బడ్జెట్‌.. తెర వెనుక వీరులు

ABN , First Publish Date - 2022-01-29T08:55:06+05:30 IST

కేంద్ర బడ్జెట్‌ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. ..

బడ్జెట్‌..  తెర వెనుక వీరులు

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఇది మాత్రమే అందరికీ తెలుసు. అయి తే ఈ బడ్జెట్‌ తయారీ కోసం అహోరాత్రులు కష్టపడే కీలక వ్యక్తుల గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌  తయారీలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు వ్యక్తులు వీరే.


టీవీ సోమనాథన్‌, కార్యదర్శి, డీఓఈ: ఈ సంవత్సరం బడ్జెట్‌ రూపకల్పనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సహకరించిన వ్యక్తుల్లో సోమనాథన్‌ అత్యంత సీనియర్‌ అధికారి. తమిళనాడుకు చెందిన ఈయన 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. బడ్జెట్‌లో మూలధన పెట్టుబడులకు సంబంధించి  ఈయన సలహాలపైనే ఆధారిపడినట్టు భావిస్తున్నారు. 


దేబాశిష్‌పాండే,కార్యదర్శి,ఆర్థిక సేవల విభాగం: ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా దేబాశిష్‌ పాండే అనేక ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. ఎల్‌ఐసీ ఐపీఓను పట్టాలెక్కించటంలో ఈ 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అఽధికారి కీలకంగా ఉన్నారు.  


అజయ్‌ సేథ్‌, కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాలు: ఈ ఐఏఎస్‌ అధికారి గత ఏడాది ఏప్రిల్‌లో  కేంద్ర  ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.  అధిక జీడీపీ వృద్ధి రేటు కొనసాగేలా ప్రైవేటు పెట్టుబడులు పెంచేందుకు బడ్జెట్‌లో ఎలాంటి చర్య లు తీసుకోవాలనే విషయాన్ని సేథ్‌కు అప్పగించారు. ఆర్థిక మంత్రి చదివే బడ్జెట్‌ ప్రసంగ తయారీ కూడా ఈయనే చేస్తున్నారు. 


తుహిన్‌ కాంత్‌ పాండే, కార్యదర్శి, దీపమ్‌: ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణలో పాండేది కీలక పాత్ర. ఎల్‌ఐసీ ఐపీఓ ప్రక్రియలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022- 23 బడ్జెట్‌లో మరెన్ని పీఎ్‌సయూల ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఈయన ముందుకు తెచ్చారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


తరుణ్‌ బజాజ్‌, రెవెన్యూ కార్యదర్శి: పరిపాలన, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో తరుణ్‌ బజాజ్‌కు 31 ఏళ్ల అనుభవం ఉంది. కొవిడ్‌ నేపథ్యంలో చేపట్టిన హెల్త్‌కేర్‌ ప్యాకేజీలో కీలకపాత్ర పోషించారు. బడ్జెట్‌లో ఏయే రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలనే విషయాన్ని బజాజ్‌కు అప్పగించారు. 

Updated Date - 2022-01-29T08:55:06+05:30 IST