బడ్జెట్ ముద్రణకు సంబంధించిన ఈ విషయాలు తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-01T18:00:49+05:30 IST

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను..

బడ్జెట్ ముద్రణకు సంబంధించిన ఈ విషయాలు తెలిస్తే..

న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌పై దేశప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న నాలుగవ బడ్జెట్ ఇది. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్. బడ్జెట్ ముద్రణకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నార్త్‌బ్లాక్‌లో..

ప్రతి సంవత్సరం బడ్జెట్‌ రూపకల్పనకు ముందు నార్త్‌బ్లాక్‌లో ఉన్న మంత్రివర్గం కార్యాలయంలోకి బయటి వ్యక్తులు, మీడియా ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే.. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం.. బడ్జెట్ పత్రం పార్లమెంటులో సమర్పించే వరకు ఒక రకమైన నిఘా పత్రం. బడ్జెట్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం లీక్ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు.


1950 వరకు..

1950వ సంవత్సరం వరకు రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్‌ ముద్రణ జరిగేది. అయితే అక్కడ బడ్జెట్‌లో కొంత భాగం లీక్‌ అయింది. దీంతో ఆ తరువాత మింటో రోడ్‌లో ఉన్న ప్రభుత్వ ప్రెస్‌లో ముద్రణ జరిగేది. 1980 నుండి నార్త్ బ్లాక్ ప్రెస్‌లో బడ్జెట్ ముద్రణ ప్రారంభమై, అదే కొనసాగుతోంది.

నీలిరంగు షీట్..

బడ్జెట్ తయారు చేయడానికి ముందు నీలిరంగు షీట్ తయారు చేస్తారు. దీనిలో కీలకమైన ఆర్థిక డేటా ఉంచుతారు. దీని ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందిస్తుంటారు. ఆర్థిక మంత్రి కూడా ఈ బడ్జెట్ షీట్‌ను బయటకు తీయలేరు. దీని కస్టడీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (బడ్జెట్) వద్ద ఉంటుంది. 

వారి ప్రవేశంపై నిషేధం

ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి మీడియా, ఇతర బయటి అతిథుల ప్రవేశం నిషేధం. అలాగే ఈ మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులు.. కార్యాలయ వ్యవస్థలో వ్యక్తిగత ఇ-మెయిల్‌లను యాక్సెస్ చేయలేరు. అలాగే సీఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసు, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వద్ద కాపలాగా ఉంటారు. బడ్జెట్‌ను రూపొందించే అధికారులను కలవడానికి వెళ్లే వ్యక్తులపై వీరు నిఘా పెడతారు. మంత్రిత్వ శాఖలో అత్యవసర పనులు ఉన్న వారికి మాత్రమే కార్యాలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. 

Updated Date - 2022-02-01T18:00:49+05:30 IST