ఇండియాలో ఇల్లు కొనాలనుకున్న NRI మహిళకు ఊహించని షాక్!

ABN , First Publish Date - 2022-04-30T22:11:06+05:30 IST

ఇండియాలో ఇల్లు కొనాలనుకున్న ఎన్నారై మహిళకు భారీ షాక్ తగిలింది. బిల్డర్ చేసిన మోసం కారణంగా ఆమె ఏకంగా మూడు కోట్లు నష్టపోయారు.

ఇండియాలో ఇల్లు కొనాలనుకున్న NRI మహిళకు ఊహించని షాక్!

builders cheat NRI out of her money ఇండియాలో ఇల్లు కొనాలనుకున్న ఎన్నారై మహిళకు భారీ షాక్ తగిలింది. బిల్డర్ చేసిన మోసం కారణంగా ఆమె ఏకంగా మూడు కోట్లు నష్టపోయారు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రియాంక దేశాయ్ అమెరికాలో నివసిస్తుంటారు. ఆమె తండ్రి రమేశ్ గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఉంటారు. కాగా.. 2017లో ఆయనకు ఓ కొత్త హౌసింగ్ ప్రాజెక్టు గురించి తెలిసింది. సెంట్రల్ పార్క్ సొసైటీ వారు ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు తెలియడంతో ఆయన వారి కార్యాలయానికి వెళ్లి సొసైటీ గురించి వాకబు చేశారు. ఈ క్రమంలో సొసైటీ గేటు వద్ద ఉన్న సెక్యురిటీ గార్డు.. మెహతా, పాంచాల్ అనే ఇద్దరు బిల్డర్ల ఫోన్ నెంబర్లు ఇచ్చారు. 


కొద్ది రోజుల తరువాత రమేశ్ ఆ ఇద్దరినీ కలిశారు. ఆ సందర్భంగా.. రమేశ్ కొనుగోలు చేయదలచిన ఫ్లాట్ రూ.3 కోట్లు ఖరీదు చేస్తుందని వారు తెలిపారు. 2020 కల్లా ఫ్లాట్ నిర్మించి ఇచ్చేస్తామన్నారు. వారి మాటలను నమ్మిన రమేశ్ ముందుగా కొంత అడ్వాన్సు చెల్లించారు. ఆ తరువాత.. ప్రియాంక మిగతా మొత్తాన్ని ఆన్‌లైన్‌లో ఆ ఇద్దరికీ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ క్రమంలో 2021లో రమేశ్, ఆయన బంధువు హిరేన్ కపాసియావాలా మరోసారి  బిల్డర్లను సంప్రదించగా.. కరోనా కారణంగా ఫ్లాట్ నిర్మాణం ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. తొందర్లోనే ఫ్లాట్ అప్పజెబుతామన్నారు. ఈ క్రమంలో రమేశ్, హిరేన్.. సొసైటీ సెక్రెటరీని కలిసి ఫ్లాట్ గురించి చెప్పగా.. దాన్ని 2019లోనే చిరాగ్ పండిట్ అనే వ్యక్తికి  అమ్మేసినట్టు చెప్పడంతో వారిద్దరూ అవాక్కైపోయారు. 


ఈ విషయమై మళ్లీ వారు ఆ ఇద్దరు బిల్డర్లను ప్రశ్నించగా.. హౌసింగ్‌  సొసైటీలో పండిట్ ఓ ఇన్వెస్టర్ అని, అందుకే ఫ్లాట్‌ను ఆయనకు ఇవ్వాల్సి వచ్చిందని వారు మరో కథనం వినిపించారు. ఇందుకు బదులుగా మరో ఫ్లాట్ ఇస్తామని ప్రతిపాదించారు. అయితే.. ఈ ఫ్లాట్ విషయంలోనూ వారు మళ్లీ మాట తప్పారు. అంతేకాకుండా..ప్రియాంక డబ్బు కూడా వెనక్కు తిరిగివ్వలేదు. దీంతో.. మోసపోయామని బాధితులు గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయించారు. ప్రియాంక తరుఫున హిరేన్ కేసు నమోదు చేశారు.



Updated Date - 2022-04-30T22:11:06+05:30 IST