మెడికల్‌ కళాశాల వేగంగా నిర్మించండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-06-25T06:31:11+05:30 IST

రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో నిర్మించనున్న మెడికల్‌ కళాశాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు.

మెడికల్‌ కళాశాల వేగంగా నిర్మించండి : కలెక్టర్‌
మెడికల్‌ కళాశాల మ్యాప్‌ పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 24 : రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో నిర్మించనున్న మెడికల్‌ కళాశాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. బోధనా వైద్యకళాశాల, మేక్‌ షిప్టు పనులను శుక్రవారం పరిశీలించి అధికారులతో మాట్లాడారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో 150 మంది వైద్యవిద్యార్థులకు తగినట్టు బోధనా వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణ పనులు అక్టోబరు నాటికల్లా పూర్తి చేయాలన్నారు.అనంతరం జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఎంసీహెచ్‌ బ్లాకులోని గైనకాలజీ విభాగంలో వైద్యపరీక్షలకు వచ్చిన ఒక గర్భిణీతో మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి వైద్యసేవలపై ఆరా తీశారు. స్పెషలిస్టు వైద్యసేవల గురించి ఆసుపత్రికి వచ్చేవారికి తెలిసేలా బోర్డుల ద్వారా ప్రదర్శించాలని ఆదేశించారు. ఆమె వెంట సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ పి.అశోక్‌కుమార్‌, ఏఈ (మెడికల్‌) కె.విజయభాస్కర్‌రెడ్డి, డీఈ ఎస్‌.కృష్ణారావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ స్వర్ణలత, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సనత్‌కుమారి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాల్‌ సతీష్‌కుమార్‌,  ఉన్నారు. 


ప్రతి ఇంటి పునాది నిర్మించాలి


రాజమహేంద్రవరం, జూన్‌24(ఆంధ్రజ్యోతి) : రకరకాల కారణాలతో జగనన్న కాలనీల్లోని ఇళ్ల నిర్మాణాలు ఆగడానికి వీలులేదు. వానాకాలం అనే సాకులు చెప్పొద్దు. ప్రతి లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి తక్షణం పునాది పూర్తి కావాల్సిం దేనని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత స్పష్టం చేశారు.  జాయింట్‌ కలెక్టర్‌తో కలసి ఎంపీడీవోలు,  హౌసింగ్‌ డివిజన్‌, మండల స్పెషల ఆఫీసర్లతో  శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలకు సిమెంట్‌ కొరత ఉందనే మాట వినపడకూడదన్నారు.సిమెంట్‌ స్టాక్‌పై పూర్తి నివేదికతో శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌కు హాజరుకావాలని ఆదేశించారు. ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో లేఅవుట్లను పరిశీలించడంలేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఖచ్చితంగా   పరిశీలించి పనులు వేగవంతం చేయాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు తమ శాఖల పనులతోపాటు మండలాల పరిధిలో జరిగే  పనులన్నీ వేగంగా జరగడానికి అవసరమైన సూచనలు ఇవ్వాలన్నారు.


24 వరకూ బిల్లులు అప్‌లోడ్‌ చేయాలి


 రాజమహేంద్రవరం, జూన్‌24(ఆంధ్రజ్యోతి) : ఈనెల 24వ తేదీ వరకూ జరిగిన ప్రతి పనికి చెల్లింపులు జరిగాయా?లేదా? అనే వివరాలన్నీ  తక్షణం ఎన్‌ఐసీ, టీసీఎస్‌ లాగిన్‌లలో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా డివిజన్‌ ,మండల స్థాయి హౌసింగ్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌,డ్వామా అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.   మండలస్థాయి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. సిమెంట్‌ వివరాలు అప్‌లోడ్‌ చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు మండల కేంద్రాల్లోనే ఉండాలని, డీప్యూటీ ఈఈలు రాజమహేంద్రవరంలో ఉండాలని, పీడీ డ్వామా,  పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌,హౌసింగ్‌ ఎస్‌ఈలు ఒకేచోట ఉండి, ప్రతి పనికి సంబంధించిన బిల్లులు, సమగ్రవివరాలు అప్‌లోడ్‌ చేసేలా పర్యవేక్షించాలన్నారు. పేమెంట్‌ చేయవలసిన ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లోనివి వివరాలు మాత్రమే కాకుండా  పూర్తయిన పనులవివరాలన్నీ వెబ్‌సైట్‌లో కనిపించాలన్నారు.  



Updated Date - 2022-06-25T06:31:11+05:30 IST