
- పెరుగుతున్న ఎండలు
- జిల్లాలో మూడు అగ్నిమాపక కేంద్రాలు
- వేధిస్తున్న అధికారులు, సిబ్బంది కొరత
మంథని, మార్చి 25: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఏ చిన్న అగ్ని ప్రమాదం సంభవించినా పెనుముప్పుగా మారే అవకాశం లేకపోలేదు. కాస్తంత ఏమరుపాటుతో.. చిన్నచిన్న తప్పిదాలతో.. దావాగ్నిగా మారితే లక్షల రూపాయల ఆస్తులు, విలువైన ప్రాణాలు బుగ్గి పాలుకావాల్సిందే. ముదురుతున్న ఎండలతో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటే నివారించడం సవాల్‌గా మారుతుంది.
పరిష్కారం కాని సమస్యలు..
జిల్లాలో 16 మండలాలున్నాయి. పెద్దపల్లి, మంథని, గోదావరిఖనిల్లో మూడు ఫైర్స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. వీటిల్లోని ఫైరింజన్లలో వేగంగా నీరు నింపేందుకు 5 హెచ్‌పీ బోరుమోటారు ఉండాల్సి ఉండగా, హాఫ్ హెచ్‌పీ మోటార్లు ఉన్నాయి. దీంతో ఫైరింజన్లలో నీరు నింపడం ఆలస్యం అవుదోందని సమాచారం. అలాగే ఫైర్స్టేషన్లలో అధికారులు, సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి. ఏదైనా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటే నివారించడానికి ఫైర్ఇంజన్లు సకాలంలో వచ్చే అవకాశం లేదు. అదే జరిగితే అగ్నిప్రమాదాల్లో ఇండ్లు, షాపులు, విలువైన సామగ్రి, నగదు బూడిదపాలు కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశముంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశముంది. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తమ మొబైల్ లేదా ఫోన్ ద్వారా 101కు కాల్ చేసి సంబంధిత ప్రమాద, చిరునామ తదితర వివరాలు తెలియజేస్తే అగ్ని మాపక సిబ్బంది సకాలంలో అక్కడికి వచ్చి ప్రమాదాలను నివారించడాకి ఆస్కారముంటుంది. 101 కాలింగ్ పూర్తిగా ఉచితం. అగ్ని ప్రమాదాల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రతలు తీసుకోవాల్సిన అవసరముంది..
నివాస గృహాల్లో..
చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాసులు, మండే పదార్థాలను అందుబాటులో ఉంచకూడదు. కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలను పూర్తిగా ఆర్పివేయకుండా పడవేయవద్దు. ఇంట్లోని వైరింగ్‌లో ఐఎస్ఐ కలిగి ఉన్న ఎలక్ర్టికల్ వస్తువులను మాత్రమే వినియోగించాలి. ఎక్కువ రోజులు ఊరికి వెళ్తే విద్యుత్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎప్పుడూ ఇంట్లో నీరు నిల్వ ఉండే విధంగా చూసుకోవాలి. వంట గదుల్లో వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి. గ్యాస్ ట్యూబ్‌లను ఐఎస్ఐ మార్క్ ఉన్న వాటినే వాడాలి. గ్యాస్ సిలిండర్ వినియోగం తరువాత రెగ్యులేటర్ వాల్వును ఆపివేయాలి. గ్యాస్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మండుతున్నప్పుడు స్టౌవ్‌లో కిరోసిన్ పోయవద్దు. వంటగదిలో కిరోసిన్ పెట్రోల్, డిజీల్, ఆదన పు గ్యాస్ సిలిండర్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..
స్కూల్స్, షాపింగ్ మాల్స్, ఆసుపత్రుల్లో..
స్కూల్స్, షాపింగ్ మాల్స్, ఆసుపత్రుల్లో ఆర్సీసీ కప్పును మాత్రమే వాడాలి. ఫైర్ అలార్మం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమున్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి. సెల్లార్లలో ఆటోమెటిక్ స్ర్పింక్లర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయటపడాలో అందరికీ తెలిసే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఐఎస్ఐ మార్క్ కలిగిన ఎలక్ర్టికల్ సామాగ్రి మాత్రమే వినియోగించాలి. బయటికి వచ్చే మార్గాల్లో మెట్లు, తలుపుల వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. తాటి ఆకులు, గడ్డితో చేసిన పైకప్పులను వినియోగించరాదు. ఎలక్ర్టికల్ షార్ట్‌సర్క్యూట్ జరగకుండా మినీ పీహెచ్ఆర్ సర్క్యూట్ బ్రేకర్స్‌ను అమర్చాలి. ఫ్లేమ్ ఫూఫ్ మోటార్ స్పార్క్ స్విచ్‌లను మాత్రమే వినియోగించాలి. ప్రమాదాలను ఆరికట్టడానికి సరిపడా నీటిని, ఫిక్స్డ్ ఫైర్‌ఫైటింగ్ ఎక్స్టింగ్విషర్స్ను నిబంధనల మేరకు ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలి. ఫైర్ఎనాక్యుయేషన్ డ్రిల్లులను ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా పరిశీలించాలి.
గోదాములు, గిడ్డంగుల్లో..
స్టాక్‌ను చెక్క స్లీపర్లపైన మాత్రమే నిల్వచేయాలి. వివిధ రకాల వస్తువులను స్టోరేజ్ అరల్లో వేర్వేరుగా నిల్వచేయాలి. మఽధ్యలో గ్యాంగ్వే లేదా క్రాస్ సెక్షన్లను ఉంచాలి. వస్తువులను 4.5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిల్వ చేయరాదు. పైకప్పు స్లాబ్‌కు మధ్యలో కనీసం రెండు అడుగుల దూరం ఉండాలి. వస్తువులు ఎత్తడం, దించే సమయాల్లో వాహనాల్లోని ఇంజన్లను ఆపివేయాలి. తగినంత గాలి, వెలుతురు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
గ్రామీణ ప్రాంతాల్లో..
పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా పేర్చాలి. వీటిని నివాస గృహాలకు 60 అడుగుల దూరంలో నిల్వ చేయాలి. పెద్దపెద్ద గడివాములకు బదులు, చిన్నచిన్న వాములుగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. గడివాముల మధ్య ఖాళీ స్థలం ఉండే విధంగా చూడాలి. గుడిసెల మధ్య కూడా 30 అడుగుల దూరాన్ని పాటించాలి. బహిరంగ మంటలను ఈ ప్రాంతంలో అనుమతించరాదు. వంట పొయ్యిలను పడుకునే ముందు ఆర్పే విధంగా జాగ్రత్తపడాలి. అందుబాటులో తగినంత నీటి నిల్వలను ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.
కర్మాగారాల్లో..
ఉద్యోగులందరికీ అగ్ని ఉనికి ప్రదేశాలను గుర్తించే విధంగా, బేసిక్ ఫైర్ఫైటింగ్లో శిక్షణ ఇవ్వాలి. ప్రమాదాలకు అస్కారమున్న ప్రదేశాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలి. మిషనరీ బెల్టును, పుల్లీలు, విద్యుత్ పరికరాల నుంచి నిప్పు రవ్వలు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్కూట్లపై ఓవర్ లోడ్ పడకుండా చర్యలు తీసుకోవాలి.
విద్యుత్, అగ్ని ప్రమదాలు జరిగినప్పుడు ఏం చేయాలి..
విద్యుత్ ప్రమాదాలు సంభవించినప్పుడు నీటిని వినియోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే ప్రమాదాల నివారణకు వినియోగించాలి. తొలుత విద్యుత్ మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేసిన తరువాత మాత్రమే ఫైర్‌ను ఆర్పడానికి ప్రయత్నించాలి. విద్యుత్ సరఫరా ఉన్న వైర్లపై అత్యవసర పరిస్థితుల్లో కార్భన్‌డయాక్సైడ్ ఎక్స్టింగిషర్ను ఉపయోగించాలి. అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారమందించాలి.
అందుబాటులోకి మిస్డ్బుల్లెట్ సేవలు
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే స్పందించి వేగంగా సంఘటన స్థలానికి చేరుకోవడానికి ఇరుకు సందుల్లోకి సైతం వెళ్ళడానికి అనువుగా ప్రభుత్వం మిస్డ్ బుల్లెట్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అందులో భాగంగా జిల్లాలోని మూడు అగ్నిమాపక కేంద్రాలకు ఒక్కొక్క మిస్డ్ బుల్లెట్ వాహనాన్ని కేటాయించారు.