ఇంటి కొనుగోలుకు ఇతోధికంగా..

ABN , First Publish Date - 2021-01-24T07:35:54+05:30 IST

కరోనాతో కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగం ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఇళ్లకు గిరాకీ పెంచేలా మరిన్ని చర్యలు చేపట్టాలని, గృహ కొనుగోలుదారులకు ఇతోధికంగా ప్రోత్సాహకాలివ్వాలని బిల్డర్లు కోరుతున్నారు...

ఇంటి కొనుగోలుకు ఇతోధికంగా..

  • బడ్జెట్లో ప్రోత్సాహకాలు పెంచాలని కోరుతున్న బిల్డర్లు 


కరోనాతో కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగం ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఇళ్లకు గిరాకీ పెంచేలా మరిన్ని చర్యలు చేపట్టాలని, గృహ కొనుగోలుదారులకు ఇతోధికంగా ప్రోత్సాహకాలివ్వాలని బిల్డర్లు కోరుతున్నారు. 


సెక్షన్‌ 80ఈఈఏ ప్రయోజనాలు పొడిగించాలి.. 

ఐటీ సెక్షన్‌ 24బీ ప్రకారం.. ఏటా రూ.2 లక్షల వరకు గృహ రుణ వడ్డీ చెల్లింపులపై ఐటీ మినహాయింపు పొందవచ్చు. గృహ రుణగ్రహీతలకు అదనపు ప్రోత్సాహకాలు కల్పించేందుకు 2019 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సెక్షన్‌ 80ఈఈఏను ప్రవేశపెట్టింది. ఈ సెక్షన్‌ ప్రకారం.. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31మధ్యలో మొదటి సారి ఇళ్లు కొనుగోలు చేసిన వారు హోమ్‌ లోన్‌పై మరో రూ.1.50 లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందే అవకాశం కల్పించింది. అంటే, వీరికి ఏటా రూ.3.50 లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పొందే అవకాశం లభించింది. 2020 బడ్జెట్లో ప్రభుత్వం సెక్షన్‌ 80ఈఈఏ ప్రయోజనాలను మరో ఏడాది పాటు (2021 మార్చి 31 వరకు) పొడిగించింది. కరోనా సంక్షోభంతో ప్రాజెక్టుల్లో గృహ నిల్వలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో సెక్షన్‌ 80ఈఈఏను కనీసం మరో ఏడాదిపాటు (2022 మార్చి 31 వరకు) పొడిగించాలని రియల్‌ ఎస్టేట్‌ రంగం కోరుతోంది. రూ.45 లక్షల వరకు ఖరీదైన గృహ కొనుగోలుదారులకు మాత్రమే సెక్షన్‌ 80ఈఈఏ ప్రయోజనాలు వర్తిస్తాయి. మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో ఈ పరిమితిని రూ.65-75 లక్షల వరకు పెంచాలన్న డిమాండు వ్యక్తమవుతోంది. 


సెక్షన్‌ 24బీ పరిమితినీ పెంచాలి.. 

ఈ సెక్షన్‌ ప్రకారంగా ఏటా రూ.2 లక్షల వరకు గృహ రుణ వడ్డీ చెల్లింపులపై కల్పిస్తోన్న పన్ను మినహాయింపు పరిమితిని సైతం పెంచాలని రియల్టీ వర్గాలు కోరుతున్నాయి. రూ.5 లక్షల వరకు పెంచగలిగితే దేశంలో గృహల గిరాకీ పునరుద్ధరణకు భారీ మద్దతు లభిస్తుందని కొందరు బిల్డర్లు అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2021-01-24T07:35:54+05:30 IST