వైసీపీ అసలురూపం బయట పడింది

ABN , First Publish Date - 2021-04-15T14:27:01+05:30 IST

ప్రెస్‌మీట్‌లో ఆయన నోరు విప్పితే..

వైసీపీ అసలురూపం బయట పడింది

ఇచ్చేది పావలా... లాక్కునేది ముప్పావలా

టీడీపీ నేత బుద్దా వెంకన్న


శ్రీకాళహస్తి(చిత్తూరు): ప్రెస్‌మీట్‌లో ఆయన నోరు విప్పితే తూటాల్లా దూసుకొస్తాయి మాటలు. సోషల్‌ మీడియా వేదికగా విసిరే ప్రతి పంచ్‌ క్లెమోర్‌ మైన్‌కి దీటుగా పేలుతుంది. టీడీపీ మీద కానీ, చంద్రబాబు మీద కానీ, లోకేశ్‌ మీదకానీ ఎవరు దాడి చేసినా మరు నిమిషమే గోడకు కొట్టిన బంతి వలే ప్రతి దాడి వెలువడుతుంది బుద్ధా వెంకన్న నుంచి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ మైకుల ముందు ఎప్పుడూ కనిపించే ఈయన ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గం పల్లెల్లో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో జరిపిన ఫటాఫట్‌ సంభాషణ...


ఉప ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం?

తిరుపతి ఉప ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టిన మాట వాస్తవమే. గ్రామీణ ప్రజలను జగన్‌ దోచుకుంటున్నాడు. అమ్మఒడి వంటి పథకాల పేరుతో పావలా ఇస్తున్నాడు. ముప్పావలా లాక్కుంటున్నాడు. నిత్యావసర సరుకులు, మద్యం, పెట్రోలు ఇలా అన్ని ధరలు పెరగడానికి జగనే కారణమని రెండేళ్లలోనే ప్రజలు గ్రహించారు. వారందరూ నేడు చంద్రబాబు నాయకత్వం కోరుకుంటున్నారు. వారిని మరింత చైతన్యం చేస్తున్నాం. 


ఉప ఎన్నికల్లో టీడీపీకి అనుకూలతలు ఏమిటి?

జగన్‌ రెండేళ్ల పాలనలో అరాచకాలు పెరిగి పోయాయి. దౌర్జన్యాలు, దాడులు గురించి చెప్పాల్సిన పనిలేదు. తిరుపతిలో మా నేత చంద్రబాబు సభపై కూడా రాళ్లదాడి చేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మరోవైపు ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల కథ పక్కన పెడితే... ప్రైవేటు ఉద్యోగాల్లో సైతం కోత విధిస్తున్నారు. అధికార పార్టీ తీరుపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తే టీడీపీకి అనుకూలిస్తుంది.


జగన్‌ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ ధీమాతో ఉంది కదా?

అది అధికార పార్టీ కల మాత్రమే. పథకాల పేరుతో భారం మోపుతున్నారని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఎక్కడా ఒక్క పార మట్టి కూడా తీయలేదు. మరోవైపు ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. ఈ మాఫియాలో ఉన్న వారందరూ అధికార పార్టీ వారే. సత్యవేడు నియోజకవర్గంలో పరిశీలిస్తే అధికార పార్టీ వారు ఇసుక, మట్టి ఎలా దోచుకుంటున్నారో తెలుస్తుంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో గుణపాఠం చెబుతారు.


స్థానిక ఎన్నికల్లో టీడీపీ బలహీనపడింది కదా?

ఒక్క అవకాశం పేరుతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే వైసీపీ అసలురూపం బయట పడింది. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు తగ్గడానికి కారణం ఏమిటో ప్రజలు చూశారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి ఎన్నికలు జరిగితే మాత్రం పరిస్థితి తారుమారు అవుతుంది. టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది.


తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లకు మీరేం చెప్పదలచుకున్నారు?

డబ్బు పంపిణీకి అధికారపార్టీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. లోకసభ, రాజ్యసభ కలసి వైసీపీకి 28మంది ఎంపీలు ఉన్నారు. వారు ఏనాడూ ప్రత్యేక హోదా కోసం కానీ... రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కానీ మాట్లాడలేదు. జగన్‌ కేసులు మాఫీ చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద కాళ్ళ బేరం చేస్తున్నారు. అలాంటి వారి జతకు మరో ఎంపీని పంపినా లాభం ఏమీ లేదు. అందుకే అనుభవం ఉన్న...పార్లమెంటులో ప్రశ్నించగలిగే సామర్థ్యం ఉన్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరుతున్నా. ఓటు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. నోటు ఇచ్చినవారికి ఓటు వేయద్దు అని వేడుకుంటున్నా.

Updated Date - 2021-04-15T14:27:01+05:30 IST