప్పారు. 


ముస్లింలు, ఓబీసీలను తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదని అఖిలేశ్ యాదవ్ తెలుసుకున్నారన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఆయన దేశం విడిచి, విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారన్నారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ముస్లిం, యాదవ ఓట్లను గంపగుత్తగా పొందిందని చెప్పారు. ఆ పార్టీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుందని, అయితే విఫలమైందని తెలిపారు. 


దళితులు, ముస్లింలు, ఓబీసీలు తనను ముఖ్యమంత్రిని లేదా ప్రధాన మంత్రిని చేయగలరన్నారు. వారిని ప్రత్యర్థి పార్టీలు తేలికగా తీసుకోకూడదన్నారు. వారి శ్రేయోభిలాషి బీఎస్‌పీ అనే సంగతిని తెలుసుకోవాలని చెప్పారు. వచ్చే ఎన్నికల అనంతరం బీఎస్‌పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఏకమవాలని పిలుపునిచ్చారు. ముస్లింలు రంజాన్ జరుపుకుంటున్న సమయంలో విద్యుత్తు కోతలు విధించడాన్ని తప్పుబట్టారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం  విద్యుత్తు సరఫరా అయ్యే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. 


మాయావతి గత నెలలో మాట్లాడినపుడు తమ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి కారణాలను వివరిస్తూ, ముస్లిం ఓట్లు సమాజ్‌వాదీ పార్టీకి వెళ్ళాయని చెప్పారు.  ఈ ఎన్నికల్లో బీఎస్‌పీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 403 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 



Updated Date - 2022-04-28T21:27:49+05:30 IST