Advertisement

బుద్ధ నిర్వాణానికి ముందు...

Feb 26 2021 @ 00:21AM

బుద్ధుడు తనను తాను దేవుని దూతగా ప్రకటించుకోలేదు. మోక్షదాతగానూ చెప్పుకోలేదు. తాను ఒక మార్గదాతనని మాత్రమే చెప్పాడు. ఆచరణలో చూపాడు. దుఃఖసాగరంలో మునిగి తేలుతున్న మానవ సమాజానికీ, అసమానతలతో అలమటిస్తున్న ప్రజా సందోహానికీ దుఃఖ నిర్వాణ మార్గాన్ని చూపించాడు. అందువల్లనే బుద్ధుడు కాలంతోపాటు కనుమరుగు కాలేదు. ‘‘నేను చెప్పినది ఏదైనా మీ అనుభవానికి అందకపోతే గుడ్డిగా విశ్వసించకండి’’ 


అని చెప్పాడు. కాబట్టే కాలాన్ని జయించి, ఇన్ని వేల సంవత్సరాలు తన ధర్మంతో ధరణీతలాన్ని తడిపి, మానవీయ ఫలాలను పండించగలుగుతున్నాడు.


అలాంటి మనహనీయుడు సాధారణ మానవుల్లా మరణానికి భయపడతాడా! అలాంటి భయం లేదు కాబట్టే ప్రాణాలకు ప్రమాదం కలిగించే యుద్ధ క్షేత్రాల మధ్యకు వెళ్ళి నిలబడ్డాడు. యుద్ధాలను ఆపుచేయించాడు. అతి క్రూరులైన వారి దగ్గరకు ఒంటరిగానే వెళ్ళాడు. వారిలో పరివర్తన కలిగించాడు. సర్వాన్నీ త్యజించిన త్యాగి... ప్రాణం కోసం పాకులాడుతాడా!


బుద్ధుడు ముప్ఫై ఆరవ యేట జ్ఞానోదయం పొందిన తరువాత దాదాపు నలభై అయిదేళ్ళు తన ధర్మాన్ని నిర్విరామంగా ప్రచారం చేశాడు. ప్రజల నుంచి కనీ వినీ ఎరుగని ఆదరణ పొందాడు. బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. వ్యక్తులకన్నా సంఘమే చిరస్థాయిగా నిలబడుతుందని నమ్మాడు. వేలాది ఆరామాలు, విహారాలు, సంఘ శాఖలు ఏర్పడిన తరువాత... ఇక నిర్వాణ మార్గానికి మళ్ళాలని అనుకున్నాడు. 


అది బుద్ధుడి ఎనభయ్యో సంవత్సరం. ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. తన చివరి ‘చారిక’లో భాగంగా వైశాలీ నగరానికి వచ్చాడు. ఆమ్రపాలికి చెందిన ఆమ్రవనంలో కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడకు దగ్గరలో ఉన్న బేళువ అనే గ్రామంలో ఆ ఏడాది వర్షావాసాన్ని గడిపాడు. ఆ కాలంలోనే ఆయనకు ఉదర సంబంధమైన వ్యాది కలిగింది. ఔషధాలు సేవిస్తూ, ధ్యానం ద్వారా నొప్పిని భరించాడు. వ్యాధి తగ్గి, వర్షావాసం ముగిశాక తిరిగి వైశాలిలోని చాపల చైత్యానికి చేరాడు. తన ప్రధాన అనుయాయుడైన ఆనందుణ్ణి పిలిచి, ‘‘ఆనందా! తథాగతుడు పరినిర్వాణం చెందే సమయం ఆసన్నమయింది. మూడు నెలల్లో పరినిర్వాణం పొందుతాను. ఆనందా! మనకు ప్రియమైనవి దూరం అవుతాయి. విభాజ్యం చెదుతాయి. విడిపోతాయి. పుట్టిన ప్రతీదీ గిట్టుతుంది. సంస్కారాలు సర్వం అనిత్యాలే!’’ అన్నాడు మందహాసంతో. ఆనందుడు కలవరపడ్డాడు. అతని కంట నీరు గూడు కట్టింది.


ఆ రోజు మాఘ పున్నమి. బుద్ధుని కోరికపై శ్రావస్తి సమీపంలోని భిక్షువులందరినీ మహాకూటగారశాలలో ఆ పున్నమి రాత్రి సమావేశపరిచారు. బుద్ధుడు వారికి ధర్మోపదేశం చేసి, తన నిర్మాణాన్ని ప్రకటించాడు.

ఆ మరునాడు లిచ్ఛవుల రాజధాని వైశాలి నుంచి మల్లుల రాజధాని కుసీనరకు బుద్ధుడు బయలుదేరాడు. వైశాలి ఉత్తర పొలిమేర దాకా లిచ్ఛవులు వచ్చారు. వారికి తన భిక్షా పాత్రను ఆయన ఇచ్చేశాడు. జనం కన్నీరు మున్నీరవుతూ బుద్ధుణ్ణి సాగనంపారు. 


‘‘ఇదే వైశాలిని నేను చూసే చివరి చూపు’’ అని అయన వెనక్కు తిరిగి, చాలా సేపు వైశాలి వైపు చూశాడు. అనంతరం బయలుదేరి, పలు గ్రామాల మీదుగా భోగనగరం చేరి, ఆనంద చైత్యంలో కొన్నాళ్ళు ఉన్నాడు.

అక్కడ ప్రజలకు బోధ చేస్తూ, ‘‘ఎవరైనా ‘‘బుద్ధుడి నోటి నుంచి నా చెవులారా విన్నాను. తథాగతుడు చెప్పినది ఇదే!’’ అని చెబితే దాన్ని మూఢంగా నమ్మకండి. నా సూత్రాలు, నియమాలతో కలవని దేనినీ బుద్ధ వచనంగా విశ్వసించకండి’’ అని చెప్పాడు.  అక్కడే చైత్ర పౌర్ణమి సమావేశం జరిగింది. ఆ తరువాత మరిన్ని గ్రామాలు తిరుగుతూ పావానగరం చేరాడు. చుందుడు అనే అనుయాయుడు పెట్టిన ఆహారం తిన్నాక, బుద్ధుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. అక్కడే కొన్నాళ్ళు ఉండి, తిరిగి బయలుదేరి, వైశాఖ పౌర్ణమి నాటికి కుసీనరకు చేరాడు. ఆ రాత్రే బుద్ధుడి మహాపరినిర్వాణం జరిగింది.


ఇలా... బుద్ధుడు తన పరినిర్వాణ విషయాన్ని మూడు నెలలు ముందే... మాఘ పున్నమి నాడు ప్రకటించాడు. అలా ఈ పున్నమికి బౌద్ధంలో ఒక విశేష ప్రాధాన్యం ఉంది. అంతేకాదు... తన బౌద్ధ సంఘం మొత్తానికి ధ్మసేనాపతిగా సారిపుత్ర భిక్షువును మాఘ పున్నమి రోజునే బుద్ధుడు నియమించాడు. అలాగే... తొలి ధర్మచక్ర ప్రవర్తన జరిగిన ఆషాఢ పున్నమి అనంతరం వచ్చిన వర్షావాసం తరువాత.... మాఘ పున్నమి రోజునే బౌద్ధ సంఘానికి తొలిసారిగా కొన్ని నియమాలు బుద్ధుడు ఏర్పరిచాడు. ఈ భిక్షు నియమాలు ‘వినయ పిటకం’గా ప్రసిద్ధి చెందాయి. అలా బౌద్ధ సంస్కృతిలో మాఘ పున్నమి ఒక విశిష్ట స్థానాన్ని పొందింది.

 

బుద్ధుడు ముప్ఫై ఆరవ యేట జ్ఞానోదయం పొందిన తరువాత దాదాపు నలభై అయిదేళ్ళు తన ధర్మాన్ని నిర్విరామంగా ప్రచారం చేశాడు. ప్రజల నుంచి కనీ వినీ ఎరుగని ఆదరణ పొందాడు. బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. వ్యక్తులకన్నా సంఘమే చిరస్థాయిగా నిలబడుతుందని నమ్మాడు. వేలాది ఆరామాలు, విహారాలు, సంఘ శాఖలు ఏర్పడిన తరువాత... ఇక నిర్వాణ మార్గానికి మళ్ళాలని 

అనుకున్నాడు. 


బొర్రా గోవర్ధన్‌

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.