బడ్జెట్‌పై కసరత్తు షురూ

ABN , First Publish Date - 2022-02-22T15:56:02+05:30 IST

రాష్ట్ర విత్తమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ రాష్ట్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారం భించారు. మరో నెల రోజుల్లో బడ్జెట్‌ దాఖలు చేయాలని నిర్ణయించిన ఆయన.. ఆ మేరకు అందరి అభిప్రాయాలను, సూచనలు, సలహాలను స్వీకరిం

బడ్జెట్‌పై కసరత్తు షురూ

- వివిధ శాఖల కార్యదర్శులు, పారిశ్రామికవేత్తలతో ఆర్థిక మంత్రి చర్చ

- మార్చి మొదటివారంలో అసెంబ్లీలో దాఖలు?


చెన్నై: రాష్ట్ర విత్తమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ రాష్ట్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. మరో నెల రోజుల్లో బడ్జెట్‌ దాఖలు చేయాలని నిర్ణయించిన ఆయన.. ఆ మేరకు అందరి అభిప్రాయాలను, సూచనలు, సలహాలను స్వీకరించడం ప్రారంభించారు. మార్చి మొదటివారంలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల రూపకల్పన సోమవారం నుంచి ప్రారంభ మైంది. ఆ మేరకు ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ యేడాది శాసనసభ తొలి సమావేశం జనవరి 5వ తేదీ గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు రోజులపాటు జరిగిన ఆ సమావేశాల్లో 15 ముసాయిదా చట్టాలను ఆమోదించారు. ఆ తర్వాత ఈ నెల ఎనిమిదిన నీట్‌ మినహాయింపు బిల్లు ఆమోదం కోసం శాసనసభ ప్రత్యేక సమావేశం జరిగింది. బడ్జెట్‌ సమావేశాలను ఈ నెలలోనూ జరపాలని ప్రభుత్వం భావించి నప్పటికీ, మున్సిపల్‌ ఎన్నికలు జరగడంతో సమావేశాలను మార్చి మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయించింది. బడ్జెట్‌ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు, వాణిజ్యవేత్తలు, ఆర్థిక నిపుణులతో చర్చించడం ఆనవాయితీ. ఆ మేరకు సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయం సమీపంలోని నామక్కల్‌ కవింజర్‌ మాళిగై భవనంలో ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ అధ్యక్షతన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు తంగం తెన్నరసు, దామో అన్బరసన్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుకూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయించాల్సిన నిధులపై ఆయన సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై కూడా పారిశ్రామికవేత్తలతో ఆయన సమీక్ష జరిపారు. ఇదే విధంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించడం కోసం మరో రెండు రోజులపాటు ఆయన ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలతో, మరికొందరు మంత్రులతో  చర్చించనున్నారు. ఈ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ కలిసి ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత బడ్జెట్‌ రూపొందించే ప్రక్రియ ప్రారంభమవుతుంది.. ఈ పనులన్నీ మార్చి మొదటి వారంలోగా పూర్తవుతాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మార్చి మొదటివారమే మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కూడా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఇదిలా వుండగా ఈ బడ్జెట్‌లో మహిళలకు వరాలు ప్రకటించడం ఖాయమని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద గృహిణులకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసేలా పథకాన్ని ప్రకటించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2022-02-22T15:56:02+05:30 IST