దశాబ్దాల బడ్జెట్ సంప్రదాయాలకు చెక్.. నూతన పోకడల్లో మోదీ సర్కారు!

ABN , First Publish Date - 2022-02-01T17:12:16+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

దశాబ్దాల బడ్జెట్ సంప్రదాయాలకు చెక్.. నూతన పోకడల్లో మోదీ సర్కారు!

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారధ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ 10వ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నది. ఈ నేపధ్యంలో ఆసక్తికర బడ్జెట్ చరిత్ర గురించి తెలుసుకుందాం. బీజేపీ నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మొదలుకొని.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సంప్రదాయాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

మారిన సాధారణ బడ్జెట్ తేదీ

2014 సంవత్సరంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు.. ఫిబ్రవరి నెల చివరి తేదీ అయిన ఫిబ్రవరి 28 లేదా 29 తేదీల్లో బడ్జెట్‌ను సమర్పించేవారు. అయితే మోడీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని మార్చివేసి.. ఫిబ్రవరి నెలాఖరుకు కాకుండా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ప్రారంభించింది. బడ్జెట్ సమావేశాల్లో ఇది పెద్ద మార్పు.


సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం 

సంప్రదాయాలను మార్చే రేసులో నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందు ఉంటోంది. 1924 నుంచి కొనసాగుతున్న రైల్వే బడ్జెట్ సంప్రదాయాన్ని 2016లో మార్చివేసింది. 2016కి ముందు సాధారణ బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా సమర్పించేవారు. అయితే 2016లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టారు. దేశంలో మొట్టమొదటి రైల్వే బడ్జెట్ 1924 సంవత్సరంలో ప్రవేశపెట్టారు.

రెడ్ బ్రీఫ్‌కేస్‌కి చెక్ 

బడ్జెట్ చరిత్రలోని సంప్రదాయాలను పరిశీలిస్తే 1947 నుంచి దేశ సాధారణ బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించేందుకు ఎరుపు రంగు బ్రీఫ్‌కేస్‌ వినియోగించేవారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 సంవత్సరంలో ఈ సంప్రదాయాన్ని మార్చివేసింది. అప్పటి నుంచి ఎరుపు బ్రీఫ్‌కేస్‌కు బదులుగా బడ్జెట్‌ను ఎర్రటి గుడ్డలో చుట్టి, లెడ్జర్ రూపంలో తీసుకువస్తున్నారు. 

వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ..

నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ముందు బిజెపి నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కూడా బడ్జెట్‌కు సంబంధించిన పాత సంప్రదాయాన్ని మార్చివేసింది. 1999కి ముందు అన్ని బడ్జెట్‌లు సాయంత్రం ఐదు గంటలకు సమర్పించేవారు, అయితే 1999లో ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టి, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తొలిసారిగా ఉదయం 11 గంటలకు సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూవస్తున్నారు. 

Updated Date - 2022-02-01T17:12:16+05:30 IST