సర్వ సమానతా మార్గదర్శి!

Apr 30 2021 @ 00:00AM

బుద్ధ భగవానుణ్ణి ‘ఆచ్ఛరియ మనుషో’ అంటారు. అంటే మనుషుల్లో ఆశ్చర్యం కలిగించేవాడు. బుద్ధుని బోధలు చదివినా, ఆయన ఆచరణను గమనించినా, ఆయన చెప్పిన కొన్ని సందేశాలను చూసినా ఆశ్చర్యం కలిగిస్తాయి. ‘ఈనాటి ఆధునికులకు కూడా పూర్తిగా అందని కొన్ని అంశాలను 2,500 ఏళ్ళ క్రితమే బుద్ధుడు ఎలా చెప్పాడు? ఎలా చెప్పగలిగాడు?’ అనిపిస్తుంది. అందుకే బౌద్ధాన్ని ‘అకాలికం’ అంటారు. ఈ భూమి మీద మానవ సమాజం ఉన్నంత వరకూ ఆ తథాగతుని బోధలు అనుసరణీయమే.


ధార్మిక, నైతిక అంశాలే కాదు... ప్రజాస్వామ్యం, సామ్యవాదం లాంటి రాజకీయ అంశాలు కూడా బుద్ధుని బోధల్లో కనిపిస్తాయి. ‘ప్రజల సంక్షేమమే పాలకుల ప్రాథమిక కర్తవ్యం’ అని చెప్పే విషయాలూ ఉంంటాయి. అశోకుడు తన పాలనలో చేసిన సంస్కరణలన్నిటికీ బుద్ధుని బోధనలే ఆధారం.

గత వందేళ్ళలో ఆవిష్కృతమైన గొప్ప సామాజిక అంశాల్లో సామ్యవాదం ఒకటి. ఈ సామ్యవాద, సమసమాజ భావాలు ప్రపంచం మొత్తాన్ని తట్టి లేపాయి. మనుషుల మధ్య కుల, మత, ప్రాంత, వర్ణ బేధాలు ఎలా ఉండకూడదో, ఆర్థిక తారతమ్యాలు కూడా అలాగే ఉండకూడదన్నది సామ్యవాదం. ధనికులు, పేదలు లేని సమాజ నిర్మాణం అది. ఆ సమాజంలో వ్యక్తిగత ఆస్తులు ఉండవు. ఆస్తి అంతా సమాజానిదే! దీనివల్ల స్వార్థం, దోపిడీ, దురాగతాలు, దండయాత్రలూ, ద్వేషాలూ నశిస్తాయి. ఇది ఒక అత్యున్నత సామాజిక నిర్మాణం అని ప్రపంచం అంగీకరించింది. చాలా దేశాల్లో ఇలాంటి సమాజ నిర్మాణాల కోసం పోరాటాలు జరిగాయి. 

కానీ ఎంతో కాలం కిందటే... పోరాటాలు లేకుండా, కేవలం తన తాత్త్విక బోధలతోనే బుద్ధుడు అలాంటి సమాజాన్ని ఈ ప్రపంచంలో తొలిసారి నిర్మించాడు. అదే బౌద్ధ భిక్షు సంఘం. కుల, మత, ప్రాంతీయ గుర్తింపులను వదులుకున్న వ్యక్తికే బౌద్ధ భిక్షు సంఘంలో ప్రవేశం ఉంటుంది. అక్కడ పెద్దరికాన్ని కొలిచేది కేవలం జ్ఞానం, ప్రజ్ఞ, శీల సంపదలతో మాత్రమే! ఇది సామ్యవాద సమాజ నిర్మాణంలో తొలి మెట్టు. ఇందులో చేరిన సభ్యులందరికీ ఒకే రకమైన వేషధారణ ఉంటుంది. అవి సాధారణమైన కాషాయ చీవరాలు. విలువైన, అతి నాజూకైన చీవరాలు ధరించడం నిషిద్ధం. ఇలా సభ్యులందరికీ ఒకే రకమైన వస్త్రధారణ బౌద్ధంతోనే మొదలయింది. ఈ చీవరాలు కూడా మూడు మాత్రమే ఉండాలి. పాతది కొద్దిగా నలిగిపోయినా, చిరిగిపోయినా కొత్త చీవరం ధరించకూడదు. పాతవాటికి చిరుగులు కుట్టుకొని ధరించాలి. కొత్త చీవరం మార్చుకోవడానికి సంఘం అనుమతి కావాలి. బుద్ధుడు ధరించిన చీవరానికి వందకు పైగా చిరుగులు కుట్టి ఉండేవి. వాటిని ఆయనే స్వయంగా కుట్టుకొనేవాడు. అందరూ అలాగే చేయాలి. ఇది వేషధారణ విషయంలో సామ్యవాదం.

ఇక ప్రతి భిక్షువు దగ్గరా ఎనిమిది వస్తువులు మాత్రమే ఉండాలి. అవి: మూడు చీవరాలు, ఒక భిక్షాపాత్ర, నీరు వడగట్టుకొనే వస్త్రం ముక్క, ఒక సూది, వెంట్రుకలు కత్తిరించే కత్తి, నడుముకు కట్టుకోవడానికి వస్త్రంతో చేసిన ఒక పట్టీ (బెల్టు). ఇవి భిక్షువుల దగ్గర ఉన్నంత మాత్రాన... అవి కూడా వారి సొంత ఆస్తి కాదు. సంఘం ఉమ్మడి ఆస్తి. 

అలాగే, ఆరామంలో ఉన్నప్పుడు... భిక్షువులు తాము స్వీకరించి తెచ్చిన భిక్షను ఎవరికి వారు భుజించకూడదు. కొందరికి మంచి భిక్ష దొరకవచ్చు, మరొకరికి మంచిది దొరక్కపోవచ్చు. ఇంకొకరికి అసలు భిక్షే లభించకపోవచ్చు. కాబట్టి వారు తాము తెచ్చిన అన్నిటినీ ఒక చోట ఉంచి, అందరూ సమానంగా పంచుకోవాలి. ఇది ఆహారంలో పాటించాల్సిన సామ్యవాదం. ఎవరైనా దాతలు విలువైన వస్తువులు, విరివిగా ఆహార పదార్థాలు, కానుకలు, ధనం దానంగా ఇస్తే అవన్నీ భిక్షు సంఘానికే తప్ప వ్యక్తిగతంగా ఏ భిక్షువుకూ చెందవు. ఇలా భిక్షు సంఘంలో ప్రతీదీ ఉమ్మడిదే! సంఘానిదే! ఒకవేళ భిక్షువు మరణిస్తే... అతని దగ్గర ఉన్న ఎనిమిది వస్తువులూ తిరిగి సంఘానికే చెందుతాయి.

బౌద్ధ సంఘంలో బుద్ధుని తరువాత స్థానం సారిపుత్రుడిది. బుద్ధుడే సారిపుత్రుణ్ణి ‘ధర్మసేనాని’ అని పిలిచేవాడు. ఆ సారిపుత్రుడు వృద్ధాప్యంలో ఒక రోజున బుద్ధుని దగ్గర సెలవు తీసుకొని సొంత ఊరు నలందకు వెళ్ళాడు. అప్పుడు బుద్ధుడు శ్రావస్తిలోని జేతవనంలో ఉన్నాడు. సారిపుత్రుడు నలంద చేరాక, అనారోగ్యంతో అక్కడే మరణించాడు. మరణశయ్యలో ఉన్న సారిపుత్రుడు తన బంధువులతో ‘‘నా మరణానంతరం ఈ ఎనిమిది వస్తువులనూ జేతవన బౌద్ధ సంఘానికి అప్పగించండి’’ అని చెప్పాడు. అతని మాట ప్రకారం... ఆ వస్తువులను దాదాపు నాలుగువందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌద్ధ సంఘానికి అతని బంధువులు చేర్చారు. 

ఇంత గొప్ప సమసమాజ నిర్మాణాన్ని ఆచరణ ద్వారా బుద్ధుడు చూపించాడు. ‘‘మా దేశంలో సమసమాజ నిర్మాణానికి మార్గం... బుద్ధుడు చూపిన ధర్మ మార్గమే!’’ అంటాడు వియత్నాం జాతిపిత హోచిమిన్‌! అందుకే... బుద్ధుడు శాంతి, శీలం, సహనం అనే ధర్మాలతో పాటు సమసమాజ సద్ధర్మాన్ని అందించిన అద్వితీయుడు.

- బొర్రా గోవర్ధన్‌


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.