బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తాం: నవాజ్‌బాషా

ABN , First Publish Date - 2021-11-29T06:17:50+05:30 IST

అధికారంలో ఉన్న తామే బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తామని, ఉద్యమాలతో ఒరిగేదేమి లేదని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు.

బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తాం: నవాజ్‌బాషా
బీటీ కళాశాలలో ఎమ్మెల్యే నవాజ్‌బాషాకు వినతి పత్రం ఇస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

మదనపల్లె టౌన్‌, నవంబరు 28: అధికారంలో ఉన్న తామే బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేస్తామని, ఉద్యమాలతో ఒరిగేదేమి లేదని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు. ఆదివారం  బీటీ కళాశాలలో ఫూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. తాము 18 రోజులుగా  దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే... బీటీ కళాశాల విషయమై ఎంపీ మిఽథున్‌, మంత్రి పెద్దిరెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. బీసీటీతో చర్చించి ప్రభుత్వపరం చేస్తామన్నారు. ఈ ప్రక్రియ ఆరు నెలలైనా, ఏడాదైనా పట్టవచ్చన్నారు. కొంతమంది నాయకులు దీక్షలకు మద్దతిచ్చినట్లు ఫొటోలు దిగి ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా వినతిపత్రం ఇచ్చిన ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు తిరిగి దీక్షా శిబిరానికి చేరుకోగా కొందరు మున్సిపల్‌ కౌన్సిలర్లు వచ్చి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కదా... దీక్ష విరమించాలని కోరారు. బీసీటీ సభ్యులు ప్రభుత్వపరం చేసేలా లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చాకే దీక్ష విరమిస్తామన్నారు. కార్యక్రమంలో బీటీ కళాశాల కరెస్పాండెంట్‌ మునిరత్నమయ్య, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జింకా వెంకటాచలపతి, ప్రిన్సిపాల్‌ వెంకటశివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నవీన్‌కుమార్‌, మాధవ్‌, జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T06:17:50+05:30 IST