
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో కుక్క కాటుకు గేదె, దాని దూడ మరణించడంతో బెంబేలెత్తపోయిన స్థానికులు ఆసుపత్రికి పరుగులు తీశారు. రేబిస్ వ్యాక్సిన్ కావాలంటూ వైద్య సిబ్బంది ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటన గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. కుక్క కరవడంతో ఒక గేదె, దూడ మృతి చెందాయనే వార్త స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కుక్కకాటుకు గురైన గేదె పాలు తాము తాగామని చెబుతూ వారు ఆరోగ్య కేంద్రానికి పరుగుపరుగున చేరుకున్నారు. తమకు రేబిస్ వ్యాక్సిన్ కావాలంటూ వైద్య సిబ్బందిమీద ఒత్తిడి తీసుకువచ్చారు.
స్థానికంగా జరిగిన ఒక మతపరమైన వేడుకలో ఆ గేదె పాలతో తయారు చేసిన ఆహారాన్ని గ్రామస్తులంతా తిన్నారు. అయితే గేదె మృతి చెందిందని తెలియగానే వారంతా ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ ఘటన గ్వాలియర్ జిల్లాలోని దబ్రా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆ గేదె పాలు చాలా ఇళ్లకు పంపిణీ అవుతుంటాయి. దానిని ఒక పిచ్చికుక్క కరిచిందని తెలిసిన స్థానికులు తమకు కూడా రేబిస్ సోకుతుందని భయపడిపోయారు. కాగా ఆసుపత్రికి చేరుకున్నవారికి అక్కడి వైద్య సిబ్బంది ఇందులో భయపడాల్సింది ఏమీ లేదని చెప్పినా వారు అక్కడి నుంచి కదలలేదు. చివరికి గ్వాలియర్ మెడికల్ కాలేజీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ సెంటర్ అధికారులు ఈ ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని కొంతమేరకు చక్కదిద్దారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో 150 మందికి యాంటీ రేబిస్ ఇంజక్షన్లు ఇచ్చారు. ఆసుపత్రిలో యాంటీ రేబిస్ ఇంజక్షన్లు అయిపోవడంతో చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీశారు.